మాఫీ మాయ | Sakshi
Sakshi News home page

మాఫీ మాయ

Published Mon, Sep 7 2015 2:06 AM

మాఫీ మాయ - Sakshi

సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా రైతులకు 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817.85 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇందులో 8.20 లక్షల ఖాతాలు రుణమాఫీకి అర్హత సాధించాయి. వాటికి సంబంధించి రూ.4,944.24 కోట్లు మాఫీ కావాలి. ఇందులో రూ.3,093.06 కోట్లు పంట రుణాలు, రూ.1851.18 కోట్లు బంగారు రుణాలు రద్దవ్వాలి. ప్రభుత్వం పంట, బంగారు రుణాలు కలిపి రూ.2,956 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది.

 ఇదీ బంగారు అప్పుల లెక్క
 జిల్లా వ్యాప్తంగా 2.12 లక్షల మంది  రైతులు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రూ.1851.18 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే.. ప్రభుత్వం 1.32 లక్షల ఖాతాల్లో రూ.905.12 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. తక్కిన 79,939 ఖాతాల్లోని రూ.946.06 కోట్లు మాఫీ కాలేదు. ప్రకటించిన మొత్తంలోనూ తక్షణ రద్దు కింద (మొదటి విడతలో) రూ.218.42 కోట్లు మాఫీ చేసింది. తక్కిన మొత్తాన్ని ఐదేళ్లలో రద్దు చేస్తామని తెలిపింది.

ప్రభుత్వం తక్షణం మాఫీ చేసిన రూ.218 కోట్లు రైతులు తీసుకున్న బంగారు రుణాలపై వడ్డీకి కూడా చాలదు. ప్రభుత్వమిచ్చిన మాట ప్రకారం ఏటా 20 శా తం రుణమాఫీ చేసినా... వడ్డీనే 14-18 శాతం అవుతుందని బ్యాం కర్లు చెబుతున్నారు. అంటే ప్రభుత్వం ఐదేళ్లలో వడ్డీ మాత్రమే మాఫీ చేసే పరిస్థితి. దీంతో తీసుకున్న రుణాలను రుణమాఫీతో సంబంధం లేకుండా గడువులోగా చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీ చే స్తున్నారు.

 పత్రికల్లో రోజూ వేలం ప్రకటనలు
 బంగారు రుణాలు తిరిగి చెల్లించాలని బ్యాంకర్లు ప్రతి రైతుకు నోటీసులు జారీ చేస్తున్నారు.  రైతుల పేర్లు, తీసుకున్న రుణం, వేలం తేదీలను పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. వీటిని చూసి కొంతమంది రైతులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. నాలుగేళ్లుగా వరుస కరువులతో కుదేలవుతున్న ‘అనంత’ రైతులకు పూటగడవడమే కష్టంగా ఉంది. కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలసెళ్లి పనులు చేసుకుంటున్నారు. పనులు చేసే సత్తువ లేని వారు చర్చిలు, మసీదులు, ఆలయాల్లో భిక్షాటనకు సిద్ధపడుతున్నారు. ఇంతటి దారుణ పరిస్థితుల్లో రుణం తిరిగి చెల్లించలేక బంగారాన్ని బ్యాంకులకే వదిలేస్తున్నారు. ఇంకొందరు అవమానభారంతో ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా చోటుచేసుకున్నాయి.

 చిత్తశుద్ధి లేని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు
 రాష్ట్రంలోని 13 జిల్లాలలో ‘అనంత’ను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలి. ఇక్కడి వ్యవసాయ పరిస్థితులు, కరువు ప్రభావాన్ని ఏ ప్రాంతంతోనూ పోల్చలేము. అప్పుల బాధ తాళలేక గత 15నెలల్లో 101 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వం రైతుకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీస్థానాలను ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు.  అయితే.. జిల్లా పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు.
 
 వ్యవసాయ రుణాలు : రూ. 6,817 కోట్లు
 మాఫీకి అర్హత : రూ.4,944 కోట్లు
 బంగారు రుణాలు : రూ.1851.18 కోట్లు
 మాఫీకి అర్హత :   రూ.905.12 కోట్లు
 మాఫీ కానివి :   రూ.946.06 కోట్లు
 ప్రస్తుత మాఫీ : రూ.218.42 కోట్లు
 నాలుగేళ్లలో మాఫీ అయ్యేవి :  రూ.686.70కోట్లు

Advertisement
Advertisement