తుది.. కసరత్తు | Sakshi
Sakshi News home page

తుది.. కసరత్తు

Published Mon, Jan 13 2014 4:42 AM

voter list announcement in this month 31st

సాక్షి, నల్లగొండ: వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపొందించడంలో అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌ల వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులను బూత్ లెవల్ అధికారులుగా నియమించి భావి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఆక్షేపణలు, చేర్పులు, మార్పులకు గతనెల 17వ తేదీ ఆఖరు గడువుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు వెలువెత్తుతుండడంతో మరోసారి 23వ తేదీ వరకు గడుపు పొడిగించింది. లక్ష పైచిలుకు దరఖాస్తుల విచారణ చేయడానికి అధిక సమయం అవసరం ఉంటుంది.

 ఈ నేపథ్యంలో ఈనెల 16వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటన సాధ్యం పడదని కమిషన్ భావించింది. 30వ తేదీ వరకు విచారణ పూర్తి చేసి 31 తేదీన జాబితా ప్రకటన వెలువరించాలని అధికారులకు సూచించింది. దీంతో ఎన్నికల విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. దరఖాస్తుల విచారణ చేసి ఆన్‌లైన్ డేటా నమోదులో తలమునకలయ్యారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఓటర్లు కార్డులు అందజేసేందుకు చర్యలు చేపట్టారు.

 జాబితా నుంచి తొలగింపు.....
 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 25,19,560 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,68,595 మంది పురుష, 12,50,929 మంది మహిళా, 36 ఇతర ఓటర్లు. ఇందులో 25,184 మంది బోగస్ ఓటర్లు ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరంతా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇటువంటి వారి ఓట్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపే ప్రభావం ఉంది.  కాగా, గుర్తించిన బోగస్ ఓట్లను అధికారులు తొలగించారు.

 అయితే మరింత నిశితంగా శోధిస్తే మరిన్ని బోగస్ ఓట్లు బయట పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేగాక స్థానికంగా నివాసం ఉండని వారి ఓట్లు 62 వేలకు పైగా ఉన్నాయి. వీరందరికి ఇప్పటికే నోటీసులు పంపి జాబితా నుంచి తొలగించారు. ఇవిపోను, కొత్తగా ఓటరుగా నమోదయ్యే వారి సంఖ్య... జిల్లాలో ఇప్పుడున్న ఓటర్ల కంటే పెర గకపోవచ్చు.

Advertisement
Advertisement