సంక్షేమ శాఖల్లో విభజన కొలిక్కి | Sakshi
Sakshi News home page

సంక్షేమ శాఖల్లో విభజన కొలిక్కి

Published Tue, May 6 2014 1:53 AM

సంక్షేమ శాఖల్లో విభజన కొలిక్కి

* 58:42 ప్రాతిపదికన సీమాంధ్ర, తెలంగాణలకు పంపకాలు  
* గిరిజన శాఖలో మాత్రం 46 : 54 నిష్పత్తిని సూచించిన అధికారి   
* సంక్షేమ భవన్‌లో తెలంగాణకు మూడు, సీమాంధ్రకు నాలుగు ఫ్లోర్లు.. ప్రభుత్వానికి నివేదిక

 
సాక్షి, హైదరాబాద్: సంక్షేమశాఖల్లో విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఆస్తులు, అప్పులతో పాటు ఉద్యోగుల విభజన పై కూడా ప్రతిపాదనలు తయారుచేసిన సంక్షేమ శాఖల అధికారులు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి పంపించారు. 58 :42 నిష్పత్తిలో సీమాంధ్ర, తెలంగాణలకు విభజనను పూర్తిచేశారు. రాష్ట్రంలో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమశాఖలు పనిచేస్తున్నాయి. 23 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లా యూనిట్‌గా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఉద్యోగులు, అధికారుల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో గత నెల రోజులుగా ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక రూపొందించినట్టు ఉన్నతాధికారి ఒకరు‘సాక్షి’కి తెలిపారు.
 
 గిరిజనశాఖ విషయంలో జనాభా పట్టని వైనం   
 తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల జనాభా సీమాంధ్ర కన్నా ఎక్కువ కాబట్టి... తెలంగాణకు 54 శాతం, సీమాంధ్రకు 46 శాతం కింద పంపకాలుండాలని,ఆమేరకు  నివేదిక రూపొందించాలని ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే అధికారి చెప్పిన విధంగా ఓ నివేదికను రూపొందించినప్పటికీ, ఆన్‌లైన్‌లో మాత్రం సీమాంధ్రకే 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రకారమే విభజనను ప్రతిపాదించి అప్‌లోడ్ చేసినట్టు తెలిసింది. సీమాంధ్రకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రాతిపదికన పంపకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని సంక్షేమ శాఖలు నివేదికలు రూపొందించాయి.  ఓపెన్ కేటగిరీ కింద ఉద్యోగాలు సంపాదించి హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కూడా అవే మార్గదర్శకాలనే పాటించారు. కాగా గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి జనాభా ఆధారంగా విభజించాలని, సీమాంధ్ర కన్నా తెలంగాణలో గిరిజనులు అధికంగా ఉన్నందున  పంపకాల విషయంలో ఉన్నతస్థాయి వర్గాల నుంచి కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అయినప్పటికీ మిగిలిన శాఖల మాదిరిగానే పంపకాలతో నివేదిక పంపించినట్టు తెలిసింది.
 
 సంక్షేమ భవన్ రెండు విభాగాలుగా...
 మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌ను కూడా 58:42 ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణలకు విభజించారు. ఏడు అంతస్తులున్న ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు అంతస్తులను తెలంగాణకు, నాలుగు నుంచి ఏడు అంతస్తులను సీమాంధ్రకు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, అధికారులు పై మూడు అంతస్తులను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, వారికి ప్రాధాన్యత ఇస్తూ తదనుగుణంగా మార్పులు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
 
 శ్రీశైలం ఐటీడీఏ నుంచి వేరుకానున్న మహబూబ్‌నగర్
 శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలున్నాయి. విభజన కారణంగా శ్రీశైలం సీమాంధ్రకు వెళుతున్నందున మహబూబ్‌నగర్ జిల్లాను ఈ ఐటీడీఏ నుంచి వేరుచేశారు. ఇప్పటికి తెలంగాణలో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఐటీడీఏలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ అటవీప్రాంతం, చెంచుగ్రామాల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement