తీరంలో కన్నీరు | Sakshi
Sakshi News home page

తీరంలో కన్నీరు

Published Wed, Oct 16 2013 6:25 AM

water blockade by phailin cyclone affected in coastal areas

చుట్టూ ఎటుచూసినా నీరు.. ప్రజల కంట కన్నీరు.. ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధం. వాగులను తలపిస్తున్న పంటపొలాలు. ప్రచండ గాలులకు నేలకొరిగిన చెట్లు. దెబ్బతిన్న ఇళ్లు. నీటి ఉధృతికి ధ్వంసమైన పడవలు, వలలు. రోజుల తరబడి వీడని అంధకారం. ఇదీ ఉద్దానం పల్లెల్లో కనిపిస్తున్న విషాద దృశ్యం. ఇంత ఘోరకలిలోనూ అందని ఆపన్న హస్తం. మాట సాయానికైనా ముందుకు రాని సర్కారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు పర్యటనలతో హడావుడి చేసినా బాధితులకు ఉపశమనం కలిగించే ఒక్క హామీ అయినా ఇవ్వలేకపోగా.. నాలుగు రోజులవుతున్నా అధికార యంత్రాంగం గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. తక్షణ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అంధకారం అలుముకున్న బాధితుల జీవితాల్లో ఇప్పట్లో వెలుగులు ప్రసరించే అవకాశం లేదు. కన్నీరు తుడిచే దిక్కూ లేదు.
 
 కొబ్బరి రైతుకు కోలుకోని దెబ్బ
  కవిటి:  పై-లీన్ సృష్టించిన బీభత్సానికి నేలకూలిన పంటను చూసి రైతులు లబోదిబోమంటున్నారు.  మండలంలో సుమారు 7వేల హెక్టార్లలో ఉన్న కొబ్బరి, జీడిమామిడి, పనస తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లి రైతుల వెన్నువిరిగి పోయినా ఆదుకోవడంలో ప్రభుత్వ జాప్యాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక కొద్దిగా వాలిన చెట్ల వేర్లను మట్టితో పూడ్చడం, దెబ్బతిన్న మొవ్వులను కత్తిరించడం, రాలిన కాయలు, కమ్మలను పోగు చేయడం వంటి పనుల్లో  నిమగ్నమయ్యారు. కూలిన చెట్లను తొలగించేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని నెలవంక, కపాసుకుద్ది, డీజీపుట్టుగ, కవిటి, జాగలి, భైరిపురం, రాజపురం, బెజ్జిపుట్టుగ, బొరివంక, వ రక, బల్లిపుట్టుగ, ఉలగాం, లండారిపుట్టుగ, పుటియాదళ రెవెన్యూ గ్రామాల పరిధిలో కొబ్బరి, అరటి, జీడి, మామిడి, పనస పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.
 
 తుపాను బాధితులను ఆదుకోవాలి
 పలాస రూరల్, న్యూస్‌లైన్: తుపానుతో పంటలు నష్టపోరుున రైతులతో పాటు రోడ్లు, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించి తీరప్రాంత గ్రామాల ప్రజలను ఆదుకోవాలని పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం నుంచి వజ్రపుకొత్తూరు వరకు ఉద్దాన ప్రాంతంలో పాడైన పంటలు, తోటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకార గ్రామ ప్రజలకు నెల రోజులు పాటు ప్రభుత్వమే పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు, భోజనం, నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు, హుకుంపేట, మందస మండలం గంగువాడ తదితర ప్రాంతాల్లో రూ.2 లక్షలు విలువ గల 100 నాటు పడవలు, రూ.20 లక్షలు విలువ గల మరబోట్లు, రూ.4 లక్షలు విలువ గల చిన్నపడవలతో పాటు 20 టన్నుల చేపలు, ఎండుచేపలు నాశనమయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు చెందిన బాధితులకు ఉచిత విద్యుత్ అందించాలని, కూలిపోరుున ఇళ్లస్థానంలో నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వారిలో కుల నిర్మూలన పోరాట కమిటీ నాయకుడు మిస్క కృష్ణయ్య, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోత ధర్మారావు, పి.దుర్యోధన, పౌరహక్కుల సంఘ సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు తదితరులు ఉన్నారు.
 
 ఉప్పు రైతులను ఆదుకోవాలి
 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తుపాన్ ప్రభావంతో ఉప్పుమడుల్లో నీరుచేరి పాడయ్యూయని, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు కళింగపట్నానికి చెందిన ఉప్పురైతులు కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ని మంగళవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
 
 అరటి రైతుల గోడు వినేవారే కరువు
 నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: తుపాను తీవ్రతకు మండలంలో సాగుచేస్తున్న అరటి పంటకు తీవ్ర నష్టం సంభవించినా రైతుల గోడు వినేవారే కరువయ్యారు. కనీసం విరిగిన చెట్లను పరిశీలించేందుకు కూడా అధికారులు రాకపోకవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన అరటి పంట చేతికందివచ్చే సమయంలో కళ్లముందే ధ్వంసం కావడంతో గగ్గోలు పెడుతున్నారు. మండలంలో 65 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసం కాగా రూ.50 లక్షల వరకూ నష్టం జరిగినట్టు అంచనా. ఎకరా వీస్తీర్ణంలో 400 చెట్లకు 350కు పైగా చెట్లు గెలలుతో ఉన్నాయి. ఇవన్నీ తుపాను గాలికి నేలకొరిగాయి. ఎకరాకు రూ.80వేలు చొప్పున నష్టం జరిగిందని అంచనా. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని కోమర్తి, దేవాది, మాకివలస, గోపాలపెంట, కిళ్లాం గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు.
 
 బాధితులను  ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
 కవిటి, న్యూస్‌లైన్: తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. మండలంలోని రాజపురం, కపాసుకుద్ది, జగతి తదితర గ్రామాల్లో నాయకుల బృందం పర్యటించి రైతులు, మత్స్యకారులు, సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులను తెలుసుకుంది. పంట నష్టం పరిశీలనకు వచ్చిన మంత్రులు రఘువీరారెడ్డి, కృపారాణి, కోండ్రు మురళీ, శత్రుచర్ల, గంటా శ్రీనివాస్‌లు కనీసం తమ మాటలు కూడా వినకుండా వెళ్లిపోయారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. ఈ పర్యటనలో వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, కణితి విశ్వనాథం, తమ్మినేని సీతారాం, బి.హేమమాలినీరెడ్డి, బి.మాధురి, వజ్జ బాబూరావు, కోత మురళీధర్, కె.వెంకటేశ్వరరావు, రమేష్‌కుమార్, పి. కామేశ్‌లు పాల్గొన్నారు. తుపాను తీవ్రత, బాధిత రైతులు, మత్స్యకారుల సమస్యలను పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డికి వివరిస్తామని తెలిపారు.
 
 పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కోనారి మల్లేసు. వజ్రపుకొత్తూరు మండలం రెయ్యిపాడు గ్రామం. ఎనిమిది ఎకరాల జీడి, రెండు ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు ఉన్నాయి. వీటిద్వారా ఏటా రూ. 3 లక్షల ఆదాయం సమకూరుతుంది. తుపాను ధాటికి 55 జీడి చెట్లు, 15 కొబ్బరి, 90 టేకు మొక్కలు, 25 అకేషియా చెట్లు ధ్వంసమయ్యాయి. సుమారు రూ1.50 లక్షల నష్టం సంభవించింది. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు నష్టాన్ని అంచనావేసేందుకు రాలేదు. గ్రామంలో సుమారు 125 మంది రైతుల పరిస్థితీ ఇదే.
 
 కూరగాయల పంటతో ఏటా రూ.30 వేలు వరకు సంపాదించుకునేవాడినని, తుపానుతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయని వజ్రపు కొత్తూరు మండలం పెద్దమురహరిపురానికి చెందిన యలమంచిలి జగ్గారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. పువ్వు పిందెలతో ఉన్న బీర పంట పూర్తిగా పాడైందని వాపోతున్నాడు. సుమారు.40 వేలు నష్టం సంభవించిందని వాపోతున్నాడు. సుమారు 30 గ్రామాల్లో రూ.19 లక్షల నష్టం సంభవించి ఉంటుందని రైతులు చెబుతున్నారు.
 
 చిత్రంలో నేలకూలిన అరటి చెట్లను చూపిస్తున్న రైతు పేరు బత్సల ధర్మారావు. రెయ్యిపాడు గ్రామం. ఇతనికి 4 ఎకరాల జీడి, కొబ్బరి తోటలు ఉన్నాయి. తుపానుకు తోటలోని అరటి, జీడి, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. సుమారు 1.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ప్రతి మొక్కనూ కొడుకులా పెంచుకున్నామని, ఫలసాయం అందివచ్చే సరికి తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
 
 తేరుకోవడానికి దశాబ్దాలే..!
 ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోకుంటే మరో దశాబ్దం గడిచినా తేరుకోవడం కష్టమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. మండలంలోని తీరప్రాంతంలో ఉన్న 6 గ్రామాల మత్య్సకారులు తుపా ను ధాటికి అల్లాడిపోతున్నారు. బోట్లు, వలలు అలల ఉద్ధృతికి ధ్వంసం కావడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సుమారు 40 పెద్ద బోట్లు, 65 చిన్నబోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో కొన్ని సముద్రం లో కొట్టుకుపోగా మిగిలినవి మరమ్మతులకు గురయ్యాయని బూర్జపాడు సర్పంచ్ జానకిరావు చెప్పారు.
 
 కుళ్లిపోయిన పది టన్నుల చేపలు
 తుపాను రాకముందు నిల్వ ఉంచిన చేపలు మార్కెట్ చేయలేకపోవడంతో కుళ్లిపోయాయి. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. రొయ్యల చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పద్మనాభపురం గెడ్డ పొంగడంతో ఇన్నీసుపేట, ధర్మపురం, తులసీగాం, రత్తకన్న, మం డపల్లి, తేలుకుంచి, మశాఖపురం  గ్రామాల పరిధిలోని వందలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి.  
 
 అంధకారంలో 219 గ్రామాలు
   సరఫరా పునరుద్ధరణకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం
 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఇప్పటికీ 219 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. తొలిరోజున 719 గ్రామాలు అంధకారంలో ఉండగా, మంగళ వారం నాటికి ఈ సంఖ్యను 219కి తగ్గించారు. అన్ని సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతున్నా గ్రామాలకు వెళ్లే విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సరఫరాకు ఆటంకం కలుగుతోంది. లైన్లు బాగుచేసేందుకు మరో రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉంది. పునరుద్ధరణ పనులతో ఉదయం సరఫరా నిలిపివేస్తుండడంతో మిగిలిన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు తొలి నుంచి ఇచ్ఛాపురంలో మకాం వేసి ఉండగా, ఎంపీడీసీఎల్ సీఎం కార్తీకేయ మిశ్రా సోమవారం ఇచ్ఛాపురం చేరుకొని పునరుద్ధరణ పనులు పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు, ఇతర జిల్లాలకు చెందిన ఎస్‌ఈ, డిఈ స్థాయి ఉద్యోగులందరూ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.
 
 అన్నదాతకు ఆర్థిక కష్టాలు  
 పలాస, న్యూస్‌లైన్: ఉద్దానం ప్రాంత రైతులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నారుు. నేలకూలిన జీడి, కొబ్బరి, మునగ, పనస చెట్లను తొలగించేందుకు నానా యాతనలు పడుతున్నారు. చేతిలో పెట్టుబడి లేక మనోవేదన చెందుతున్నారు. ఉద్దానంలో సుమారు 20వేల హెక్టార్ల జీడి సాగవుతోంది. తుపాను ప్రభావంతో ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టం జరిగి ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. దీని ప్రకారం మొత్తం జీడి పంటకు సుమారు రూ.100కోట్లు నష్టం కలిగింది. అలాగే కొబ్బరికి మరో రూ. 25 కోట్లు నష్టం కలిగింది. పనస, మునగ, మామిడి, టేకు, సరుగుడు వనాలు సర్వనాశనమయ్యాయి. ఇంత భారీ నష్టం జరిగినా అధికారులు కనీసం గ్రామాల్లో పర్యటించిన దాఖలా లేవు. గ్రామాల్లో నేలకూలిని పూరిగుడిసెలు, విద్యుత్ స్తంభాలు, చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు వందల సంఖ్యలో ఉన్నాయి. తుపాను పెనుగాలులకు ప్రాణ నష్టం లేకపోయిన ప్రజల బతుకులు ఛిద్రమయ్యా యి. మత్స్యకారులు వారం రోజుల పాటు జీవనోపాధిని కోల్పోయా రు. వజ్రపుకొత్తూరు మండలంలో 81 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
 
 4 చెరువులకు గండ్లు పడ్డాయి. 9 రోడ్లు పాడయ్యాయి. 2 పశువులు మృత్యువాతపడ్డాయి. 24 పూరిళ్లు పూర్తిగా పడిపోయా యి. 180 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 25,980 జీడిచెట్లు విరిగి పోయాయి. 3761 కొబ్బరి చెట్లు నేలకొరిగారుు. 2005 ఎకరాల్లో 50 శాతం వరి పంటకు నష్టం జరిగింది. మందస మండలంలో 45 వేలు జీడిచెట్లు, 12 వేల కొబ్బరిచెట్లు, 15 ఎకరాల్లో అరటి చెట్లు ధ్వంసమయ్యాయి. 178 ఇళ్లు పూర్తిగా, 215 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3500 విద్యుత్ స్తంభాలు, 7 ట్రాన్స్‌ఫార్మర్‌లు పాడయ్యాయి. 8 గొర్రెలు, ఒక ఎద్దు, ఒక గేదె మృత్యువాతపడ్డాయి. పలాస మండలంలో 20 వేల జీడిచెట్లు నేలమట్టమయ్యాయి. 2 వేలు కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. పనస, మామిడి, టేకు చెట్లు నేలమట్టమయ్యాయి. ఒక మేక మృతి చెందింది. అలాగే 20 పూరిళ్లు పూర్తిగా, 73 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉద్దాన ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రైతులకు అపారమైన నష్టం జరిగింది. భయంకరమైన పై-లీన్ ప్రభావం నుంచి ప్రాంత వాసులు ఇంకా బయటపడలేదు. అధికారులు వస్తే తమ బాధలు చెప్పుకోవడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
 హెక్టారుకు రూ.50వేలు చెల్లించాలి
 సోంపేట, న్యూస్‌లైన్: తుపానుతో కొబ్బరి, జీడిమామిడి, వరి తదితర పంటలు నష్టపోయిన  కవిటి, సోంపేట మండలాల రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సీపీఎం ప్రతినిధులతో కలిసి సోంపేట, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించారు. సామూహిక వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కొబ్బరి ఉపకేంద్రాన్ని కవిటి మండలంలో ఏర్పాటు చేసి శాస్త్రవేత్తల సూచనలతో రైతులను ఆదుకోవాలన్నారు. చిన్నసన్నకారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.నారాయణరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన్‌రావు, ఎ.సత్యనారాయణ, డి.సత్యం తదితరులు ఉన్నారు.
 
 తీరని నష్టం
 సోంపేట, న్యూస్‌లైన్: పై-లీన్ ప్రభావం సోంపేట మండల రైతులను దెబ్బతీసింది. తీరని నష్టం మిగిల్చింది. మండలంలోని పాలవలస గ్రామంలో సాగుచేస్తున్న టేకు తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గ్రామంలోని జి.కె.నాయుడుకు చెందిన సుమారు 5 ఎకరాల్లోని 2000 టేకు చెట్లు నేలకొరిగాయి. 1999లో వచ్చిన తుపాను వల్ల 500 చెట్టు పడిపోయాయని, ఇప్పుడు వచ్చిన తుపానుతో ఉన్న చెట్లు నేలకూలాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు. అలాగే, శాసనాం గ్రామంలోని వి.మాధవరావుకు చెందిన టేకు తోటలో 300 చెట్లు పడిపోయాయి. మండలంలో సాగులో ఉన్న వరి, క్యాబేజీ, బీర, దొండ, వంగ, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను వర్షాలకు కూరగాయల పంటలు యువకపట్టాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement