అక్రమ కట్టడాలపై కొరడా! | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలపై కొరడా!

Published Tue, Feb 17 2015 2:47 AM

అక్రమ కట్టడాలపై కొరడా!

అద్దెకు ఇచ్చిన పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో సిబ్బంది
రంగంలోకి దిగిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం

 
కర్నూలు : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించేందుకు నగరపాలక సంస్థ రంగం సిద్ధం చేసింది. నగరంలో అడ్డగోలు నిర్మాణాలపై ‘అంతా మాఇష్టం’ శీర్షికన  సోమవారం సాక్షి దదిన పత్రికలో ప్రచురితమైన కథనానికి నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. కమిషనర్ అదేశాలకు మేరకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వీరారెడ్డి నేతృత్వంలో ఓ బృందం మంగళవారం నగరంలో విస్తృతంగా పర్యటించింది. పలుచోట్ల అక్రమ భవన నిర్మాణ పనుల్ని ఈ బృంద సభ్యులు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ-క్యాంపు సమీపంలో ఆర్‌అండ్‌బీ క్వార్టర్‌ను కూల్చివేసి ఆ స్థలంలో కొత్తగా చేపట్టిన అక్రమ నిర్మాణ  పనుల్ని టౌన్‌ప్లానింగ్ అధికారి శాస్త్రితోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఆ స్థలంలో నిర్మాణ  పనులకు సంబంధించి రోడ్లు, భవనాల శాఖ ఎలాంటి నిరభ్యంతర పత్రం ఇవ్వలేదు. అయితే, ఆ స్థలానికి కర్నూలు తహశీల్దారు కార్యాలయం నుంచి తాత్కాలిక పట్టా ఇవ్వడం.. దాని ఆధారంగా గతంలో నగరపాలక సంస్థలో బిల్డింగ్ ప్లాన్‌కు అనుమతి కోరగా.. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు.

దీంతో వారు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితి కొనసాగించాలని స్టే ఇచ్చారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసురావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు నిర్మాణ దారున్ని తీవ్రంగా హెచ్చరించారు. ఎలాంటి పనులు చేపట్టొద్దని, నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి.. పనుల్ని నిలిపివేశారు. ఇక పార్కింగ్ స్థలాలను అద్దెకు ఇచ్చిన వాణిజ్య సముదాయాల్ని గుర్తించే పనిలో పట్టణ ప్రణాళిక సిబ్బంది నిమగ్నమైంది. ఈ విషయంపై సిటీప్లానర్ వీరారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నగరంలో అనధికారిక కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పార్కింగ్ స్థలాల్ని ఇతరత్రా వాటికి వినియోగిస్తున్న బిల్డర్లకు, యాజమానులకు నోటీసులు జారీ చేయనున్నామని చెప్పారు. ఫంక్షన్‌హాళ్లలోనూ ఫైర్‌సేప్టీ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సదుపాయం కల్పించాలని పేర్కొంటూ వారికి ఇది వరకే నోటీసులు జారీ చేశామని, నేటికీ వాటిని ఏర్పాటు చేయని ఫంక్షన్‌హాళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పార్కింగ్ స్థలాల్ని ఆక్రమించిన వారిని వారంలోగా ఖాళీ చేయిస్తామని ఆయన  వివరించారు.

Advertisement
Advertisement