విలువేదీ ? | Sakshi
Sakshi News home page

విలువేదీ ?

Published Sun, Nov 24 2013 6:48 AM

why not supply ration rice to gundalapaya asked balineni

ఒంగోలు, న్యూస్‌లైన్:  సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఇచ్చిన అర్జీలకు అధికారులు విలువివ్వడం లేదని, ప్రభుత్వ పథకాలను ప్రజలకందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీఎల్‌పీ విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఒంగోలు రూరల్ మండలం రచ్చబండ కార్యక్రమాన్ని స్థానిక మినీ స్టేడియం ఎదురుగా ఉన్న సీతారామ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రేషన్‌కార్డులు కేవలం రెండు గ్రామాలకే పరిమితం చేయడమేమిటని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్ కొన్ని గ్రామాల పేర్లు చదివి వినిపించారు. అయితే ఆ గ్రామాలు ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోనివి కావడంతో బాలినేని ఆగ్రహించారు. ఒంగోలు రూరల్ మండలంలో ఏ గ్రామాలున్నాయో.. నగర పాలక సంస్థ పరిధిలో ఏవి ఉన్నాయో కూడా తెలియదా అని ప్రశ్నించారు.

 ‘రచ్చబండ-1,2ల్లో వచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులైన వారి జాబితా అంటున్నారు.. ఎంత వరకు నిజం.. అసలు అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ఇవ్వండి.. ఆ అర్జీలు తెప్పించండి..’ అని బాలినేని నిలదీయడంతో అధికారులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ‘అసలు అర్జీలు ఎక్కడున్నాయో మీకు తెలిస్తే కదా.. ఎక్కడో ఒక చోట కూర్చొని మీ ఇష్టం వచ్చినవారి పేర్లు చేర్పిస్తే సరిపోతుందా.. ఈ మాత్రం దానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడమెందుకు’ అని బాలినేని మండిపడ్డారు.  జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో సంబంధిత మొత్తాన్ని అందజేస్తేనే ఆ కుటుంబానికి ప్రయోజనం ఉంటుందని అన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల సమస్య ఇంకా రైతులను పీడిస్తూనే ఉందన్నారు. ఇప్పటికీ తన నియోజకవర్గ పరిధిలోనే 400 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం
 తిరుగుతున్నారని వెంటనే స్పెషల్ డ్రైవ్ ద్వారా పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూచించారు.  
 వర్ష బాధితులకు పరిహారమేదీ..
 భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పరిహారంగా ఇవ్వాల్సిన బియ్యం, కిరోసిన్ సక్రమంగా పంపిణీ చేయలేదని బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలు మండలం గుండాయపాలెం మత్స్యకార గ్రామంలో ఇప్పటి వరకు బియ్యం ఎందుకు పంపిణీ చేయలేకపోయారో సమాధానం చెప్పాలని అధికారులను నిలదీశారు. తుపాను పోయి 25 రోజులవుతున్నా.. ఇంకా మత్స్యకారులకు బియ్యం పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులెవరో గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 సరైన సమాచారం ఇవ్వకనే జాప్యం: కలెక్టర్
 అధికారులు సరైన సమాచారం ఇవ్వడంలో జాప్యం వల్ల నేటికీ బియ్యం పంపిణీ చేయలేకపోయారని, వెంటనే విచారణ జరిపి అర్హులైన బాధితులందరికీ తప్పక న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ విజయకుమార్ హామీ ఇచ్చారు. గుండాయపాలెంలో మత్స్యకారులకు తక్షణమే బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. బంగారుతల్లి పథకం సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన డబ్బులు అందుతాయనుకుంటే పొరబాటని, ప్రభుత్వం నిర్దేశించినట్లు తొలుత అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చడం, ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ వరకు క్రమం తప్పకుండా చదువుతూ ఉంటేనే చివర్లో ఆడపిల్లకు 20 ఏళ్లు వచ్చే సరికి * 1.55 లక్షలు నేరుగా అందుతాయన్నారు. అంతేకాని ఒకేసారి మొత్తం రాదని గుర్తుంచుకోవాలన్నారు.

 దాదాపు వంద శాతం ఆధార్ నమోదు పూర్తయిందని, ఇంకా మిగిలి ఉన్న కొద్దిమంది కోసం పాత తాలూకా కేంద్రాలైన పది సెంటర్లలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వాటిలో ఆధార్ తీయించుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న 5 లక్షల కార్డులు త్వరలోనే జిల్లాకు వస్తాయన్నారు. అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు డిసెంబర్ మొదటి వారంలో ‘వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.   
 సమైక్య ఉద్యమం వల్లే రచ్చబండలో జాప్యం: ఎంపీ మాగుంట
 రచ్చబండ-3 కార్యక్రమం ముందుగానే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సమైక్య ఉద్యమం వల్ల జాప్యం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందేనని, అధికారులు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తప్పక కార్డులు అందిస్తామని చెప్పారు.
 మిన్నంటిన సమైక్య నినాదాలు
 తొలుత రచ్చబండ వేదిక వద్దకు బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకోగానే పలువురు సమైక్యవాదులు ఆయనకు స్వాగతం పలికారు. వాసన్నకు జై అంటూ నినాదాలు చేస్తుండగానే..రచ్చబండ కార్యక్రమంలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెడతామని బాలినేని వారికి హామీ ఇచ్చారు. మాగుంట, బాలినేనిలు వేదికమీద ఆసీనులు కాగానే వారితో పాటు కొందరు కాంగ్రెస్ నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులు వేదిక మీద కూర్చున్నారు. దీంతో చాలా మంది అధికారులు కిందే కూర్చొని సభను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు తప్ప మిగిలిన వారు వేదిక దిగాలని ఒంగోలు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు కోరడంతో నాయకులు వేదిక దిగారు.

 ఆ సమయంలో వైఎస్సార్ సీపీ నాయకులు మరోమారు సమైక్యాంధ్రకు జై అంటూ నినదించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బలవంతంగా బయటకు పంపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్ తదితరులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.  ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ హైదరాబాదు లేని ఆంధ్రప్రదేశ్‌ను ఊహించుకోలేమని, హైదరాబాద్‌ను తెలంగాణకు ఇస్తామంటే సహించేదే లేదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రచ్చబండలో తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రాయపాటి జగదీష్ ‘సమైక్యాంధ్ర వర్ధిల్లాలి..సమైక్యాంధ్ర ప్రకటనను తీర్మానించాలి’ అంటూ వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

పోలీసులు ఆయన్ను బలవంతంగా బయటకు పంపారు. ఈ తరుణంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా సమైక్యాంధ్రకు జై కొట్టారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు వస్తే తప్పకుండా వ్యతిరేకంగా ఓటు వేస్తానని ప్రకటించారు.  దీంతో మరోమారు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర కన్వీనర్ కావూరి సుశీల తదితరులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్లకార్డులతో సమైక్యాంధ్రకు జై....వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జై అంటూ నినదించారు. పోలీసులు వారిని బయటకు పంపించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపాలని ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు.

 కార్యక్రమానికి ముందుగా డ్వామా పీడీ పోలప్ప, ఒంగోలు మండల తహసీల్దారు మూడమంచు వెంకటేశ్వర్లు, ఒంగోలు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ డీఈ లక్ష్మీనారాయణ తదితరులు రచ్చబండ-3లో ప్రజలకు తమ శాఖ ఎటువంటి ప్రయోజనాలు కల్పిస్తుందీ వివరించారు.  కార్యక్రమంలో రచ్చబండ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, శేషగిరిరావు, పోకూరు అంజమ్మ , పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్, ఒంగోలు సూపర్‌బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement