Sakshi News home page

దళితుల స్థలంలో వాటర్‌ ట్యాంక్‌

Published Tue, Aug 21 2018 1:29 PM

Water Tank Constructions In Dalits Land Guntur - Sakshi

పొన్నూరు: అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఎస్సీలకు కేటాయించిన భూమిలో వాటర్‌ ట్యాంక్‌ శంకుస్థాపనకు వచ్చిన నరేంద్రను గ్రామస్థులు అడ్డుకుని నిలదీశారు. చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఆ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని బాధితులు వాపోయారు. మండల పరిధిలోని తాళ్ళపాలెంలో ఎస్సీలకు కేటాయించిన ఇళ్ల స్థలంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంచినీటి పథక ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. దీంతో బాధితులు తమ స్థలాల్లో ఏ విధంగా నిర్మాణాలు చేస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌ స్పందిస్తూ అప్పటి అధికారులు ఇచ్చిన పట్టాలు నకిలీవి అని తేల్చి చెప్పారు. ఈ స్థలాలను ఆర్డీవో రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన బాధితులు తమకు ప్రభుత్వం 2005లో నివేశన స్థలాలు కేటాయించి  ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా ఎలా రద్దు చేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకుస్థాపనకు వెళుతుండగా ఎస్సీలు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ముందస్తుగా ఉన్న పోలీస్‌ బలగాలు బాధితులను నిలువరించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కక్ష సాధిస్తున్నారు
గ్రామంలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నామని మాకు కేటాయించిన స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ప్రజావ్యతిరేక పనులు చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.– అద్దేపల్లి సంఘమేశ్వరావు

న్యాయపోరాటం చేస్తాం
ప్రభుత్వం స్థలం ఇచ్చే సమయంలోనే అన్ని జాగ్రతలు తీసుకోని స్థలాలను కేటాయిస్తుంది. స్థలాలు మంజూరు చేసే సమయంలో రెవెన్యూ అధికారులు పదిసార్లు పరిశీలించిన తరువాత కానీ పట్టాలు మంజూరు చేయరు. కేవలం ఎస్సీలకు కేటాయించారనే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఎస్సీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై గతంలో కోర్టును ఆశ్రయించాం. నేడు ఎస్సీల స్థలాలో నిర్మాణం చేస్తున్న, చేయిస్తున్న అందరిపై న్యాయ పోరాటం చేస్తాం.– ఎం.అన్నపూర్ణ

Advertisement

What’s your opinion

Advertisement