దొంగ ఓట్లకు ‘పచ్చ’జెండా.. | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్లకు ‘పచ్చ’జెండా..

Published Thu, Jan 9 2014 1:50 AM

Whatever the thief 'green' flag ..

విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : దొంగ ఓట్లకు అదికారులు పచ్చజెండా ఊపారు. ఒకే డోరు నంబర్‌తో అత్యధిక ఓట్లు నమోదు చేసి అక్రమాలకు తెగబడ్డారు. పలు నియోజకవర్గాల్లో అడ్డు అదుపులేకుండా గంపగుత్త ఓట్ల నమోదు చేయించడంలో తెలుగు తమ్ముళ్లు సఫలీకృతులయ్యారు.   అధికారులు చూసీ చూడనట్లు వారికి సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాకు తుదిరూపు తీసుకుని వచ్చేందుకు కసరత్తు  ముమ్మరం చేసిన అధికారులు ఒకమారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే లోగుట్టు వెలుగులోకి వస్తుంది.

టీడీపీ నాయకులు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు జిల్లాలో  7 నియోజకవర్గాలను ఎంపిక చేసి పథకం ప్రకారం  దొంగ ఓట్లను చేర్పించారనే విమర్శలు వినవస్తున్నాయి. విజయవాడలో మూడు నియోజకవర్గాలు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, పెనమలూరు, అసెంబ్లీ సెగ్మంట్లలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించినట్లు తెలిసింది. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ   గ్రామ స్థాయిలో అధికారులను పట్టుకుని బోగస్  ఓట్లు చేర్పించినట్లు తెలిసింది.  

కొన్ని బూత్‌లలో ఇళ్లలోని ఇంటర్నెట్ ద్వారా బోగస్ సంతకాలతో  దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించి ఓటర్ల జాబితాలో చేర్పించేశారని తెలుస్తుంది. ఒకే డోర్ నంబర్‌లో దాదాపు 20 మంది ఓటర్లను  నమోదు చేశారు.   గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు చూసీ చూడనట్లు వారికి సహకరించినట్లు తెలుస్తోంది. పోరంకి రామాపురం రోడ్డులో ఒకే డోర్ నంబర్ 12.52లో 32ఓట్లు ఉన్నాయి. ఒకే డోర్ నంబర్‌గల ఇండివిడ్యువల్ హౌస్‌లో  32ఓట్లు ఉండటం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుంది.  

ఇక్కడ టీడీపీకి ఆధిపత్యం ఉన్న ప్రాంతం గావటం గమనార్హం. ఇదే  తరాహాలో తమకు  ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల విచారణలో కిందిస్థాయి సిబ్బందిని టీడీసీ నేతలు  వశపరుచుకుని అక్రమాలకు పాల్పడ్డారు. స్వగ్రామాలు, పట్టణాలు వదలి విదేశాలు,   ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పేర్లను కూడా టీడీపీ నేతలు జాబితాల్లో చేర్చించినట్లు తెలిసింది. ఓటర్ల జాబితాల్లో డబుల్ ఎంట్రీలు  సరిచేయకుండా తప్పుల తడకలుగా సవరణల ప్రక్రియను పూర్తి చేశారు. చనిపోయిన వారి పేర్లు  యథావిధిగానే ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా విజయవాడ నగరంతో పాటు పలు నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలపై సమగ్ర విచారణ జరిపి బోగస్ ఓట్లను తొలగించాలని పలు గ్రామాల ప్రజలు  కలెక్టర్‌ను కోరుతున్నారు.     

 దొంగ ఓట్లు తొలగించాలి...

 పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలలో దొంగ ఓట్లను తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త  పడమట సురేష్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సబ్-కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దాదాపు 10 వేల దొంగ ఓట్లు టీడీపీ నాయకులు చేర్పించారని  ఫిర్యాదు చేశారు.  పోరంకిలోని 74 పోలింగ్ కేంద్రంలో ఎస్.ఎల్.నెం. 65లో కిలారు శ్రీధర్ బాబు  ఐదేశ్లుగా అమెరికాలో ఉంటున్నారని వివరించారు.
 

Advertisement
Advertisement