‘అధికార’ గిమ్మిక్కులు | Sakshi
Sakshi News home page

‘అధికార’ గిమ్మిక్కులు

Published Tue, Apr 9 2019 11:20 AM

When Elections Are Approaching, TDP Government Entitled Of Giving RunaMaphi - Sakshi

సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మభ్యపెడుతోంది. గత ఏడాది జూన్‌లోనే నాల్గో విడత రుణమాఫీకి సంబంధించిన సొమ్ము రైతు ఖాతాల్లో జమ కావాలి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ  గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాది జనవరిలోనే నాలుగు, ఐదు విడతల రుణమాఫీ సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసింది.

జిల్లాలోనే 5.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.913 కోట్ల నిధులను జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి పట్టించుకోకుండా,  అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు కొంత సొమ్ము విదిల్చి జిమ్మిక్కులు చేసింది. రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ సొమ్ము గురించి పట్టించుకోలేదు.

అయితే ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో రెండు విడతల సొమ్ము కాకుండా, నాల్గో విడత రుణమాఫీ సొమ్ము జమ చేశామని, బ్యాంకులకు రుణ ఉపశమన పత్రాలు, ఆధార్‌ కార్డు బ్యాంకులో ఇస్తే రైతుల ఖాతాల్లో  సొమ్ము జమ అవుతుందని  ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులను మభ్య పెట్టడం తప్ప, సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్న నమ్మకం లేదనే భావన రైతు సంఘాల నాయకులతోపాటు, రైతుల్లో  వ్యక్తమవుతోంది. 

విడుదలకాని పరిహారం
రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం  ఇచ్చి ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. గతేడాది రబీలో ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేకపోవటంతో, క్వింటాకు రూ.200 చొప్పున రైతులకు అదనపు సాయం ఇస్తామని చెప్పి రైతుల జాబితాలను సిద్ధం చేసింది.

దీనికి సంబంధించి వేలాది మంది రైతులకు రూ.53 కోట్లు ఇంతవరకు రైతుల ఖాతాల్లో చేరలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేశామని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మొక్కజొన్న, జొన్న  రైతులు అదనపు సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వరి పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన పెథాయ్‌ తుపాను వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగడంతో పాటు, కల్లంలో ధాన్యం తడిచి పంట మొలకెత్తడంతో పాటు, ధాన్యం రంగు మారిపోయింది.

రైతులు భారీగా నష్టపోయారు. నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసి, రూ.67 కోట్లు నష్ట పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించింది. అది ఇప్పటి వరకు రైతులకు మాత్రం చేరలేదు. జిల్లాలో తొమ్మిది కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయి దెబ్బతిన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లు, పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు  ప్రభుత్వం రైతులకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. దీంతో ప్రభుత్వం విడుదల చేస్తామని చెబుతున్న నాల్గో విడత రుణమాఫీపై రైతులు పెదవి విరుస్తున్నారు. 

Advertisement
Advertisement