దొంగలు దొరికారు.. | Sakshi
Sakshi News home page

దొంగలు దొరికారు..

Published Sun, Nov 9 2014 2:49 AM

దొంగలు దొరికారు.. - Sakshi

రూ. 18 లక్షల విలువైన 61.6 తులాల బంగారం స్వాధీనం

 అనంతపురం క్రైం :  అనంతపురం వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో నలుగురు దొంగలను పట్టుకున్నారు. వీరినుంచి రూ. 18 లక్షలు విలువ చేసే 61.6 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ రాజశేఖర్‌బాబు శనివారం వన్‌టౌన్ పోలీస్‌స్టేసన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం నగరం బుడ్డప్పనగర్‌కు చెందిన  షికారి సద్‌సింగ్ అలియాస్ శీనా, నీరు షికారి అర్జున్, నీరు షికారి రామకృష్ణతో పాటు కదిరి పట్టణానికి చెందిన షేక్ అహ్మద్ అలియాస్ టీపాను అరెస్టు చేశారు.

వీరిలో సద్‌సింగ్, అర్జున్, రామకృష్ణ ఒక గ్యాంగ్. వీరు ముగ్గురు స్వయానా బంధువులతో పాటు స్నేహితులు. తాగుడు, జూదం అలవాట్లకు మరిగిన వీరు దొంగతనాలకు ఎంచుకున్నారు. ఉదయం పూట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తుంచుకుని రాత్రిపూట తాళాలు పగులకొట్టి ఆ ఇళ్లలో దొంగతనాలు చేసేవారు. ఎస్‌బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డుకాలనీ, హమాలీకాలనీ, వినాయకనగర్, నీరుగంటివీధి, అశోక్‌నగర్, కల్పనాజోష్‌కాలనీ, నవోదయకాలనీ, మరువకొమ్మకాలనీ, తారకరామాకాలనీల్లో ఈ ముటా గత రెండేళ్లలో 13 చోరీలకు పాల్పడింది.

మరో నిందితుడు షేక్ అహ్మద్ కదిరి ప్రాంతంలో చిన్నచిన్న దొంగతనాలు చేశాడు. గతనెల 22న హౌసింగ్‌బోర్డుకాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు. ఒక పోలీసు ఒక దొంగను పట్టుకోవాలనే నినాదంతో జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దొంగతనాలపై నిఘా పెంచారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి పర్యవేక్షణలో అనంతపురం డీఎస్పీ నాగరాజ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా విడిపోయి దొంగలపై కన్నేశారు.

ఈ క్రమంలో శనివారం నలుగురు దొంగల్లో ముగ్గురిని బీరప్పగుడి సమీపంలో, మరొక దొంగ షేక్ అహ్మద్‌ను కలెక్టర్ కార్యాలయం ఎదుట పట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వె ళ్లే సందర్భాల్లో ప్రజలు సంబంధిత పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఎస్పీ కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement