ఆపేవారెవరు | Sakshi
Sakshi News home page

ఆపేవారెవరు

Published Wed, Nov 6 2013 1:17 AM

who can  stop the sand transportation ?

సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నది. జిల్లాకు సాగు, తాగునీటిని అందించే వరప్రదాయిని. అంతేకాదు.. ఇటీవల కాలంలో ఒళ్లంతా గుళ్ల చేసుకొని అక్రమార్కులకు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. అధికారం ‘చేతి’లో పెట్టుకొని.. అధికారులను కనుసైగలతో శాసిస్తూ నదీ పరీవాహక ప్రాంతాల్లోని చోటామోటా నాయకులు సైతం ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. ముఖ్య నాయకుల అండదండలతో వీరి హవా కొనసాగుతోంది. ఇక వీఆర్వో నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తృణమోపణమో  ముడుతుండటంతో వారు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. వివిధ స్థాయిల్లో నెల మామూళ్లే కోటి రూపాయలకు పైమాటే కావడం అక్రమ రవాణా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, నాయకులు కూడా తుంగభద్రపై పెత్తనం చెలాయిస్తున్నారు.

ఎక్కడ.. ఎవరు అడ్డొచ్చినా అంతమొందించేందుకూ వెనుకాడకపోవడం ఆందోళన కలిగించే విషయం. సీమ ముఖద్వారమైన కర్నూలు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నా నోరు మెదిపేందుకు ఎవరూ సాహసించకపోవడం గమనార్హం. అక్రమార్కులు పక్కా ప్రణాళికతో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. వ్యాపారం ఉన్నా.. లేకపోయినా ముందుగానే ఇసుకను తోడి నిల్వ చేసుకుంటున్నారు. ప్రధానంగా పంచలింగాల, గొందిపర్ల, దేవమడ, ఇ.తాండ్రపాడు, నిడ్జూరు, పుల్లూరు, కలుగొట్ల, నెంపాడు, మద్దూరు, కొర్రిపాడు తదితర ప్రాంతాల్లో ఈ తరహా వ్యవహారం సాగుతోంది. నిల్వ చేసుకున్న ఇసుకను చీకటి వేళ 12 టైర్ల లారీల్లో నింపి హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. రోజూ 500 లారీలతో పాటు వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతున్నా నిలువరించలేని పరిస్థితి నెలకొంది. ఒక లారీలో ఇసుకను నింపేందుకు రూ.36వేలు చెల్లిస్తుండగా.. 100 టన్నుల ఇసుకను హైదరాబాద్‌లో రూ.1.20 లక్షలకు విక్రయిస్తున్నారు.

ఇక ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్ల ఎస్‌ఐలకు నెలకు రూ.లక్ష, కానిస్టేబుళ్లకు రూ.50వేల చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. వీఆర్వో విషయానికొస్తే లారీ రోడ్డెక్కితే రూ.2వేలు ముట్టజెబుతున్నారు. అలా ఎన్ని లారీలు వెళితే అంత డబ్బు ఇవ్వాల్సిందే. అక్రమ రవాణా చేస్తున్న లారీల యజమానులంతా కలసి రెవెన్యూ, పోలీసు, మైన్స్, అధికార పార్టీ నాయకులకు ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా ‘మామూళ్లు’ ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నెల మామూళ్లు అందకపోతే.. కేసులు బనాయించి హడావుడి చేయడం పరిపాటిగా మారింది. రోజూ ఎన్ని లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రజాప్రతిధులకు చెందిన రెండు సుమోలు నిత్యం పర్యవేక్షిస్తుండటం ఈ దంత ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. ఇటీవల కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి సంయుక్తంగా దాడులు నిర్వహించి హద్దు మీరితే ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం అధికారులంటే వారికి ఏమాత్రం భయం ఉందో అద్దం పడుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement