తాగునీటికి కటకట | Sakshi
Sakshi News home page

తాగునీటికి కటకట

Published Mon, Feb 10 2014 1:01 AM

water problem in guntur

 వేసవి ఇంకా రానేలేదు... ఎండల తీవ్రత ఇంకా పెరగనే లేదు.. అప్పుడే నీటి తిప్పలు తీవ్రమవుతున్నాయి. పల్లెల్లో దాహం కేకలు మార్మోగుతున్నాయి. నీటికోసం కిలోమీటర్ల దూరానికి వెళ్లాల్సి వస్తోంది. రక్షితనీరు లేక తీరప్రాంత పల్లెలు అల్లాడుతున్నాయి. పట్టణాల్లో ట్యాంకర్ల వద్ద ముష్టియుద్ధాలు మొదలవుతున్నాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకుంటే మరిన్ని తిప్పలు తప్పవేమోనన్న భయం వెన్నాడుతోంది.
 
 సాక్షి, గుంటూరు :జిల్లాను ఆనుకొని కృష్ణానది ప్రవహిస్తున్నా... చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. ఇటు తీరప్రాంతం... అటు పల్నాడు ప్రాంతాల్లో రక్షిత నీటికోసం అల్లాడాల్సిన దుస్థితి దాపురించింది. ప్రధాన పట్టణాలతోపాటు గుంటూరు నగరానికీ నీటి ముప్పు మొదలయ్యింది. క్యూబిక్ మిల్లీ మీటరు నీటిలో 120 లేదా అంతకంటే తక్కువ రోగ కారక సూక్ష్మజీవులుంటే నీటిని రక్షిత నీరుగా పేర్కొంటున్నారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి నీరు లభ్యం కావడం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రక్షిత నీరు లేక వేసవిలో ఏటా వందల సంఖ్యలో జనం అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నీటి సంబంధిత వ్యాధులు లేవని అధికారులు బుకాాయిస్తున్నా, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలోని గ్రామాల్లో, పట్టణాల్లో రక్షిత నీరు దొరకకపోవడమే వ్యాధులకు కారణమని అందరూ అంగీకరించక తప్పదు. తీర ప్రాంతాలైన బాపట్ల, నిజాంపట్నం, రేపల్లె, కూచినపూడి ప్రాంతాల్లో సెలెనిటీ శాతం ఎక్కువగా ఉన్న నీరు చొచ్చుకొస్తూ ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. 
 
 వేసవి కార్యాచణపైనా నిర్లక్ష్యం
 వేసవి సీజన్‌లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం మొక్కుబడిగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. పల్నాడు ప్రాంతంలో సాగర్ కాల్వల కింద చెరువులు యుద్ధ ప్రాతిపదికన నింపుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. వీటి పరిధిలో ఉన్న 238 చెరువుల్ని మార్చి 31 లోగా నింపుకోవాలని జిల్లా ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. గతంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్, నరసరావుపేట ప్రాంతాల్లో తీవ్రంగా తాగునీటి సంక్షోభం ఎదురైంది. మళ్ళీ ఇదే పరిస్థితి పునరావృతమైతే ఎలా అధిగమించాలో ప్రణాళిక ఇంతవరకు తయారు చేయలేదు. కేవలం కాల్వలపైనే ఆధారపడటంతో ముప్పు పొంచి ఉంది. ఇరిగేషన్ శాఖ ఆధునికీకరణ కోసం ఎప్పుడు కాల్వల్ని కట్టేస్తారో.. తెలియదు. ఈ పరిస్థితిలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు, నీటి ఎద్దడి తలెత్తకుండా చేసేందుకు సరైన ప్రణాళిక అధికారులు రూపొందించకపోవడం గమనార్హం. 
 
 20 ప్రాజెక్టుల పూర్తి ఎన్నటికో?
 జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో రూ.120 కోట్లతో 20 బహుళ గ్రామాలకు నీటి పథకాలు(మల్టీ విలేజ్ స్కీంలు) మంజూరై ఆరు నెలలు కావస్తున్నా, ఇంతవరకు టెండర్ల దశ దాటలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ 20 ప్రాజెక్టుల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు 170 గ్రామాల్లో సాధారణ వాటర్ స్కీంల పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి 31 లోపు పూర్తి చేస్తామని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నా, పనుల పూర్తిపై అనుమానాలు లేకపోలేదు. 
 నగరానికీ అరకొర నీరే.. నగరంలో ప్రతిమనిషికీ తాగునీరు అందాలంటే 125 ఎంఎల్‌డీలు అవసరం. అయితే కేవలం 97 ఎంఎల్‌డీల నీటితోనే ప్రజలు సరిపెట్టుకుంటున్నారు. నగరంలో 25 రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరాచేస్తున్నా కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా ఎపుడు అవుతుందా అని ప్రజలు జాగరాలు చేస్తున్న దశ్యాలు నగరంలో నిత్యకత్యమయ్యాయి.  దీంతో ప్రజలు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. కేవలం నీటి వనరులు పెరగని కారణంగానే తాగునీటి ఇక్కట్లు వెంటాడుతున్నాయి. సమగ్ర తాగునీటి పథకం కింద రూ.460 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన ప్రాజెక్టు టెండర్ల దశలోనే ఉంది. రెండున్నరేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.
 

Advertisement
Advertisement