పాలనలో సరికొత్త అధ్యాయం | Sakshi
Sakshi News home page

కోటిన్నర కుటుంబాలకు సంక్షేమ ఫలాలు

Published Wed, Feb 5 2020 4:53 AM

Welfare benefits for One and Half Crore families In AP - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే ప్రజా సంక్షేమంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆర్థిక మందగమనం సమయాల్లో వృద్ధి రేటు పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు ఉద్దీపన పథకాలు ప్రకటిస్తాయి. అయితే రాష్ట్రంలో అందుకు పూర్తి భిన్నంగా కోటిన్నరకుపైగా పేద, సాధారణ కుటుంబాల ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.14,795.21 కోట్లు ఆర్థిక సహాయం రూపంలో అందజేసింది. దీని వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని.. ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడుతుందని, ఆర్థిక మందగమనానికి ఇదే విరుగుడని ఆర్థిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాజిక విప్లవం ప్రారంభమైందని విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగ భావిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి ఎనిమిది నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోకు అసలు సిసలు నిర్వచనం ఏమిటో చేతల ద్వారా చూపించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడే ముఖ్యమంత్రిగా నిలిచారు. ఐదేళ్లు అధికారం ఇచ్చారు కదా అనే గత పాలకుల తరహాకు భిన్నంగా అధికారం చేపట్టిన నాటి నుంచే ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. ఎనిమిది నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని సింహ భాగం హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. ఈ పథకాలను ప్రజా ఆకర్షక పథకాలుగా చూడకూడదని, ప్రధానంగా వైఎస్సార్‌ రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల వెనుక బహుళ ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

సామాజిక విప్లవానికి నాంది 
దేశానికి అన్నం పెట్టే రైతులకు పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం అమలు చేయడం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి రైతుల ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా, నేరుగా 46,50,846 మంది రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసాను ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. రైతుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది నుంచే అమలు చేయడం విశేషం. అమ్మఒడి పథకం అమల్లో సామాజిక కోణం స్పష్టంగా కనిపిస్తోంది.

పేదలు తమ పిల్లలను బడికి పంపించకుండా పనులకు తీసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేద పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు కాకుండా బడికి పంపించేందుకు అమ్మఒడి పథకం ప్రారంభించారు. తమ పిల్లలను బడికి పంపించే తల్లులకు ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇచ్చారు. తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే సామాజిక కోణం ఈ పథకంలో దాగి ఉందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని సామాజిక పెట్టుబడిగా చూడాలని కూడా ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమ్మఒడికి లబ్ధిదారులను పారదర్శకంగా.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేయడమే కాకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఏకంగా 42,01,621 మంది తల్లుల ఖాతాలకు నగదు జమ చేశారు.

లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌..
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా పెన్షన్‌ పెంపును దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ నెల 1వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నంలోగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తదితర లబ్ధిదారుల ఇళ్ల వద్దే వలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమం విజయవంతమైంది. పెన్షన్‌ పెంపు పథకం ద్వారా 54,65,564 మంది చేతులకు నేరుగా రూ.1,320.14 కోట్లు ఇచ్చారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. లంచాలు, అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా 1,02,388 మంది మత్య్సకారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. అలాగే చేనేత కార్మికులకు 24 వేల రూపాయల చొప్పున 81,783 మంది ఖాతాలకు నగదు జమ చేశారు. ఇచ్చిన మాట మేరకు అగ్రి గోల్డ్‌ బాధితులకు తొలి దశలో పది వేల రూపాయల డిపాజిట్‌ దారులైన 3,34,160 కుటుంబాలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. ఈ పథకాలను సామాజిక పెట్టుబడిగా చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం విశేషం.
ఉద్యోగాల కల్పనకు బాటలు
మొన్న కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిన విషయాన్ని స్పష్టం చేసింది. ఇటువంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాల ప్రజలకు వివిధ పథకాల కింద సుమారు రూ.15 వేల కోట్లు  పంపిణీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లడానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.  కచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు ప్రజల వినిమయ శక్తిని పెంచి తద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు.  
– డాక్టర్‌ మధుబాబు, ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. 

దీర్ఘ కాలంలో మంచి ఫలితాలు 
ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కోనుగోళ్లు పెరిగితే వృద్ధి రేటు పెరుగుతుంది. తద్వారా ఉద్యోగాల కల్పన ఏర్పడుతుంది. ఇదంతా ఓ సైకిల్‌. ఇప్పుడు నవరత్నాలు, సచివాలయం ఉద్యోగాలతో సీఎం వైఎస్‌ జగన్‌ ఇదే చేస్తున్నారు. మందగమనం సమయంలో సంక్షేమ పథకాల రూపంలో పెద్ద ఎత్తున నగదు వ్యవస్థలోకి పంపడం ద్వారా వృద్ధి రేటు పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది ఆర్థిక పరిస్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది.   
 – ప్రొఫెసర్‌ ఎం.ప్రసాద రావు, ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్, ఆంధ్రా యూనివర్సిటీ  

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఊతం
ప్రభుత్వం ఒక రూపాయి వ్యయం చేస్తే అది అనేక రకాలుగా ఆదాయాన్ని కల్పిస్తుంది. అమ్మఒడి కింద చేసిన వ్యయాన్ని మూల ధన పెట్టుబడి కింద చూడాలి. ఇది వ్యయం కాదు. దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. సంక్షేమ పథకాల మీద చేస్తున్న వ్యయాన్ని రాష్ట్ర ప్రజలపై పెట్టుబడిగా చూడాలి. పేద ప్రజల సంక్షేమ పథకాలపై చేస్తున్న వ్యయం ఆర్థిక వ్యవస్థకు మంచిదే.    
– పి.సుదర్శన్‌రెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎకనామిక్స్‌ డిపార్ట్‌మెంట్, యోగి వేమన విశ్వవిద్యాలయం.

Advertisement
Advertisement