బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి | Sakshi
Sakshi News home page

బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి

Published Sat, May 5 2018 6:53 AM

Want To Justice For Girl Family : Mla RK Roja - Sakshi

పట్నంబజారు (గుంటూరు): అన్యాయం జరిగినా ఆలకించలేదు.. బాలికపై అఘాయిత్యం జరిగినా మూడు రోజులు పాటు ప్రభుత్వ పెద్దలు బాధ్యతను విస్మరించారు.. చిన్నారికి జరిగిన అన్యాయానికి...ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు గర్జించాయి. చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని రోడ్డెక్కాయి. దాచేపల్లిలో మానవ మృగం చేతిలో అత్యాచారానికి గురైన చిన్నారిని చూసేందుకు వైఎస్సార్‌ సీపీ  మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టినా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, లీగల్‌ విభాగం గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ నేతల పాదర్తి రమేష్‌గాంధీతో కలసి బాలికను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాజు నాయుడు, ఆర్‌ఎంవో యనమల రమేష్‌ను   చిన్నారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందజేసి, త్వరితగతిన కోలుకునేలా చూడాలని జీజీహెచ్‌ అధికారులును కోరారు.

ఆసుపత్రి ఎదుట ఆందోళన
చిన్నారిని పరామర్శించిన తరువాత జీజీహెచ్‌ నుంచి బయటకు వచ్చి ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. హోం మంత్రి చినరాజప్ప జీజీహెచ్‌కు వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బలవంతంగా పార్టీ నేతలు, కార్యకర్తలను అక్కడ నుండి తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రతిఘటించంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టారు. కార్యకర్తలు మంచినీరు అందజేసి  పక్కకు తీసుకునివచ్చారు.

పోలీసుల ఓవర్‌యాక్షన్‌
వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజాతో పార్టీ నేతలు జీజీహెచ్‌కు వస్తున్నారని తెలిసిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కాన్పుల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారిని చూసేందుకు వెళుతున్న నేతలను ఆ వార్డు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిఘటించారు. ఎందుకు వెళ్లనివ్వరంటూ.. నెట్టుకుని లోపలికి వెళ్లారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసి అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు, జెడ్పీటీసీ సభ్యులు కొలకలూరి కోటేశ్వరరావు, దేవళ్ల రేవతి, అంగడి శ్రీనివాసరావు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గనిక ఝాన్సీ రాణి, మేరువ నర్సిరెడ్డి, పరసా కృష్ణారావు, పసుపులేటి రమణ, ఆరుబండ్ల కొండారెడ్డి, సోమి కమల్, నిమ్మరాజు శారదలక్ష్మి, పానుగంటి చైతన్య, షేక్‌ గౌస్, షేక్‌ రబ్బాని, ఏటుకూరి విజయసారథి, మేరిగ విజయలక్ష్మి, జ్యోతి, స్వర్ణ, వడ్లమూడి రత్న, పార్టీ నేతలు, డివిజన్‌ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement