రుణం అందని ద్రాక్షేనా ?

2 Feb, 2015 10:55 IST|Sakshi

ఏడాదిగా లబ్ధిదారుల ఎదురుచూపు
రుణ అర్హత పొందిన వారు 1586 మంది
మంజూరైంది 150 మందికే  

 
 నెల్లూరు (సెంట్రల్): టీడీపీ హయాంలో సంక్షేమ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. నిధుల లేమి సాకుతో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించాల్సిన పథకాలేవీ అమలుజేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. సబ్సిడీ రుణాలు పొంది స్వయం ఉపాధి పొందుదామని భావించిన వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణం అందని ద్రాక్షగానే మిగిలేలా ఉందని వాపోతున్నారు. తాను అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీలను ఆదుకుంటానని చెప్పిన సీఎం చంద్రబాబు మాటలు నీటిమూటలుగానే మిగిలాయి.  
 
  2013-14 ఆర్థిక సంవత్సరానికి ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారేగానీ నేటికీ రుణాలివ్వలేదు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2013-14 సంవత్సరానికి గాను సబ్సిడీతో రూ.15.70 కోట్ల మేరకు రుణాలు 1586 మందికి ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఇప్పటివరకు కేవలం 150 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేసి అధికారులు, బ్యాంకులు చేతులు దులుపుకున్నారు. లబ్ధిదారులు ఏడాది నుంచి ఎస్సీ కార్పొరేషన్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యమని వాపోతున్నారు.
 
 బ్యాంకుల చుట్టూ వందల సార్లు తిరిగి విసిగిపోయామని ఆవేదన చెందుతున్నారు.  పనులు మానుకుని రుణాల కోసం ఎన్ని రోజులు తిరిగినా తమ గురించి పట్టించుకునే వారే కరువయ్యారని ఆందోళన చెందుతున్నారు.  ఆర్థిక సంవత్సర ముగిసేలోగా కేటాయించిన నిధులు ఖర్చుచేయకపోతే అవి వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది లబ్ధిదారులు రుణాలు అందక అవస్థలెదుర్కొంటున్నారు. ఎన్నాళ్లని తాము రుణాల కోసం ఎదురుచూడాలని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు  తక్షణమే స్పందించి అర్హులైలన  తమకు రుణాలు మంజూరుచేసి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు