మాఫీ ఉత్కంఠ! | Sakshi
Sakshi News home page

మాఫీ ఉత్కంఠ!

Published Mon, Dec 8 2014 2:38 AM

మాఫీ ఉత్కంఠ! - Sakshi

రుణమాఫీపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితాలను ఆదివారం బ్యాంకులకు విడుదల చేయడంతో రైతులు ఎవరికి వారే ఆందోళన చెందుతున్నారు. తొలుత జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచినా అవి తెరుచుకోకపోవడంతో నిరాశకు గురయ్యారు. బ్యాంకులకు పంపిన జాబితాల్లో అన్ని ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కేవలం మూడు లక్షల లోపు లబ్ధిదారుల పేర్లు మాత్రమే ఉన్నట్టు సమాచారం. మొత్తం 8,598 కోట్ల రూపాయల రుణాలకు కనిష్టంగా రూ.1200 కోట్లు మాత్రమే ప్రస్తుతం మాఫీ అవుతున్నట్టు బ్యాంకు అధికారులు లెక్కలు చెబుతున్నారు.
 
  సాక్షి, గుంటూరు : రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను ‘మాయ’ చేశారు. రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరి ంచిన తరువాత అందుకు భిన్నంగా పలు  నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిబంధనల పేరు చెప్పి రుణాలు తీసుకున్న రైతుల జాబితాను సగానికి సగం తగ్గించి వేయడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నమ్మి ఓట్లేసినందుకు ముఖ్యమంత్రి బాగానే బుద్ధి చెప్పారని రైతులు మండిపడుతున్నారు.
 
 జిల్లాలో 5,29,358 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రూ. 4005 కోట్ల రుణాలు తీసుకున్నారు. 6,49,025 మంది రైతులు తమ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ. 4,593 కోట్ల రుణాలను పొందారు. మొత్తంగా 11,78,383 మంది రైతులు రూ. 8,598 కోట్ల రుణాన్ని వివిధ బ్యాంకుల నుంచి తీసుకొన్నారు.ముఖ్యమంత్రి మాటలు నమ్మి రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయని భావించి గడువులోపు రుణాలను రెన్యూవల్ చేసుకోలేదు. వీటిపై దాదాపు రూ.1200 కోట్ల వడ్డీ భారాన్ని మోయాల్సి వస్తోంది. సకాలంలో చెల్లించి ఉంటే అన్నదాతలకు వడ్డీ భారం తప్పేది.
 
  ఒక కుటుంబానికి రూ. లక్షన్నర రుణం మాఫీ చేస్తానని సీఎం ప్రకటించినా  జాబితా తయారీలో రోజకో నిబంధన విధిస్తూ ఆరు నెలల కాలం గడిపారు. బ్యాంకుల నుంచి జాబితాలు తీసుకొన్న తరువాత వాటిని పరిశీలించాలని రెవెన్యూ అధికారులకు  అప్పగించారు. వారు గ్రామాల్లో తిరిగి మళ్లీ వడపోత చేపట్టారు. ఆ తరువాత బ్యాంకులు తుది జాబితాలు రుపొందించి ప్రభుత్వానికి పంపాయి.
 
  చివరకు పలు బ్యాంకుల్లోరుణాలు తీసుకున్నవారినీ క్రోడీకరించి రూ. లక్షన్నర రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం తుది జాబితాలను ఆదివారం బ్యాంకులకు పంపింది.
  జిల్లా వ్యాప్తంగా ఉన్న 643 బ్రాంచీలకు ఈ జాబితాలు చేరాయి. ఇందులో ఎవరి పేర్లు ఉన్నాయోనన్న ఉత్కంఠ రైతుల్లో నెలకొంది. సోమవారం బ్యాంకులకు వెళ్లి జాబితా చూసుకొంటే తప్ప  రుణమాఫీకి అర్హులమా కాదా అనేది కచ్చితంగా తెలియని పరిస్థితి. అర్హుల జాబితాను ప్రభుత్వం అన్‌లైన్‌లో ఉంచినా అవి తెరుచుకోలేదు.
 
 రుణమాఫీ అర్హులు 3లక్షల లోపే...
 మాఫీ మొత్తం దాదాపు రూ. 1200 కోట్లు
 జిల్లాలో ఆధార్, రేషన్ కార్డుతో పాటు అన్ని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన రైతుల జాబితానే మొదటి విడతగా ప్రభుత్వం ప్రకటించింది.  జిల్లా వ్యాప్తంగా 11.79 లక్షల ఖాతాలకు తొలుత దాదాపు 4.5లక్షల ఖాతాలు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు.
 
 ఇందులో సైతం ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఖాతాలను పరిశీలించి చివరకు దాదాపు మూడు లక్షల లోపు ఖాతాలే అర్హమైనవిగా తేల్చారు. ఇందులో రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న ఖాతాలు దాదాపు లక్ష ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిని రుణ విముక్తులను చేస్తోంది. మిగిలిన ఖాతాలకు మొదటి విడతలో 20  శాతం  జమ చేయనుంది. మిగిలిన మొత్తాలకు బాండ్లు ఇవ్వనున్నట్టు చెబుతోంది. ఈ లెక్కన జిల్లాలో తొలివిడత రూ. 1200 కోట్ల లోపు రుణాలే మాఫీ అవుతాయని బ్యాంకు ఉన్నతాధికారులు లెక్కలు వేస్తున్నారు.

Advertisement
Advertisement