3 నెలల్లో సంక్షేమ సంతకం | Sakshi
Sakshi News home page

3 నెలల్లో సంక్షేమ సంతకం

Published Mon, Feb 10 2014 1:25 AM

3 నెలల్లో సంక్షేమ సంతకం - Sakshi

 శ్రీకాకుళం సమైక్య శంఖారావం సభలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
 
     అధికారంలోకి వచ్చిన తొలిరోజే పేదల బతుకుల్లో

      వెలుగులు నింపేలా  నాలుగు సంతకాలు చేస్తా
     అభివృద్ధి విప్లవం సృష్టిస్తా.. రాష్ట్ర ప్రగతిని మలుపు తిప్పుతా
     అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల చదువుల బాధ్యతను మేమే తీసుకుంటాం
     ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున ఇద్దరికి కలిపి నెలకు రూ.వెయ్యి అందిస్తాం
     అవ్వాతాతలకు మనవడిలా ఉంటా.. నెలకు రూ.700 వృద్ధాప్య పింఛన్ ఇస్తాం
     రైతన్నకు కొడుకులా అండగా నిలుస్తా.. వారు నష్టపోకుండా ఉండేందుకు
     రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా
     అక్కాచెల్లెళ్లకు అన్నగా ఉంటా.. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా
     వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు
     జుత్తు జగన్నాయకులు, తైనాల విజయ్‌కుమార్
     శ్రీకాకుళం జిల్లాకు చెందిన 282 మంది సర్పంచులు, 432 మంది కీలక నేతలు కూడా

 
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘మూడు నెలల్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. అధికారం చేపట్టిన తొలిరోజే రాష్ట్ర ప్రగతిని మలుపు తిప్పేలా నాలుగు సంతకాలు చేస్తా.. ఈ నాలుగు సంతకాలతో ఆంధ్రప్రదేశ్ గతిని సమూలంగా మార్చి వేస్తాం. కొత్త అభివృద్ధి విప్లవం సృష్టిస్తాం..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అమ్మఒడి పథకంపై   తొలి సంతకం, వృద్ధాప్య పింఛన్లపై రెండో సంతకం, రైతన్నల కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుపై మూడో సంతకం, డ్వాక్రా రుణాల రద్దుపై నాలుగో సంతకం చేస్తానని స్పష్టంచేశారు. ఆదివారం శ్రీకాకుళంలో నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ బహిరంగ సభలో జగన్ సమక్షంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జుత్తు జగన్నాయకులు (పలాస), తైనాల విజయ్‌కుమార్ (విశాఖ ఉత్తరం), ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతితోపాటు శ్రీకాకుళం జిల్లాలోని 282 మంది సర్పంచులు, 432 మంది మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తూ.. అధికారంలోకి రాగానే తాము అమలుచేయబోయే సంక్షేమ అజెండాను ప్రకటించారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
 
 30 ఏళ్లపాటూ సువర్ణయుగమే..

 ‘‘మూడు నెలలు ఆగండి.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తొలిరోజే రాష్ట్ర ప్రగతిని మలుపుతిప్పేలా నాలుగు ముఖ్యమైన సంతకాలు చేస్తా. మొదటిది అమ్మ ఒడి. రాష్ట్రంలోని నా అక్కాచెల్లెళ్లు తమ బిడ్డలను ధైర్యంగా బడికి పంపించేలా చేస్తాను. బడికి పంపితే చాలు.. ఇంజనీరు, డాక్టరు, కలెక్టర్ వంటి పెద్ద చదువులను చదివించే ఏర్పాటు చేస్తాం. బడికి వెళ్లే బిడ్డకు నెలకు రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు బిడ్డలకు నెలకు రూ.వెయ్యి అమ్మ ఖాతాలోనే జమ చేస్తాం. అలాంటి అమ్మ ఒడి పథకంపైనే తొలి సంతకం చేస్తా. ఇక రెండో సంతకం... వృద్ధాప్య పింఛన్ల ఫైలుపై చేస్తాను. నేను వెళ్లినప్పుడు నా అవ్వలు, తాతలు రెండు చేతులు చూపిస్తున్నారు. ‘నెలకు రూ.200 పింఛనుతో ఒకపూటే తినగలుగుతున్నాం. పనికి వెళ్లకపోతే మిగిలిన పూటలు పస్తులు ఉండాల్సి వస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అవ్వలు, తాతలకు మనవడిలా తోడుంటా. వారికి మూడు పూటలా కడుపు నిండేలా వృద్ధాప్య పింఛన్‌ను నెలకు రూ.700కు పెంచుతూ రెండో ఫైలుపై సంతకం చేస్తా. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర రాక రైతన్నలు నష్టపోతున్నారు. పండించిన పంటలను తీసుకుని వెళ్తే సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. డీలర్ వద్దకు తీసుకువెళ్లగానే ధర తగ్గిపోతోంది. రైతు అమ్మిన వెంటనే ధర మళ్లీ పెరిగిపోతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక మీదట ఇలా వారు నష్టపోకుండా చూస్తా. వారికి ఒక కొడుకులా ఉంటా.. రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తా. డ్వాక్రా మహిళలకు అన్నయ్యగా నాలుగో సంతకం చేస్తాను. నా అక్కాచెల్లెళ్లు తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తా. ఈ నాలుగు సంతకాలతో 5 ఏళ్లు కాదు మనం పరిపాలించేది... మరో 30 ఏళ్లపాటు రాష్ట్రంలో రాజన్న సువర్ణ యుగాన్ని అందిస్తాం.
 
 పేదల బాధలను కళ్లారా చూశా...

 రాష్ట్రంలో ఏ నేత అయినా పేదల పూరి గుడిసెలోకి వెళ్లారా?... పేదల బాధలు చూశారా? నేను ఓదార్పు యాత్ర ద్వారా రాష్ట్రంలో 24 వేల కి లోమీటర్లకు పైగా తిరిగాను. 700 నుంచి 800 పేద కుటుంబాలను ఓదార్చాను. పేదల గుడిసెల్లోకి వెళ్లాను. వారి బతుకులు చూశాను. రోజుకు రూ.100 నుంచి రూ.150 కూలీతో బతుకులు వెళ్లదీస్తున్న పేదల బాధలను కళ్లారా చూశాను. అందుకే రాష్ట్రంలో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా రాజన్న సువర్ణ యుగాన్ని తీసుకువచ్చేందుకు ఈ నాలుగు సంతకాలు చేయాలని నిర్ణయించా. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు కాకుండా రెండోరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదో సంతకం చేస్తా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను రద్దుచేస్తూ ఐదో సంతకం చేస్తా.
 
 బంగారం లాంటి రాష్ట్రంలో చిచ్చుపెట్టారు..

 ఒక మనిషి తలచుకుంటే బంగారం లాంటి రాష్ట్రంలో ఎలా చిచ్చుపెట్టవచ్చో సోనియాగాంధీని చూసి తెలుసుకోవచ్చు. తన కొడుకు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్షంగా దీన్ని ఖండించాల్సిన చంద్రబాబు నాయుడు... నిస్సిగ్గుగా కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారు. అసెంబ్లీలో ఒక చేత్తో సైగ చేసి సీమాంధ్ర టీడీపీ నేతలతో జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేయిస్తారు... మరికాసేపటికి మరో చేత్తో తెలంగాణ  నేతలకు సైగ చేసి జై తెలంగాణ అనిపిస్తారు. పార్లమెంటులో కూడా ఇలాగే డ్రామాలు ఆడతారు. మళ్లీ జనంలోకి వెళ్లి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చె బుతారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో తిరుగుతూ... నేను కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యానని ఆరోపించారు. కాంగ్రెస్‌తో కుమ్కక్కైంది ఎవరు?.. చంద్రబాబు కాదా..? వైఎస్ మరణించిన 18 నెలల తర్వాత నాపై కాంగ్రెస్‌తో కలిసి అక్రమ కేసులు వేయడం కుమ్మక్కు కాదా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ సహకరించడం కుమ్మక్కు కాదా? ఆర్టీఐ కమిషనర్ పోస్టులను పంచుకోవడం కుమ్మక్కు రాజకీయం కాదా?... ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాల కేసులపై సీబీఐ విచారణ జరగకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కవ్వడం నిజం కాదా? నేను జైల్లో ఉండి కూడా ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఓటు వేశాను. కానీ బయట ఉండి చంద్రబాబు ఏం చేశారు? ఎఫ్‌డీఐలపై ఓటింగ్ జరుగుతుంటే తమ పార్టీ రాజ్యసభ సభ్యులు గైర్హాజరయ్యేలా చేసి కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాలేదా? రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై విపక్షాలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే... చంద్రబాబు విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది కుమ్మక్కు రాజకీయంతో కాదా?
 
 ప్రజా సమస్యల ఊసేది?

 అక్కాచెల్లెమ్మలకు రూ.1500 పెడితేగానీ గ్యాస్ సిలిండర్ రావడం లేదు. ఇంటికి వెళ్లి స్విచ్ వేస్తే చాలు కరెంటు బిల్లుల షాక్ తగులుతోంది. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 133 రోగాలను తొలగించారు. విద్యార్థుల రెండో సెమిస్టర్ కూడా అయిపోతోంది. అయినా ఒక్క విద్యార్థికి కూడా ఫీజుల పథకం కింద ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ సమస్యలపై అసెంబ్లీలో కనీసం చర్చించ లేదు. 44 రోజులు అసెంబ్లీలో ఏం చర్చించారో తెలుసా..? బంగారం లాంటి ఈ రాష్ట్రాన్ని ఎలా విభజించాలనే దానిపై చర్చించారు. అంతకన్నా దౌర్భాగ్యం ఉందా?
 
 ఫ్యాన్ గాలికి ఆ ముగ్గురూ కొట్టుకుపోవాలి

 ఇక్కడకు హాజరైన మీరంతా చేతులు పెకైత్తి గిరగిరా తిప్పండి... వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సోనియా, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు కొట్టుకుపోయేలా తిప్పండి. ఆ ముగ్గురినీ శాశ్వతంగా సాగనంపేలా తిప్పండి. (ఈ సందర్భంగా ప్రజలు చేతులు పెకైత్తి జగన్ నినాదాలతో హోరెత్తించారు)’’
 ఈ బహిరంగ సభలో ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, పి.రాజన్నదొర, పార్టీ నేతలు సుజయ్‌కృష్ణ రంగారావు, తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రజా ఉప్పెనలో కొట్టుకుపోతారు

 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘ఓట్లు, సీట్లు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం సోనియా రాష్ట్రాన్ని విడదీస్తుంటే.. అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసి ఎనిమిది నెలలు అవుతున్నా ముఖ్యమంత్రి రాజీనామా చేయరు. ప్రకటన వచ్చినప్పుడే రాజీనామా పత్రాన్ని సోనియా ముఖంపై కొట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా..?’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. విభజనకు కారణమైన సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు.. ముగ్గురూ ప్రజా ఉప్పెనలో కొట్టుకుపోతారని మండిపడ్డారు. శ్రీకాకుళం సభకు ముందు జగన్ విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన సమైక్య శంఖారావం సభలో ప్రసంగించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడ్డారు. ఈ సభలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్‌చార్జి సుజయ కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement