విచారణ ఎప్పుడు? | Sakshi
Sakshi News home page

విచారణ ఎప్పుడు?

Published Wed, Jun 1 2016 2:05 AM

When the trial?

సెలవులోనే కొనసాగుతున్న సీటీవో
జేఏసీగా ఏర్పడ్డ నాలుగు జిల్లాల ఉద్యోగులు
మంత్రి యనమలను కలిసిన తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్
ద్విసభ్య కమిటీ నివేదిక వచ్చాకనే సర్కారు తుది నిర్ణయం


తిరుపతి: తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ (టీసీసీ) ప్రతినిధులు వారం రోజుల కిందట సీటీవో శ్రీనివాసులునాయుడుపై ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వ పరంగా జరగాల్సిన విచారణలో జాప్యం జరుగుతోంది. అధికారపార్టీకి చెందిన కొందరు పెద్దలు, మరికొంత మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కలిసి విచారణ జాప్యానికి తెర వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారని వ్యాపార వర్గా లు అనుమానిస్తున్నాయి. వారం కిందటే విచారణ కోసం ఇద్దరు అధికారులతో ద్విసభ్య కమిటీని వేసిన ప్రభుత్వం రోజులు గడుస్తున్నా ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లోని 27 వ్యాపార సంఘాలు మే 25 నుంచి మూడు రోజుల పాటు ట్రేడ్ బం ద్‌కు పిలుపునిచ్చాయి.


సీటీవో-2 గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులునాయుడు వేధింపులకు నిరసనగా 25న చాంబర్ ఆఫ్ కామర్స్ తిరుపతి, చంద్రగిరి, తిరుచానూ రు, రేణిగుంటలో ట్రేడ్ బంద్ నిర్వహించింది. అప్పట్లో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వివాదంపై విచారణ నిర్వహించి నివేదిక తెప్పించుకుంటామని ప్రకటించారు. విచారణ కోసం అదనపు కమిషనర్ రమేష్‌బాబు, జాయింట్ కమిషనర్ ఏడుకొండలును సర్కారు ఏర్పాటు చేసింది. సెలవు పై వెళ్లిన శ్రీనివాసులునాయుడు హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేశారు. దీంతో 25వ తేదీ సాయంత్రమే బం ద్‌ను విరమిస్తున్నట్లు  టీసీసీ ప్రకటించింది. ఆ తరువాత వాణిజ్య పన్నుల శాఖలో ఈ వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

మంత్రిని కలిసిన టీసీసీ....
మహానాడుకు హాజరైన మంత్రి యనమల రామకృష్ణుడును 29న టీసీసీ ప్రతిని ధులు కలిసి శ్రీనివాసులునాయుడు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పె ట్టారు. మంత్రి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సమాచారం అందుకున్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు 29వ తేదీన చిత్తూరులో అత్యవసరంగా సమావేశమయ్యారు. వ్యాపారులంతా కలిసి ఒక అధికారిపై ఆరోపణలు చేయడం సబబు కాదనే నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్తులో ఈ తరహా సమస్య లు ఎదురైనపుడు సమష్టిగా పోరాడేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యంను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. తిరుపతి, చిత్తూరు సీటీవోలు రావణ్, వరలక్ష్మి కూడా జేఏసీలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల సమావేశం గురించి తెల్సుకున్న టీసీసీ ప్రతినిధుల్లో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన పెద్దలే మరోవైపు నుంచి ఉద్యోగులను సమర్థిస్తున్నారని భావిస్తున్నారు. దీనివల్లనే వారం రోజులు గడిచినా విచారణకమిటీ తిరుపతి రాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 
కమిటీ విచారణ పూర్తి చేసి ఆపైన అందజేసే నివేదిక ఆధారంగానే శ్రీనివాసులునాయుడు ఎక్కడ పనిచేయాలన్న నిర్ణయం జరుగుతుందని ఆ శాఖలోని ఉద్యోగు వర్గాలు అంచనా.

 

Advertisement
Advertisement