రూ.10,000 కోట్ల అప్పు చేస్తాం | Sakshi
Sakshi News home page

రూ.10,000 కోట్ల అప్పు చేస్తాం

Published Sun, Sep 30 2018 4:08 AM

We will borrow Rs 10,000 crores - Sakshi

సాక్షి, అమరావతి: ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల్లోకి ఊబిలోకి నెట్టేసిన టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో మరిన్ని అప్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధానిలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.10,000 కోట్ల రుణాలు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల అప్పులు చేయకపోతే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు నిలిచిపోతాయంది. రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన భూములను వాణిజ్య బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటామని, ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని, ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. 

బాండ్ల ద్వారా అప్పులు చేస్తే వడ్డీభారం 
ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పేరుతో అమరావతి బాండ్ల ద్వారా సీఆర్‌డీఏ ఇప్పటికే రూ.2,000 కోట్ల అప్పులు చేసింది. ఈ రుణానికి 10.32 శాతం వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడ్డీరేటు అధికంగా నిర్ధారించడంతో బాండ్లకు గిరాకీ పెరిగిందని, సాధారణంగా అయితే అమరావతి క్రెడిట్‌ రేటింగ్‌ పెద్దగా లేదని సీఆర్‌డీఏ పేర్కొంది. బాండ్ల ద్వారా చేసిన అప్పులకు గ్యారెంటీ ఇస్తూ ఆర్థిక శాఖ కొన్ని షరతులు విధించింది. ఈ మేరకు జీవో 65ను ఫిబ్రవరి 8న మున్సిపల్‌ శాఖ (సీఆర్‌డీఏ) జారీ చేసింది. 8 శాతం కంటే ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవద్దని, ఇప్పటికే హడ్కో ద్వారా తీసుకున్న రుణంపై వడ్డీని సంప్రదింపుల ద్వారా 8 శాతం లోపునకు తగ్గించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లు జీవోలో పేర్కొన్నారు. సీఆర్‌డీఏకు 8 శాతం లోపు వడ్డీకి అప్పులు పుట్టకపోతే వాణిజ్య బ్యాంకుల నుంచి 8 శాతం లోపు వడ్డీకి రుణం ఇప్పించేందుకు ఆర్థిక శాఖే సంప్రదింపులు జరుపుతుందని స్పష్టం చేశారు. అయితే, 8 శాతం వడ్డీలోపే అనే షరతును అమరావతి బాండ్ల జారీ విషయంలో సీఆర్‌డీఏ ఉల్లంఘించింది. బాండ్ల ద్వారా చేసిన రూ.2 వేల కోట్ల అప్పునకు 10.32 శాతం వడ్డీ చెల్లించేందుకు సీఆర్‌డీఏ అంగీకరించింది. 

షరతును సడలించండి 
అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.10,000 కోట్ల అప్పులు తీసుకురావాలంటే జీవో 65 అడ్డువస్తోంది. 8 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ విధించిన ‘8 శాతం లోపు వడ్డీకే’ అనే షరతును సడలించడంతోపాటు ఈ రుణానికి గ్యారెంటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీఆర్‌డీఏ ప్రతిపాదనలను పంపింది. గ్యారెంటీ ఇస్తే అసలు అప్పుతోపాటు వడ్డీని సీఆర్‌డీఏ చెల్లించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించకపోతే తాకట్టు పెట్టిన భూముల ద్వారా వాణిజ్య బ్యాంకులు అప్పును రికవరీ చేసుకుంటాయి. ఇదిలా ఉండగా అమరావతి బాండ్ల పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.500 కోట్ల మేర అప్పు చేసేందుకు లీడ్‌ మేనేజర్ల కోసం సీఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement