అడిగేవారే లేరు | Sakshi
Sakshi News home page

అడిగేవారే లేరు

Published Wed, Jun 25 2014 2:28 AM

అడిగేవారే లేరు

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ
పూర్తి స్థాయిలో టెక్నో, ఈ టెక్నో పేర్లను తొలగించని ైవె నం
ప్రభుత్వ ఆదేశాలు...నిబంధనలు బుట్టదాఖలు
చేష్టలుడిగిన విద్యాశాఖ  

 
 ‘‘మా పిల్లాడిని ఓ ప్రైవేటు స్కూల్లో ఎల్‌కేజీలో చేర్పించేందుకు ఓ కార్పొరేట్ స్కూలుకు వెళ్లా. ట్యూషన్ ఫీజు 15వేలు అడిగారు. ఫీజుతో చదువు పూర్తయ్యే పరిస్థితి లేదు. యూనిఫాం..బుక్స్, బూట్లు...బస్సుకు కలిపితే  మళ్లీ అంతవుతుంది. అసలు ఫీజుతో పాటు కొసరు ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. పిల్లాడు బాగా చదువుతాడని ఇక్కడ చదివించాలనుకుంటే ఏడాదికి అయ్యే ఖర్చును చూస్తే భయమేస్తోంది. ప్రైవేటు చదువులు ఇలాగే ఉంటాయేమో!’’    -సగటు మనిషి ఆవేదన
 
‘‘ఎంత ప్రైవేటు పాఠశాలలైనా వాటికీ కొన్ని హద్దులుం టాయి. ఆ ఫీజులకూ ఒక పరిమితి ఉంటుంది. పదో తరగతికి 35వేల రూపాయల ఫీజు చెల్లించాల్సి వస్తోంది. పైన మరో 15-20 వేల రూపాయలు భరించాలి. స్కూల్లో పిల్లోడికి అయ్యే ఖర్చు మా పక్కింట్లో ఇంజనీరింగ్ పిల్లోడి చదువు ఖర్చుకు దాదాపు సమానంగా ఉంటోంది. పుస్తకాలకు రూ.4,800 తీసుకున్నారు. బయట కొంటే అన్నీ 2,500 రూపాయలే అవుతున్నాయి. కానీ తప్పదు. వాళ్లవద్దే కొనాలట! ఫీజులతో పాటు మరీ ఇలాంటి దోపిడీ అయితే ఎలా! విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు.’’ -పదో తరగతి విద్యార్థి తండ్రి.
 

జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డులేకుండా పోయింది. కాన్సెప్ట్, ఐఐటీ, టెక్నో, ఈ-టెక్నో, స్మార్ట్‌టెక్నో, టాలెంట్, ఒలంపియాడ్, సీబీఎస్...తదితర పేర్లు బోర్డులపై నుంచి ప్రభుత్వం తొల గించగలిగింది. కానీ ఫీజులపై నియంత్రణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే సగటు మనిషి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ చోద్యం చూస్తోంది. దీంతో ప్రభుత్వం రూపొందించిన ఫీజుల నియంత్రణ జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయి.

ఇవీ నిబంధనలు:

ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం 2008లో జీవో నంబర్ 90,91,92లను జారీ చేసింది. వీటి ప్రకారం...పదో తరగతి విద్యార్థికి కార్పొరేషన్‌లో 15వేలు, మునిసిపాలిటీలో 12వేలు, మిగిలిన ప్రాంతాల్లో అయితే 10వేల రూపాయల లోపు మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి ఒక్క రూపాయి వసూలు చేయకూడదు. కానీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడా ఇది అమలు కావడం లేదు.

ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు ? ఎంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు? పాఠశాలలకు ఉన్న ప్రత్యేకతలేంటి? తదితర అన్ని అంశాలను తల్లిదండ్రుల సౌకర్యార్థం బోర్డులో ప్రదర్శించాలి. వసూలు చేస్తున్న ఫీజు మొత్తానికి రశీదు ఇవ్వాలి. ప్రైవేటు ఫీజుల నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో డీఈవో, రాజీవ్ విద్యామిషన్ పీవో, అకడమిక్ మానిటరింగ్ అధికారి, మరో అధికారి సభ్యులుగా ఉంటారు. వీరు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి వాటి స్థితిగతులను నిశితంగా పరిశీలించి ఆపై ఏయే పాఠశాలలు ఎంత ఫీజు వసూలు చేసుకోవచ్చో నిర్ధారించాలి. తర్వాత కూడా ఈ కమిటీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టి పర్యవేక్షిస్తుండాలి.

ప్రతిపాదనల అమలేదీ?

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై అధ్యయనం చేయడానికి ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. పాఠశాలల్లో మౌళిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలలను మూడు కేటగిరీలుగా విభజించింది. గరిష్టంగా ఫీజు 30వేలు ఉండవచ్చని ఆ కమిటీ సిఫార్సు చేసింది. కానీ కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో ఈ సిఫార్సులకు బ్రేక్ పడింది. దీంతో పాత ఫీజు నిబంధనే అమల్లో ఉంది. చాలా స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.
 జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో 2.5-3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో కలిపి ఏటా 25 వేల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందుతున్నారు. అనధికారికంగా నడుస్తున్న పాఠశాలల్లోనూ వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వీరి నుంచి ఫీజుల రూపంలో  ఏటా ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో లెక్కలేకుండా పోయింది.

ఎంత ఘోరం :

తిరుపతిలోని ఓ  కార్పొరేట్ పాఠశాలలో ఎల్‌కేజీ విద్యార్థికి ట్యూషన్ ఫీజు *15వేలు తీసుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థికి 35 వేలు తీసుకుంటున్నారు.చిత్తూరు, తిరుపతిలో సెంట్రల్ సిలబస్‌ను బోధించే కొ న్ని బడా పాఠశాలల్లో దిమ్మతిరిగే ఫీజులు వసూలు చేస్తున్నారు. బస్సుకు అదనంగా చెల్లించాల్సిందే!ఆర్భాటంగా ప్రచారం సాగిస్తున్న ఈ పాఠశాలలు, సౌకర్యాల కల్పనను మాత్రం పట్టించుకోవు. సిలబస్, ఫ్యాకల్టీ విషయంలోనూ పెద్ద వ్యత్యాసం ఉండడం లేదు.కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. ట్యూషన్ ఫీజు రూపంలో కొంత, అడ్మిషన్ ఫీజు పేరుతో కొంత వసూలు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, బ్యాగు, క్యారేజీ, బూట్లు, సాక్సులు, ఆటో లేదా పాఠశాల బస్సు తదితర అవసరాలకు అదనంగా మరింత ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. పై పాఠశాలల్లో ప్రతి తరగతికి కనీసం 3-5వేల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది.
 
ఏం జరుగుతోంది?

ఫీజుల నియంత్రణకు జారీ అరుున మూడు జీవోలు ఎక్కడా అమలు కావడంలేదు.నగర పరిధిలో ఉన్న పాఠశాలల్లో గరిష్టంగా వసూలు చేయాల్సిన 15వేల ట్యూషన్ ఫీజు కంటే మూడు రెట్లు అధికంగా గుంజుతున్నారు. కొత్తగా ఎవరైనా పాఠశాలలో చేరితే 5-10వేల రూపాయల వరకూ ప్రత్యేకించి అడ్మిషన్‌ఫీజు(ప్రవేశ రుసుం) వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి రశీదు ఇచ్చినా దీనికి ట్యూషన్ ఫీజుతో సంబంధం లేదు.ట్యూషన్ ఫీజును నెలవారీగా కానీ, మూడు నెలలకోసారి కానీ చెల్లించుకోవడానికి వెసులుబాటు ఉంది.
 ప్రతీ పాఠశాలకు విద్యా సొసైటీ ఉంటుంది. దీని ఆధ్వర్యంలోనే  పాఠశాల నిర్వహణ, ఫీజుల వసూళ్లు, లెక్కలు రాయడం, ఆడిట్ చేయించడం, మినిట్స్ నమోదు తదితర కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. పాఠశాలలు నిర్వహించేవారు, విద్యా సొసైటీలో కార్యవర్గ సభ్యులు ఒకరే కావడం వల్ల సర్దుబాట్లుకు ఆస్కారం ఉంటుంది. ఎంత ఫీజు వసూలు చేసినా రికార్డుల్లో మాత్రం తక్కువ మొత్తాన్ని చూపిస్తుంటారు. ఆడిట్ అభ్యంతరాల నుంచి సులువుగా బయటపడుతుంటారు.

 విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసినట్లుగా చెబుతున్నా.. ఫీజుల దోపిడీని నివారించలేకపోతున్నారు.
 అధిక ఫీజులపై ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లా విద్యాశాఖ ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. తల్లిదండ్రులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. ప్రైవేటు ఫీజుల దందాపై ఇంత వరకూ ఏ పాఠశాలపైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
 
జూన్’...ఇది ఓ ‘చదివింపుల’ మాసం..!

జూన్ వచ్చిందంటే చాలు తల్లిదండ్రుల్లో దడ...విద్యార్థులకు ఫీజులు, దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, తదితర అన్నిటి కోసం భారీగా ఖర్చు చేయాలి. ప్రస్తుతం పుస్తకాలు ఫీజులు తదితర ఖర్చులన్నీ కలిపితే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి(ఎల్‌కేజీ-10) సగటున 30 వేల రూపాయల ఖర్చవుతుంది. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు 875 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దుస్తులు, నోట్ పుస్తకాలు తదితర ఖర్చులకు ఒక్కొక్కరికి 5-7వేల రూపాయల ఖర్చు యినా జిల్లాలోని 2.43లక్షల మందికి మరో 15 కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుంది. అంటే జూన్‌లో చదువుల కోసం తల్లిదండ్రులపై 890 కోట్ల రూపాయల భారం పడనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement