ఉల్లికి ప్రోత్సాహమేదీ! | Sakshi
Sakshi News home page

ఉల్లికి ప్రోత్సాహమేదీ!

Published Sun, Aug 2 2015 3:15 AM

ఉల్లికి ప్రోత్సాహమేదీ! - Sakshi

ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఉల్లికి ప్రోత్సాహం కరువయింది. ఏటా విస్తీర్ణం తగ్గుతోంది. ఉల్లి ధరలు పెరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులకు నిర్లక్ష్యం వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉల్లి సాగుతోపాటు దిగుమతులూ తగ్గిపోవడంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో రూ.25 ఉన్న ఉల్లి ధర అమాంతంగా రూ.40 పెరిగింది. నాణ్యత చూపిస్తూ కొన్ని చోట్ల రూ.45 అమ్ముతున్నారు. దీనికి కారణం గత ఐదేళ్ళుగా పంట సాగు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఉద్యానశాఖ అధికారుల గణాంకాల ప్రకారం  2012లో 900 హెక్టార్లలో సాగవగా 2013లో 655 హెక్టార్లకు పడిపోయింది.

2014-15కు వచ్చే సరికి 500హెక్టార్లకు కుచించుకుపోయింది. రైతులతో మాట్లాడి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీపై ఇవ్వటానికి  2013-14లో  రూ.39 లక్షలు కేటాయించారు. అప్పట్లో వీటిని ఆ శాఖ పరిధిలో ఉన్న  మిర్చి పంటకు మినహా ఏ పంటకైనా ఇవ్వవచ్చునని ప్రభుత్వ సడలింపు ఇచ్చింది. అలాంటి వీలున్న ఉల్లికోసం ఇప్పటి వరకూ కేటాయించింది నామమాత్రమేనని చెప్పవచ్చు. ఏళ్ళతరబడి ఈ పంటసాగులో తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement