కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు

11 Apr, 2020 08:52 IST|Sakshi
రక్షణ దుస్తులతో పోలీసుల నిత్య పర్యవేక్షణ

సాక్షి, పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికంగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో కఠిన నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. పెనుగొండలో మసీదు వీధి, ఉర్రేంకుల వారి వీధి, కొండపల్లివారి వీధిలో ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకడంతో వీటి పరిధిలో 820 మీటర్ల మేర అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా ప్రకటించారు. ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. పెనుగొండ పంచాయతీలో కాల్‌సెంటర్‌ 08819–246081 నంబర్‌ ఏర్పాటు చేశారు. ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే అత్యవసరమైన నిత్యావసరాలు, మందులు వారి చెంతకే అందేవిధంగా ఏర్పాటు చేశారు. వీటికి నగదు చెల్లించాలి.
  
డ్రోన్‌లతో పర్యవేక్షణ  
పోలీసులు రక్షణ దుస్తులు ధరించి నిత్యం పర్యవేక్షణ చేస్తూ డ్రోన్‌లతో చిత్రీకరిస్తున్నారు. ఎవరైనా డ్రోన్‌లకు చిక్కితే కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు.  

ప్రజలు సహకరించాలి: మంత్రి  
పెనుగొండ: పెనుగొండ కరోనాకు నెలవుగా మారడంతో వ్యాప్తి నిరోధానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విజ్ఞప్తిచేశారు. కరోనా నిరోధానికి పెనుగొండలో తీసుకొంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకూ 250 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. పెనుగొండలోని మూడు ప్రమాదకర ప్రాంతాలను కలిపి రెడ్‌జోన్‌గా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. నిత్యావసరాలకు ఇబ్బందులు రానివ్వొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే మూడో విడత ఆరోగ్య సర్వే ప్రారంభమైందన్నారు. ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సత్వరం ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. చదవండి: కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్‌ 

మరిన్ని వార్తలు