పెళ్లి సందడి | Sakshi
Sakshi News home page

పెళ్లి సందడి

Published Wed, Aug 13 2014 1:49 AM

పెళ్లి సందడి

ఈ వారం రోజుల్లో నాలుగువేల వివాహాలు     
కల్యాణమండపాలు ఫుల్
పెరిగిన బంగారు, వస్త్ర వ్యాపారం        
క్యాటరింగ్‌కు డిమాండ్

 
తిరుపతి, తిరుమలలో పెళ్లి సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి 16 వరకు, 21 నుంచి 23 వరకు సుమారు 4వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇందుకోసం కల్యాణమండపాలు ముస్తాబయ్యాయి. వస్త్ర, బంగారు దుకాణాలు, గిఫ్ట్ షాపులు కళకళలాడుతున్నాయి. క్యాటరింగ్‌కు, బ్యాండ్‌సెట్‌కు డిమాండ్ ఏర్పడింది.                                         

పెళ్లంటే నూరేళ్ల పంట. రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను నెలకొల్పి పటిష్ట పరిచే ఒక పండుగ. పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు... తప్పెట్లు... తాళాలు... తలంబ్రాలు... మూడు ముళ్లు... ఏడు అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు. రెండు జీవితాలను ఒక్కటి చేసే వివాహ తంతును అద్భుతంగా వర్ణించేశాడో సినీకవి. ఇంతటి అద్భుతమైన పెళ్లి వేడుకలు తిరుపతిలో ఎక్కడ చూసినా కనపిస్తున్నాయి. శ్రావణమాసంలో ఆగస్టు 13 నుంచి 22 వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. మరో నాలుగు నెలల వరకు ముహూర్తాలు లేవు. దీంతో తిరుపతి, తిరుమలలో ఈనెల 13 నుంచి 16 వరకు మళ్లీ 21 నుంచి 23 వరకు ఈ ఏడు రోజుల్లో సుమారు నాలుగు వేల పెళ్లిళ్లు జరుగనున్నాయి. 13, 14 తేదీల్లో జరిగే పెళ్లిళ్లకు కల్యాణమండపాలు ముస్తాబు ఆయ్యాయి. వస్త్ర, బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. క్యాటరింగ్‌కు, బ్యాండ్‌సెట్‌కు డిమాండ్ ఏర్పడింది. ఉన్నవారు ఘనంగా పెళ్లిళ్లు చేస్తుంటే, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన ధరలు భారంగా మారాయి.

కల్యాణమండపాలు

తిరుపతి, పరిసరాల్లో వందకు పైబడి ప్రైవేట్ కల్యాణమండపాలు ఉన్నాయి. ఒక్క తిరుచానూరు రోడ్డులోనే 11 టీటీడీ కల్యాణ మండపాలు, 40కి పైగా ప్రైవేట్ కల్యాణమండపాలు ఉన్నాయి. తిరుమల, తిరుపతిలోని దాదాపు అన్ని కల్యాణ మండపాలు ఈ మూడు రోజులకు బుక్ ఆయ్యాయి. తిరుమలో 13, 14, 15 తేదీల్లో సుమారు 1000 పెళ్లిళ్లు జరుగనున్నాయి. ప్రైవేట్ కల్యాణమండపాలు రోజుకు రూ.15 వేల నుంచి లక్ష వరకు అద్దె వసూలు చేసేవి ఉండగా టీటీడీ కల్యాణ మండపాలు సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి. ఇవిగాక కొన్ని స్టార్ హోటళ్లలో ప్రత్యేకంగా మినీ ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. అద్దె కాకుండా కల్యాణమండపాల అలంకరణ, బాజాభజంత్రీలు, విందు, వినోదాలకు విడిగా డబ్బు వసూలు చేస్తారు. ఇవిగాకకరెంట్ ఎంత వాడితే అంతకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కాలానుగుణంగా ఆడంబరాలు పెరగడంతో కట్న, కానుకల మాట ఎలా ఉన్నా కల్యాణమండపం, బాజాభజంత్రీలు, డెకరేషన్, క్యాటరింగ్ ఖర్చులకు కనీసం రూ.5 లక్షలు చేతిలో లేకుంటే పెళ్లి చేయడం గగనమే. ఇక ఎవరి స్థాయిని బట్టి వాళ్లు రిసెప్షన్ పేరుతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. తిరుపతిలో ఈ రెండు, మూడు రోజుల్లో ప్రముఖులకు చెందిన వివాహాలు కూడా ఉండడంతో పట్ణణంలోని ఓ మోస్తరు మొదలు స్టార్ హోదా ఉన్న లాడ్జీలు, శ్రీనివాసం, విష్ణునివాసం వంటి టీటీడీ యాత్రికుల వసతి సముదాయాల్లో యాత్రికులకు, పర్యాటకులకు గదులు దొరకడం గగనమైపోయింది. బంగారు, వస్త్రవ్యాపారాలు పెరి గాయి. గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మే దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

ధరాభారం

నింగినంటిన నిత్యావసరాల ధరల నేపథ్యంలో పెళ్లిళ్ల ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. పెళ్లికి సరుకుల సమీకరణ విందుభోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ శ్రమతో కూడుకున్నందున చాలామంది ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థకు బాధ్యతలన్నీ అప్పగించేస్తున్నారు. అయితే ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేద్దామనుకునే సామాన్య, మధ్యతరగతి వాళ్లకు ప్రస్తుత ధరలు భయపెడుతున్నాయి. పూలు, కూరగాయల ధరలు సైతం వారికి అందుబాటులో లేవు. పెళ్లిళ్ల తంతు జరిపించే పురోహితుల సంభావనలు కూడా విపరీతంగా పెరిగాయి. నాదస్వరం, డోలు వాయిద్యగాళ్లకు, క్యాటరింగ్ నిర్వాహకులకు డిమాండ్ ఏర్పడింది,
 
మళ్లీ డిసెంబర్‌లోనే


ఈ మాసంలో తప్పితే మరో మూడు నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ ఏడాది కార్తీక మాసంలో గురు, శుక్ర మౌఢ్యాలు వచ్చాయి. దీంతో ఆ మాసంలో పెళ్లిళ్లకు అవకాశం లేదు. మళ్లీ డిసెంబర్ 4 తర్వాతే ముహూర్తాలు ఉన్నాయి. పైగా శ్రావణమాసం శుభప్రదం కావడంతో చాలామంది ఈమాసంలో పెళ్లిళ్లు పెట్టుకున్నారు.

- వనం గౌరీశంకర్ శర్మ, పురోహిత సంఘ సభ్యుడు, తిరుమల

బంగారు వ్యాపారం పరవాలేదు

వారం రోజుల వ్యవ ధిలోనే వేలాది వివాహాలు జరుగుతుండడంతో బంగారు నగల వ్యాపారం ఆశించిన స్థాయిలో కాకపోయినా ఓమోస్తరుగా పెరిగింది. జూలై ఆషాఢమాసం కావడంతో వ్యాపారాలు లేవు. డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడం, ధరలు కూడా తగ్గడంతో మొత్తంమీద గతంతో పోలిస్తే ఈవారంలో అమ్మకాలు 50 శాతం పెరిగాయి.

 - కేవీ.సత్యనారాయణశెట్టి, అధ్యక్షుడు, తిరుపతి జ్యుయలర్స్ అసోసియేషన్
 
 

Advertisement
Advertisement