కాంగ్రెస్ తో తప్పా..ఏ పార్టీతోనైనా కలుస్తా :పవన్ కల్యాణ్ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ తో తప్పా..ఏ పార్టీతోనైనా కలుస్తా :పవన్ కల్యాణ్

Published Fri, Mar 14 2014 9:09 PM

కాంగ్రెస్ తో తప్పా..ఏ పార్టీతోనైనా కలుస్తా :పవన్ కల్యాణ్ - Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో తప్పా..ఏ పార్టీతోనైనా చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు పవన్ కల్యాణ్ స్ఫష్టం చేశారు. ప్రస్తుతం తన పార్టీ నిర్మాణ దశలోనే ఉందని, పార్టీగా రూపాంతరం చెందడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా?లేదా?అని అంశంపై ఇంకా స్ఫష్టత లేదన్నారు. ఒకవేళ తాను పోరుకు సిద్ధమైతే కాంగ్రెస్ మాత్రం జతకట్టనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులకు కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు.

నగరంలోని నోవాటెల్ లో జరిగిన 'జన సేన'పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించారు. తాను తెలంగాణ పోరటాన్ని గౌరవిస్తున్నాని పేర్కొంటూ.. కాంగ్రెస్ కుయుక్త రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కుట్ర రాజకీయాలకు పాల్పడిందనే విషయాన్ని తాను నమ్ముతాన్నానన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసే తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. ప్రాంతాలను విడగొట్టే క్రమంలో ప్రజల మధ్య విద్వేషాలు పెరగడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఆ పార్టీపై పోరాటం ఆగదని తెలిపారు.

'నేను రాజకీయాల్లోకి వస్తున్నానని అనగానే చాలా మంది విమర్శించారు. నా తెలంగాణకు క్షమాపణ అడగడానికి మీరెవరు. పార్టీ పెట్టు ముందు క్షమాపణ చెప్పు అనడానికి మీరెవరు. నేనెవరికీ భయపడను. ఎవరికీ వెన్నుచూపను. పిరికితనం అంటే నాకు చిరాకు. నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా వద్దా అనేది నా వ్యక్తిగత విషయం. నేను తెలంగాణకు అనుకూలం. అదే సమయంలో సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించను' అని పవన్ తెలిపారు. దేశంపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యతోనే  రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు.  ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను మాత్రం కాదంటూనే అన్నయ్య చిరంజీవిపై కోపం లేదన్నారు. ఆయనను ఎదుర్కొవడానికి పార్టీ పెట్టడం లేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అవ్వాలని లేదని, పదవులు తనకు చాలా తుచ్ఛమైనవని పవన్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement