అమిత్ షా అంటే చంద్రబాబుకు భయమా? | Sakshi
Sakshi News home page

అమిత్ షా అంటే చంద్రబాబుకు భయమా?

Published Wed, May 24 2017 10:07 PM

అమిత్ షా అంటే చంద్రబాబుకు భయమా? - Sakshi

హైదరాబాద్ : ఉరిమురిమి మంగళం మీద పడినట్టు... తెలంగాణలో అమిత్ షా జరిపిన పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసిందట. అమిత్ షా తెలంగాణలో జరిపిన మూడు రోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తెలంగాణ మాకు బాద్ షా అంటూ కేసీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై విరుచుకుపడ్డారు. 
 
తెలంగాణలో మూడు రోజుల పర్యటన సందర్భంగా అమిత్ షా పలు చోట్ల మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన ఆర్థిక సహాయాన్ని, అందిస్తున్న పథకాలను వివరిస్తూ వాటిని అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చేసిన విమర్శలు కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించడానికి కారణమయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ - బీజేపీల మధ్య పరస్పర రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా... సరిగ్గా ఏడాది కిందట ఇలాంటి సందర్భమే ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేకపోయారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
తెలంగాణతో విడిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా నష్టపోయిందన్న విషయం అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. కనీసం రాజధాని కూడా లేకుండా ఆర్థికంగా కూడా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం విభజన చట్టంలోనే అనేక హామీలు ఇచ్చారు. అయితే మూడేళ్లలో డజనుకుపైగా సందర్భాల్లో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఎన్నో సహాయాలను కేంద్రం నుంచి సాధించలేకపోయారన్న విమర్శ ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతీ యువకులకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక హోదా కల్పన, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌లాంటి వాటి విషయంలో కేంద్రంలోని మిత్రపక్షమైన బీజేపీ నుంచి సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్న అపవాదు ఉంది. 
 
అమిత్ షా ప్రస్తుతం తెలంగాణలో జరిపినట్టుగానే ఏడాది కిందట ఆంధ్రప్రదేశ్ లోనూ పర్యటించారు. దక్షిణాదిన పార్టీని విస్తరించే కార్యక్రమంలో ఆయన పర్యటనలు కొనసాగుతుండగా, 2016 మార్చి 6వ తేదీన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కోసం తమ ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేసిందన్న విషయాలను చెప్పాలంటే చాంతాడంత జాబితా ఉందని, ఒక్కొక్కటి అన్నింటినీ వివరించాలంటే వారం రోజులు పట్టొచ్చని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రెండేళ్ల కాలంలోనే వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం 1.40 లక్షల కోట్ల రూపాయల మేరకు సహాయం అందించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి 65,000 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు 22,000 కోట్లు, విజయనగరంలో నావెల్ ఎయిర్ స్టేషన్ కు 3,650 కోట్లు, మిసైల్ తయారీ యూనిట్ కోసం 3,266 కోట్లు, క్రిబ్ కో ఫెర్టిలైజర్ ప్లాంట్ కోసం 3,000 కోట్లు, ఇన్ లాండ్ వాటర్ వేస్ కోసం 1500 కోట్లు మంజూరు చేసిందంటూ కొన్ని కీలకమైన అంశాలను వివరించారు.
 
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.93 లక్షల ఇళ్ల మంజూరు చేయడంతో పాటు ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ (ఏఐఐఎంఎస్) వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2019 నాటికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ను ఎన్నుకున్న విషయాన్ని కూడా అమిత్ షా వెల్లడించారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టినట్టు తెలిపారు. గడిచిన 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిందానికన్నా ఎక్కువగా ఈ రెండేళ్లలో బీజేపీ చేసిందంటూ పెద్ద జాబితానే చదివారు.
 
అమిత్ షా ఆరోజు మాట్లాడిన అంశాలపై టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ ఆయన పార్టీ నేతలుగానీ, మంత్రులుగానీ కిమ్మనలేదు. తెలంగాణకన్నా రెండింతలుగా ఆంధ్రప్రదేశ్ కు సహాయం అందించిన విషయాన్ని అమిత్ షా ఆనాడే చెప్పగా, ఏపీకి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంగానీ, రాష్ట్రం విడిపోయినప్పుడు ఏర్పడిన రెవెన్యూ లోటు (రెవెన్యూ లోటును పూడ్చాలని పునర్విభజన చట్టంలో ఉంది) భర్తీ చేయని అంశాల వంటి వేటినీ చంద్రబాబు ప్రస్తావించలేదు. కనీసం అమిత్ షా చెప్పిన వివరాలపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన స్పందించలేదు.
 
తెలంగాణ పర్యటనలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించడంతో ఏడాది కిందట ఏపీలో పర్యటించినప్పుడు చంద్రబాబు స్పందించకపోవడానికి కారణమేంటన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు విభజన చట్టంలోని హామీలతో పాటు మరింత ఎక్కువగా సహాయం తీసుకోవలసింది హామీలను కూడా సాధించుకోలేని స్థితిలో ఉండటంపై సొంత పార్టీ నేతలు చంద్రబాబుపై లోలోన మండిపడుతున్నారు. 
 
మాకు రాష్ట్రం ముఖ్యం... అమిత్ షా, భ్రమిత్ షాలు కాదంటూ కేసీఆర్ ఘాటుగా స్పందించడం, అదే తరహాలో ఏపీకి ఏకంగా 1.40 లక్షల కోట్ల మేరకు ఏపీకి సహాయం చేసినట్టు అమిత్ షా చెప్పినప్పుడు చంద్రబాబు నోరు విప్పకపోవడం వెనుక అనేక కారణాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కేసుల భయం వెంటాడుతున్న కారణంగానే చంద్రబాబు కేంద్రంపైన గానీ అమిత్ షాపైన గానీ స్పందించలేకపోతున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. కనీసం పార్టీ పరంగా కూడా విమర్శలు చేయలేని బలహీనమైన స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

Advertisement
Advertisement