నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో? | Sakshi
Sakshi News home page

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో?

Published Fri, Mar 7 2014 3:57 AM

Who is nellore M.P TDP leader?

 సాక్షి, నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి పేరు ఖాయమైందన్న తరుణంలో తాజాగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు  తెరపైకి వచ్చింది. ఈ విషయం బుధవారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి త్వరలోనే టీడీపీలో చేరనున్నారని, ఈ మేరకు బాబుతో చర్చలు ముగిశాయని సమాచారం. మాగుంటకు  అంతరంగికులైన గోపాల్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డి గత ఆదివారం టీడీపీ అధినేతను కలిసి శ్రీనివాసులురెడ్డి పార్టీలో చేరే విషయమై చర్చించినట్లు తెలిసింది. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి చెన్నైలో మాగుంటతో  మంతనాలు సాగించినట్లు సమాచారం. ప్రైవేటు సర్వే  చేయించుకున్న శ్రీనివాసులురెడ్డి ఒంగోలు కంటే నెల్లూరు స్థానమే అనుకూలంగా ఉన్నట్లు తెలియడంతో తనకు ఇదే కేటాయించాలని కోరుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాబుతో మాగుంట
 
 శ్రీనివాసులురెడ్డికి బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. మాగుంట బలంగా పట్టుబడితే ఆయనకు టికెట్ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే జరిగితే ఆదాల పరిస్థితి ఏంటో అనేది చర్చనీయాంశంగా మారింది. ధనబలంతో పార్టీని బలోపేతం చేయాలనే టీడీపీ అధినేత ఉద్దేశ్యాన్ని గమనిస్తే ఆదాల కంటే, ధన, ప్రజాబలం ఉన్న మాగుంటకే ప్రాధాన్యం ఉంటుందని తేటతెల్లమౌతోంది. ఈ క్రమంలో ఆదాలను నెల్లూరు రూరల్ స్థానానికి  పరిమితం చేసే పరిస్థితి ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు  అన్నీ మాట్లాడుకొనే ఆదాల పార్టీలో చేరినట్లు సమాచారం.
 
 పార్టీ కష్టకాలంలో పార్టీలో చేరడమే కాక మరో ఎమ్మెల్యే శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డిని సైతం పార్టీలో చేర్పించాడు ఆదాల. టీడీపీ ముఖ్యనేత కంభంపాటి రామమోహన్‌రావు అండదండలు ఆదాలకు బలంగా ఉన్నాయి. తాను ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో  నెల్లూరు ఎంపీ స్థానం ఆదాలకా? మాగుంటకా ? అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వం టీడీపీ నుంచి ఎవరికి లభిస్తోందో వేచిచూడాల్సిందే.
 
 రూరల్ సీటు కోసం ఆనం ఫీట్లు:
 ఆధిపత్యం కోసం తహతహలాడే ఆనం మార్కు రాజకీయంతో రూరల్ నియోజక వర్గానికి కొత్తతరం నాయకుడిగా ఆనం వివేకా కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా రంగంలో దించుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొడుకును ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలపాలని ఆనం నిర్ణయించుకున్నా, ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిపేందుకు వివేకా సాహసించే పరిస్థితి లేదు.
 
 ఈ క్రమంలో రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కుమారుడిని నిలబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీలోని ఓ శాఖ ఇప్పటికే చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ను వీడకుండా తమ  సోదరుడితో పాటు కుమారుడు ఏసీ సుబ్బారెడ్డిని టీడీపీ చేర్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు నెల్లూరులో ప్రచారం జరుగుతోంది.  
 

Advertisement
Advertisement