‘ఈసార్‌’ అయినా ఇస్తారా? | Sakshi
Sakshi News home page

‘ఈసార్‌’ అయినా ఇస్తారా?

Published Tue, Oct 4 2016 4:37 AM

‘ఈసార్‌’ అయినా ఇస్తారా?

సబ్సిడీ రుణాలకోసం బీసీ, ఎస్సీల నిరీక్షణ
అటు జన్మభూమి కమిటీలు – ఇటు బ్యాంకర్ల కరుణ కరువు 
అందని రుణాలతో దరఖాస్తుదారుల ఆవేదన
కొత్త రుణాలపై నిరుద్యోగులు, చిరువ్యాపారుల కోటి ఆశలు
 
విజయనగరం కంటోన్మెంట్‌:  ప్రభుత్వం బీసీ, ఎస్సీలకు రుణాలిస్తాం... అనగానే నిరుద్యోగుల్లో ఎక్కడ లేని ఆశలు మొదలవుతాయి. తీరా అవి పొందాలనుకునేసరికి అసలైన అవరోధాలు ఎదురవుతాయి. బ్యాంకర్లు సహకరించక... జన్మభూమి కమిటీలు కనికరించక... అర్హత ఉన్నా.... ఏ రుణం పొందలేకపోతున్నారు. గత ఏడాది లక్ష్యాలు ఇదే విధంగా నీరుగారిపోగా... ఈ ఏడాది కొత్త ప్రకటన వచ్చినా... అభ్యర్థుల్లో నిరాశా మేఘాలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఏటా కోట్లాది రూపాయల రుణాలు సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించడమే తప్ప ఎటువంటి రుణాలూ ఇవ్వడం లేదని జిల్లాలోని దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. రుణాల మంజూరుకు అర్హత ఉండాలి కానీ... జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్ల పెత్తనమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. రుణాలన్నీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయి తప్ప మిగిలినవారికి రావట్లేదని వాపోతున్నారు.
 
 
మళ్లీ ఆశలు రేపుతున్న ప్రకటనలు
ఈ ఏడాది అన్ని కార్పొరేషన్లు, పది ఫెడరేషన్లకు రూ.84.18 కోట్లతో 4,685 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించడంతో కొత్త ఆశలు పెంచుకుంటున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి వెబ్‌సైట్‌ ప్రారంభం కానుందనీ, కేవలం 15 రోజులే గడువుందనీ చెప్పడంతో నిరుద్యోగులు, ఆయా సంఘాలు, చిరు వ్యాపారుల్లో మళ్లీ హడావుడి మొదలైంది. కొత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అయినా స్పందించి రుణాలు ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏటా పది వేల నుంచి 20వేల మంది దాకా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నా రుణం మాత్రం వందల్లో కూడా అందడం లేదని ఇందుకు జన్మభూమి కమిటీలు, బ్యాంకర్లే కారణమని వాపోతున్నారు. చాలా రోజులుగా నాన్‌ ఆపరేటివ్‌ అకౌంట్‌ సిస్టం పెట్టి సంబంధిత అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి బ్యాంకర్లు తిప్పుతుండటంతో వేలాది మందికి రుణాలు అందడం లేదు. పైపెచ్చు ఏటా పథకంలోని నిబంధనలు మార్చడంతో బ్యాంకుల ద్వారా డాక్యుమెంటేషన్లు మార్చేందుకు తడిసిమోపెడవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లలో ఏటా పద్ధతి అవలంబించడంతో పరిస్థితి ఇలా తయారయింది.
 
 
గతేడాది లక్ష్యం రూ. 10.08 కోట్లు చేరింది రూ. 7 లక్షలు
బీసీ కార్పొరేషన్‌ గతేడాది రూ. 10.08 కోట్ల బడ్జెట్‌తో 3,144 యూనిట్లను స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 1669 యూనిట్లకు రూ.5.37 కోట్లు మంజూరయ్యాయి. వీటికి సబ్సిడీ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి నాన్‌ ఆపరేటివ్‌ అకౌంట్లను పంపించాల్సి ఉంది. ఇందుకోసం 1402 యూనిట్ల అకౌంట్లను పంపించారు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నా నేటికి కేవలం రూ. 7.25లక్షలతో 21 యూనిట్లు మాత్రమే గ్రౌండయ్యాయి. మిగతావి ఇప్పటికీ పత్తా లేదు. దీనికి కారణం కేవలం బ్యాంకర్లేనని అటు అధికారులు, ఇటు దరఖాస్తుదారులు, లబ్ధిదారులు కూడా ఆరోపిస్తున్నారు. నిధులు కేటాయిస్తున్నప్పటికీ జిల్లాలో నిరుద్యోగ నిర్మూలన, స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారని ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా నిబంధనలు సడలించి ఫలితం ఏముంటుందని పెదవి విరుస్తున్నారు.
 
 
ఎస్సీ కార్పొరేషన్‌లో మరీ ఘోరం 
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి రూ.12 కోట్లతో 1020 యూనిట్లు కేటాయించారు. మరింత మందికి లబ్ధి చేకూర్చే విధంగా 1190 యూనిట్లను మంజూరు చేశారు. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి 984 యూనిట్ల వరకూ సబ్సిడీ విడుదల చేశారు. అయితే ఇందులో కేవలం వంద మాత్రమే గ్రౌండయ్యాయి. మిగతావి ఇప్పటికీ గ్రౌండ్‌ కాలేదు. దీనికి బ్యాక్‌ టు సబ్సిడీ విధానమే కారణమని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదయినా సక్రమంగా రుణాలు అందించి వెంటనే గ్రౌండయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.
 

Advertisement
Advertisement