నిధుల నీరు లేని చెట్టు | Sakshi
Sakshi News home page

నిధుల నీరు లేని చెట్టు

Published Thu, Feb 19 2015 1:52 AM

Water,tree program from today

నేటి నుంచి నీరు-చెట్టు కార్యక్రమం
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
తలలు పట్టుకుంటున్న డ్వామా, అటవీ అధికారులు
ప్రస్తుతానికి ఉపాధి హామీ నిధులే గతి దాని వల్ల ఉపాధి పనులు తగ్గుతాయని ఆందోళన

 
శ్రీకాకుళం పాతబస్టాండ్ : పథకాలు ప్రకటించడం.. కార్యక్రమాలు చేపట్టడంలో చూపుతున్న శ్రద్ధను ప్రభుత్వం నిధుల విడుదలపై చూపడం లేదు. గురువారం నుంచి ప్రారంభమవుతున్న నీరు-చెట్టు కార్యక్రమానిదీ అదే పరిస్థితి. మొక్కలు నాటడం, పర్యావరణం, జల వనరుల పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. అయితే నిధుల విషయానికొచ్చేసరికి మాత్రం మొండి చెయ్యి చూపింది. దాంతో ప్రస్తుతానికి ‘నీరు-చెట్టు’ కార్యక్రమాలను జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులతో చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీనివల్ల ఉపాధి హామీ పనులు తగ్గిపోయి.. ఆ మేరకు వేతనదారులు నష్టపోతారు.

ఆర్భాటానికి కొదవలేదు

నిధులివ్వకపోయినా అన్ని స్థాయిల్లోనూ కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల కేంద్రాలు, గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలని, చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్దేశించింది. ఇవన్నీ చేయాలంటే వేలు, లక్షల్లోనే నిధులు ఖర్చవుతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు పాల్గొనే కార్యక్రమాల ఖర్చు మరింత పెరుగుతుంది. ఈ కార్యక్రమాలకు జిల్లాకు కోటి రూపాయలు కేటాయించనున్నట్లు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చెప్పినా.. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి.

మరోవైపు గురువారం నుంచే పనులు చేపట్టాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలకు ఇప్పటికీ నిధులు జమకాలేదు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమం చేపట్టాల్సి రావడంతో అధికారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను డ్వామా, అటవీ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా గురువారం నందిగాం మండలం కల్లాడ పంచాయతీ సాగరంపేట వద్దనున్న పద్మనాభసాడరం చెరువు గట్టుపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ లక్ష్మీనరసింహం, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.రవీంద్ర తదితరులు పాల్గొంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement