కొడుకొస్తాడని.. ఏడాదిన్నరగా ఎదురుచూపు | Sakshi
Sakshi News home page

కొడుకొస్తాడని.. ఏడాదిన్నరగా ఎదురుచూపు

Published Thu, Aug 14 2014 6:21 AM

కొడుకొస్తాడని.. ఏడాదిన్నరగా ఎదురుచూపు - Sakshi

ఏడాదిన్నరగా వృద్ధ దంపతుల ఎదురుచూపు
- రైలుబండి కూతవేస్తే బిడ్డ వస్తున్నాడేమో అని ఆశ
- దర్యాప్తు చేసి వదిలేసిన పోలీసులు

పూతలపట్టు: రైలు కూతేస్తే చాలు ఇంటి ముందుకొచ్చి నిలుచుకొని తమ బిడ్డ ఆ బండిలో వస్తాడేమో అని ఆ వృద్ధ దంపతులు ప్రతిరోజూ ఎదురుచూస్తున్నారు. కన్న కొడుకు ఉద్దరిస్తాడని స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఉద్యోగంలో చేర్పిం చాడు. ఒక్కనెల జీతం డబ్బులు కూడా ఆ తల్లిదండ్రులకు చూపించకుండానే పుత్రశోకం మిగిల్చి ఎటో వెళ్లిపోయాడు. బిడ్డ ఆచూకీ కోసం తిరగని ప్రదేశం లేదు. మొక్కని దేవుళ్లు లేరు. నిత్యం కొడుకుకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తునే ఉన్నారు.
 
పూతలపట్టు మండలం యం.బండపల్లె గ్రామానికి సమీపాన రైలురోడ్డు పక్కన నివాసముంటున్న వజ్రవేలు, నారాయణమ్మ మూడో కొడుకు విజయ్ ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. వజ్రవేలు రైల్వేలో గేట్‌మన్‌గా పనిచేస్తుండేవాడు.  గత ఏడాది 2013 జనవరిలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. కుమారుడు విజయ్‌ని రైల్వేలో గేట్‌మన్‌గా చేర్పించాడు. విజయ్ మూడు నెలల పాటు వావిల్‌తోట, ముత్తిరేవుల ఇంటర్లింగ్ లాక్ సిస్టమ్ రైల్వేగేట్లలో గేట్‌మన్‌గా పనిచేశాడు. తరువాత గుంతకల్లు దక్షణమధ్య రైల్వే స్టేషన్‌లోని శిక్షణ సంస్థలో మేనెలలో శిక్షణ పూర్తయిన వెంటనే 27వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
 
అప్లికేషన్ ఇచ్చివస్తానని వెళ్లి..
మే 31వ తేదీన గుంతకల్లులో అప్లికేషన్ ఇచ్చి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి విజయ్ బయలుదేరాడు. ఆ తరువాత ఇంటికి రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగింది. నెలరోజులు గడిచిన తరువాత వారు పూతలపట్టు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి  కొడు కు తమ కనబడలేదని ఫిర్యాదు చేశారు.
 
దర్యాప్తులో తేలింది ఇదే..
కేసు నమోదు చేసిన పోలీసులు  విజయ్ ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించా రు. విజయ్‌కి ఫేస్‌బుక్ టచ్ ఉండడంతో ఫేస్‌బుక్‌ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయితో స్నేహం ఏర్పరుచుకున్నాడు. హైదరాబాద్‌కు వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడి తిరిగి ఇంటికి వస్తుం డగా రైలు  వరంగల్లుకు చేరుకోవడంతో విజయ్ మళ్లీ ఆ అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడాడు. అనంతరం విజయ్ మొ బైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎస్‌ఐ ముందుగా విజయ్ ఎవరెవరికి ఫోన్‌చేశాడు, అతని ఇన్‌కమింగ్, ఔట్‌గోయిం గ్ కాల్స్‌ను పరిశీలించారు. ముందుగా తిరుపతిలో విజయ్ ఫోన్ నుంచి యువతి ఎవరికి ఫోన్‌చేసిందని ఆరా తీశారు. కడప జిల్లాకు చెందిన నాగేశ్వర్ రెడ్డిగా గుర్తించి అతనిని పూతలపట్టు పోలీస్‌స్టేన్‌కు పిలిపించారు.
 
విచారణలో అతను విజయ్‌ని ఎప్పుడూ చూడలేదని చెప్పడంతో వదిలేశారు. ఆ తర్వాత దర్యాప్తులో పురోగతి లేదు.  తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో గత ఏడాది మే 31వ తేదీ తరువాత జూన్ మొదటి వారంలో రూ.2000 డ్రాచేశాడు. ఆతరువాత మిగిలిన 11,700 రూపాయలను ఇప్పటికీ డ్రా చేయలేదు. దీంతో విజయ్ ఏమైనట్లు అన్నది మిస్టరీగా మారింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తేగాని అసలు విషయం బయటపడే అవకాశం లేదు.  కన్నకొడుకు కోసం ఆ తల్లిదండ్రులు మాత్రం నిత్యం రైలుబండి వచ్చేటప్పుడల్లా తనకొడుకునే గుర్తు చేసుకుంటూ తీవ్ర వేదనకు గురవుతున్నారు. అయితే విజయ్ గురించి ఇప్పటివరకు రేల్వే సిబ్బంది కూడా పట్టించుకోక పోవడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement