పీడీ మాకొద్దు బాబోయ్ | Sakshi
Sakshi News home page

పీడీ మాకొద్దు బాబోయ్

Published Wed, Sep 9 2015 11:59 PM

పీడీ మాకొద్దు బాబోయ్

పెదబయలు : చిత్రహింసలకు గురిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు(పీడీ) మాకొద్దం టూ మండలం కేంద్రం పెదబయలులోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 400 మంది బుధవారం ఇంటిముఖం పట్టారు. పీడీ శెట్టి ధనుంజయ్ బూటు కాలితో తన్నడం, కొట్టడంతోపాటు దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ వాపోయారు. పాఠశాలలో 440 మంది విద్యార్థులు ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న పీడీని తొలగించాలని డిమాండ్ చేశారు. అతనిని వెనకేసుకొస్తున్న హెచ్‌ఎంపై చర్యలు చేపట్టాలని కోరారు.

బ్యాంకు అకౌంటు, ఐడీ కార్డుల కోసం హెచ్‌ఎం ఒక్కొక్కరి నుంచి రూ.600 చొప్పున వసూలు చేశారని, పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదంటూ ఐటీడీఏ పీవోకు అడ్రస్ చేస్తూ లేఖరాసి నోటీసు బోర్డులో అంటించి వెళ్లిపోయారు. బుధవారం వేకువజామున 4 గంటల నుంచి విద్యార్థులు విడతలు విడతలుగా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారు. ఎవరైనా అధికారులు వస్తే సమాధానం చెప్పడానికి తామున్నామంటూ వారు తెలిపారు. గతంలోనూ ఈ పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. 2012 నవంబరు 21న ఇలాగే విద్యార్థులు ఇంటిముఖం పట్టారు.

 పీడీ, హెచ్‌ఎంలపై వేటు..  : పాఠశాల విద్యార్థులు ఇంటిముఖం పట్టారన్న సమాచారం మేరకు గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల ఉదయాన్నే పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులను మందలించారు. సిబ్బంది తీరుపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీడీ ధనుంజయ్, హెచ్‌ఎం వేణుగోపాలంలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పాఠశాల ఉపాధ్యాయుల మధ్య విభేదాలను గుర్తించామన్నారు. మొత్తం సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తామని విద్యార్థులకు నచ్చజెప్పారు.

పూర్తిస్థాయి విచారణ అనంతరం విద్యార్థులు ఇంటి ముఖం పట్టడానికి  కారకులైన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునానవృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రావాలని డీడీ కోరారు. ఆమె వెంట ఏటీడబ్ల్యూవో శాంతకుమారి,ఎంపీడీవో సూర్యనారాయణ, తహాశీల్దార్ నెహ్రూబాబు, ఎంఈవో ఎస్‌బిఎల్ స్వామి,  గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  ఎం. అప్పారావు, వీఆర్వో  రమేష్‌కుమార్ ఉన్నారు.

Advertisement
 
Advertisement