బీమాయ! | Sakshi
Sakshi News home page

బీమాయ!

Published Fri, Jun 20 2014 1:40 AM

బీమాయ!

వాతావరణ బీమా మంజూరులో రెండేళ్లుగా రైతులకు అన్యాయం
80 శాతం వేరుశనగ పంట దెబ్బతిన్నా అరకొర పరిహారమే
2013కు సంబంధించి పరిహారాన్ని ప్రకటించని బీమా కంపెనీ
రూ.75 కోట్లు ప్రీమియం చెల్లించిఎదురు చూస్తున్న రైతులు

 
 అనంతపురం అగ్రికల్చర్ :వాతావరణ బీమా పథకం వల్ల జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తీవ్ర పంట నష్టాలను చవిచూస్తున్నా.. అందుకు అనుగుణంగా పరిహారం మాత్రం మంజూరు కావడం లేదు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. గతంలో గ్రామం యూనిట్‌గా అమలైన పంటల బీమా పథకం రైతులకు ఎంతో కొంత లబ్ధి చేకూర్చింది. ఈ పథకానికి త్రెష్‌హోల్డ్ ఈల్డ్, ఇండెమ్నిటీ అనే నిబంధనలు ప్రతిబంధకాలుగా మారాయని చెబుతూ... 2011 నుంచి వాతావరణ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదు. పథకం అమల్లోకి వచ్చిన తొలి ఏడాది (2011) జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట దారుణంగా దెబ్బతిన్నా 45 మండలాలకు మాత్రమే పరిహారం మంజూరైంది. అది కూడా 3.63 లక్షల మందికి నామమాత్రంగా రూ.98.23 కోట్లు విడుదలైంది. రెండో ఏడాదైనా న్యాయం జరుగుతుందని ఆశించిన రైతులకు చివరకు నిరాశ తప్పలేదు. 2012లో 80 శాతం విస్తీర్ణంలో వేరుశనగ దెబ్బతిన్నట్లు నివేదికలు పంపినా వాతావరణ బీమా మాత్రం 37 మండలాలకే పరిమితమైంది. ఆ మండలాల్లోని 3.08 లక్షల మంది రైతులకు రూ.181.80 కోట్లు విడులైంది. మిగిలిన మండలాల రైతులకు నయా పైసా రాలేదు. ఇక 2013కు సంబంధించి ఇప్పటివరకు ప్రకటనే వెలువడలేదు. ఈ ఏడాది వ్యవసాయ బీమా కంపెనీకి ఆరు లక్షల మంది రైతులు రూ.75 కోట్ల ప్రీమియం చెల్లించారు. పరిహారం మొత్తం ఈ పాటికి బ్యాంకులకు విడుదలై.. రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉండగా.. ఇప్పటికీ అతీగతీ లేదు. దీని గురించి తమకేమీ తెలియదని వ్యవసాయ, ప్రణాళిక శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులు అంటున్నారు.

 ఈ పథకం ఎవరి ఆధీనంలో అమలవుతోంది? జిల్లా వ్యాప్తంగా ఆటోమేటిక్ వెదర్‌బేస్డ్ కేంద్రాలు పనిచేస్తున్నాయా? పనిచేయకుంటే పరిహారం ఎలా లెక్కిస్తారు?  జాతీయ వ్యవసాయ బీమా సంస్థ ఒక్కసారైనా బులెటిన్ విడుదల చేసిందా?...వంటి ప్రశ్నలకు ఎవరి దగ్గరా జవాబు లేదు. దీన్నిబట్టే వాతావరణ బీమా పథకం అమలు ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అర్థం కాని నిబంధనలు

పారదర్శకంగా ఉండే పంట కోత ప్రయోగాలతో నిమిత్తం లేకుండా కేవలం వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం ఆధారంగా బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని జూన్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు వర్తింపజేస్తున్నారు. ఇందులో తక్కువ వర్షపాతానికి సంబంధించి జూన్ 26 నుంచి జూలై 25 వరకు, జూలై 26 నుంచి ఆగస్టు 31 వరకు, సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు...ఇలా మూడు దశల్లో వచ్చిన సమాచారం ఆధారంగా గరిష్టంగా రూ.9 వేలు బీమా వర్తింపజేస్తున్నారు. అధిక వర్షపాతం విషయానికొస్తే.. జూన్ 26 నుంచి జూలై 25, జూలై 26 నుంచి ఆగస్టు 31, సెప్టెంబర్ 1 నుంచి 30, అక్టోబర్ 1 నుంచి 30 వరకు... ఇలా నాలుగు భాగాలుగా సమాచారం సేకరించి, గరిష్టంగా రూ.3,500 బీమా వర్తింపజేస్తున్నారు. ఇక చీడపీడల వాతావరణాన్ని జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పరిగణించి గరిష్టంగా రూ.3 వేలు ఇస్తున్నారు. ఉష్ణోగ్రతలు, తేమశాతం వివరాలను కూడా లెక్కలోకి తీసుకుంటారు. మొత్తంగా హెక్టారుకు రూ.18,750 బీమా వర్తింపజేస్తున్నారు. అయితే, ఈ  నిబంధనలు ఏ ఒక్క రైతుకూ అర్థం కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్‌బేస్డ్ స్టేషన్ల నుంచి వచ్చే వివరాలతో ప్రతి 15 రోజులకు బులెటిన్ విడుదల చేస్తామని బీమా కంపెనీ మొదట్లో ప్రకటించింది. అయితే, ఇంతవరకు ఒక్క బులెటిన్ కూడా విడుదల చేయలేదు. మళ్లీ పంట కాలం మొదలైనా వాతావరణ బీమా పరిహారం గురించి జిల్లా యంత్రాంగం వద్ద ప్రాథమిక సమాచారం కూడా లేకపోవడం గమనార్హం.

 
గత ఖరీఫ్‌లో 300 డ్రైస్పెల్స్

 గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా వ్యాప్తంగా 300 వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదయ్యాయి. ఖరీఫ్‌లో 338.1 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షం పడాల్సివుండగా.. 353 మి.మీ కురిసింది. అందులోనూ జూన్‌లో 63.9 మి.మీకి గాను 47.1, జూలైలో 67.4 మి.మీకి గాను 34 , ఆగస్టులో 88.7 మి.మీకి గాను 33.5 మి.మీ, సెప్టెంబర్‌లో 118.4  మి.మీకి గాను 239 మి.మీ వర్షం పడింది. అంటే తొలి మూడు నెలలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా, సెప్టెంబర్ మాత్రం భారీ వర్షాలు కురిశాయి. అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోవడంతో వేరుశనగ దిగుబడులు దారుణంగా దెబ్బతిన్నాయి.  జిల్లావ్యాప్తంగా నిర్వహించిన 3,500 పంట కోత ప్రయోగాల్లో ఇదే విషయం వెల్లడైంది. ఐదారు మండలాలు మినహా తక్కిన ప్రాంతాల్లో పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాలేదు.  గత ఏడాది జిల్లాలో 7,11,145 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ వేశారు. వర్షాలు సక్రమంగా కురిసి.. పంట పండివుంటే  8.50 లక్షల టన్నుల దిగుబడులు వచ్చేవి. అధికారిక గణాంకాల ప్రకారం 1.50 లక్షల టన్నులు మాత్రమే వచ్చాయి. ఆరు లక్షల హెక్టార్లలో పంట దెబ్బతినింది. జిల్లా రైతులకు రూ.2,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.  
 
 

Advertisement
Advertisement