16 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపు | Sakshi
Sakshi News home page

16 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపు

Published Wed, Jan 8 2014 5:42 AM

waiting for job since 16 years

శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ఆశలు చిగురిస్తున్నాయి. కోల్‌బెల్ట్ ఏరియాలో ఎక్కడ విన్నా ఇదే చర్చ. పదహారేళ్లుగా నిలిచిన ఈ హక్కు మళ్లీ సిద్ధిస్తుందని కార్మికులు ఆశపడుతున్నారు. దీన్ని సాధించి తీరుతాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్‌కు ఇది సవాల్‌గా మారింది. కార్మికుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో  2014ను ‘డిపెండెంట్ సాధన సంవత్సరం’గా ఆ యూనియన్ ఇటీవల ప్రకటించింది.

ఇందులో భాగంగా ఈనెల 4 నుంచి 7 వరకు సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్టుమెంట్లపై నిరసన  కార్యక్రమాలు చేపట్టింది. సింగరేణి యాజమాన్యానికి ఐదు జాతీయ సంఘాలకు 1998 జూన్‌లో జరిగిన ఒప్పందం వల్ల వారసత్వ ఉద్యోగాలు నిలిచాయి. ఈ ఒప్పందం ప్రకారం 1997 జూలై నాటికి 1,150 మంది డిపెండెంట్లు వెయిటింగ్‌లో ఉన్నారు.  వీరిలో 575 మందిని ప్రతి నెల 30 మంది చొప్పున తీసుకుంటూ మిగిలిన వారికి ఉద్యోగం బదులు 24 నెలల వేతనాన్ని ఒకేసారి చెల్లిస్తూ ఒప్పందం జరిగింది. కొత్త ప్రాజెక్టులు వస్తేనే కొత్త వారిని తీసుకుంటామని ఈ ఒప్పందంలో రాసుకున్నారు.

దీనిపై 5 జాతీయ సంఘాల నేతలు సంతకాలు చేశారు. అప్పటి నుంచి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్ పడింది. దీంతో తండ్రుల ఉద్యోగాలను న మ్మకున్న చాలామంది పిల్లలు నిరుద్యోగులుగా మారి రోడ్డున పడ్డారు. వారసత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిందని కావున ఉద్యోగాలు రావని జాతీయ సంఘాలు నేతలు ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చారు.

 ఈ హక్కుపైనే గెలిచిన టీబీజీకేఎస్
 గుర్తింపు సంఘం ఎన్నికల్లో అన్ని సంఘాలు వారసత్వ హక్కును నెత్తినెత్తుకొని ప్రచారం చేశాయి. తాము గెలిస్తే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాలపైనే చేస్తామని టీబీజీకేఎస్ కార్మికులకు హామీ ఇచ్చింది. దీంతో కార్మికులు జాతీయ సంఘాలను కాదని గంపెడాశతో ప్రాంతీయ సంఘమైన టీబీజీకేఎస్‌ను గెలిపించారు. కాని వారు గెలిచి ఏడాదిన్నర అవుతున్నా దానిపై సాధించింది శూన్యం. ఏమిటని అడిగితే యాజమాన్యంతో కమిటీ వే యించాం.. డిపెండెంట్ హక్కుపై అధ్యయనం జరుగుతోంది అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

 మొదటి కార్పొరేట్ స్ట్రక్చరల్ సమావేశంలో టీబీజీకేఎస్ వారసత్వ ఉద్యోగాల అంశం లేవనెత్తింది. దీంతో యాజమాన్యం ముందు ముందు గనులను పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో నడపాలి కాబట్టి టెక్నాలజీ చదువులు కార్మికుల పిల్లల వద్ద లేవని తెలిపింది. కార్మికుల పిల్లలు డిప్లొమా, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువుల్లో ఉన్నారని టీబీజీకేఎస్ నేతలు సూచించారు. దీంతో కార్మికుల పిల్లల చదువుల వివరాలు సేకరించడానికి సీఅండ్‌ఎండీ కమిటీ వేయించారు. కమిటీ రిపోర్టు కూడా తయారు చేసింది. ఇంతలోనే గుర్తింపు సంఘం విబేధాలు రావడంతో వారు వారు తన్నుకోవడానికి కాలం సరిపోతోంది. ఇక పట్టించుకునే వారు లేరు.

 పెద్ద ఎత్తున రిటైర్మెంట్..
 సింగరేణిలో పెద్ద ఎత్తున కార్మికులు రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్నారు. ప్రస్తుతం 61,654 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లలలో సుమారు 20 వేల మంది రిటైర్మెంట్ కానున్నారు. ప్రస్తుతం సింగరేణి ఖాళీలు ఉన్నా వాటిని యాజమాన్యం భర్తీ చేయడం లేదు. కారణం మున్ముందు యంత్రీకరణ పెంచుకోనున్న దృష్ట్యా రిక్రూట్‌మెంట్ జోలికి పోవడం లేదు. దీనితోపాటు ఎలక్ట్రీషియన్లు, జేఎంఈటీ, ఓవరమన్లు, క్లర్కులు ఇలా కొన్ని ఉద్యోగాలు ఇటీవల భర్తీ చేస్తున్న కూడా అందులో అర్హత ఉన్న ఇంటర్నల్ వారిని కాదని భయటి వారిని తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వారసత్వ ఉద్యోగాలు వస్తే ఈ ద్యోగాల్లోనైనా తమ కొడుకులు ఉండే వారిని కార్మికులు మధనపడుతున్నారు.

 మెడికల్ రూల్స్‌ను సరళతరం చేయాలి..
 వారసత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిందని యాజమాన్యం, కార్మిక సంఘాలు చెప్పుతున్నాయి. కావున ఈ హక్కు ఎలా సాధిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఉన్న మెడికల్ రూల్స్‌ను పూర్తిగా మార్చి వీటిని సరళతరం చేస్తే అన్‌ఫిట్ ద్వారానైన ఉద్యోగాలు ఇప్పించవచ్చని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వయస్సు మీద పడ్డ తరువాత కార్మికులు జబ్బులు పడి డ్యూటీలు చేయలేని స్థితిలో ఉంటే వారిని మెడికల్ గ్రౌండ్‌లో అన్‌ఫిట్ చేయాలని, దీనికి కొత్తగూడెంలో కాకుండా ఎక్కడిక్కడ ఏరియా ఆస్పత్రుల్లో మెడికల్ బోర్డు సమావేశం పెట్టి అన్‌ఫిట్ చేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పని లేకుండా కార్మికులకు ఇలాగైన డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన వారుతారని పలువురు భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement