నేనెందుకు సమాధానం చెప్పాలి? | Sakshi
Sakshi News home page

నేనెందుకు సమాధానం చెప్పాలి?

Published Thu, Jun 11 2015 5:21 AM

బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - Sakshi

- మీడియాపై బాబు ఆగ్రహం
- ఎవరైతే కట్ అండ్ పేస్ట్ చేశారో... టేపులిచ్చాడో వాడినే అడగండి
- ప్రధాని ఢిల్లీలో ఉన్నాడని ఢిల్లీ ఏసీబీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తుందా?
- సెక్షన్-8 గవర్నర్ అమలు చేయలేకపోయారు.. వెంటనే అమలు చేయించాలని రాష్ట్రపతి, ప్రధానిని కోరాం
- మా ఫోన్లు ట్యాప్ చేయడం దారుణం, దుర్మార్గం, అనైతికం
 
సాక్షి, న్యూఢిల్లీ:
మీరు ప్రశ్నలేస్తే నేను సమాధానం చెప్పాలా? చీఫ్ మినిస్టర్‌ను అడిగే విధానమా ఇది? ఎవరైతే కట్ అండ్ పేస్ట్ చేశారో.. ఎవరైతే కట్టుకథ అల్లారో.. వాళ్లు సమాధానం చెప్పాలి... నేనెందుకు చెబుతాను? టేపులు ఎవడిచ్చాడో వాడిని అడుగు... ఏ టీవీ ఇచ్చిందో వాడిని అడుగంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాపై ఆగ్రహం ప్రదర్శించారు. రేవంత్‌రెడ్డి, ఆడియో టేపుల వ్యవహారాలపై ప్రశ్నలడిగిన మీడియాకు సూటిగా స్పందించకుండా సమాధానం దాటవేశారు.

నేను తెలంగాణ పౌరుడిని కాను, ఏపీ ముఖ్యమంత్రిని... ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడని ఢిల్లీ ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తుందా? అంటూ ప్రశ్నించారు. ఆయన బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడిని కలిసిన అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ఆర్థిక, హోం మంత్రులను కలిశాను. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశాను. ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలుచేస్తూ గవర్నర్‌కు శాంతిభద్రలు అప్పగించాలని, చట్టవ్యతిరేకమైన ట్యాపింగ్‌పై దర్యాప్తు చేయాలని కోరాను.

రాష్ట్రవిభజన జరిగి జూన్ 2 నాటికి ఏడాది పూర్తయింది. విభజన చట్టంలోని కొన్ని హామీలు ఇంకా నెరవేరలేదు. రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగలేదు. షెడ్యూలు 9, 10 అమలు కాలేదు. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్‌కు ఉండాలి. ఇందులో కొన్ని అమలయ్యాయి. ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఏపీని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా పోటీపడే బలాన్ని ఇవ్వాలని ఈరోజు నేను ప్రధానిని, అందరినీ కోరుతున్నాను. సెక్షన్-8ను ట్రూ స్పిరిట్‌తో అమలుచేయాల్సిన అవసరం ఉంది. కానీ గడిచిన ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించింది. రెండు రాష్ట్రాల మధ్య కావాలని విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు’’ అని వివరించారు.

బలం లేకున్నా.. ఐదుగురిని పెట్టారు
తమ ఫోన్లు ట్యాప్ చేయడం దారుణం, దుర్మార్గం, అనైతికమని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బలం లేకున్నా ఐదో సీటుకు నిలబెట్టారు. ఒకరోజు ముందుగా మా ఎమ్మెల్యేను లాక్కున్నారు. ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఏసీబీ చేసిందని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఏసీబీ చేసే సీల్డ్ కవర్‌లో కోర్టుకు ఇవ్వాల్సింది కాదా? మరి ముఖ్యమంత్రి ఎలా లీక్ చేశారు? మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు.

తెలంగాణ సంబురాల చివరి క్షణంలో ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా టీ న్యూస్‌లో ప్రసారం చేశారు. మరుసటి రోజు జరిగే మా వేడుకను అడ్డుకోవాలనే కుట్రలో ఇది చేశారు. ఇది చాలా బాధాకరం.  ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం. వీటిపై దర్యాప్తు చేయాలని ప్రధాని, హోం మంత్రిని కోరాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా... గవర్నర్ సెక్షన్-8ను అమలుచేయలేకపోతున్నారు. ఇది బాధాకరం. దీన్ని అమలుచేయాలని కోరాం’’ అని బాబు చెప్పారు.
 
మీడియా ప్రశ్నలు.. చంద్రబాబు జవాబులు
ప్రశ్న: ప్రధానిని ఏం అడిగారు? ఏదైనా హామీ లభించిందా?
బాబు: సెక్షన్-8 అమలుచేయాలని అడిగాం. చట్టవ్యతిరేకంగా ట్యాపింగ్ చేయడం, చట్టవ్యతిరేక పరికరాలు ఉపయోగించడంపై దర్యాప్తు చేయాలని అడిగాం.

ప్రశ్న: సెక్షన్ 8 అమలు కాకపోవడం ఎవరి వైఫల్యం? దీనిపై కేంద్రం నుంచి హామీ లభించిందా?
బాబు: టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది వైఫల్యం. చట్టంలో స్పష్టంగా ఉన్నా ఉల్లంఘించింది. ఇష్టానుసారంగా ప్రవర్తించి బురదజల్లుతోంది. కేంద్రం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నా.

ప్రశ్న: రేవంత్‌రెడ్డి వ్యవహారంపై మీరేమంటారు? సపోర్ట్ చేస్తున్నారా?
బాబు: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల సంఘం పరిధిలో పనిచేయాలి. ప్రభుత్వానికి అధికారం ఉందని ప్రతిపక్ష నేతలను వేధిస్తే ఎలా? అది ఎన్నికల నేరం. దానిని ఎన్నికల కమిషన్ చూడాలి. రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని నేను సపోర్ట్ చేసినా, వ్యతిరేకించినా అప్రస్తుతం. తెలంగాణ పార్టీ వేరే.

ప్రశ్న: మీరు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడారా? లేదా?
బాబు: (కోపంగా).. ఎవరు చెప్పాలి ఇది.. మీరా నేనా.. ఎవడిచ్చాడో వాడిని అడుగు. ఏ టీవీ ఇచ్చిందో వాడిని అడుగు. నువ్ రేపొకటి వేసి అడిగితే నేను ఆన్సర్ చేయాలా? సీఎంను అడిగే విధానమా ఇది... నీ ఇష్టప్రకారం చేసుకుంటే నేను జవాబు ఇవ్వాలా?

ప్రశ్న: మీ గొంతు కాదని ఎందుకు చెప్పడం లేదు?
బాబు: నాకేం అవసరం. ఒక్క ఎమ్మెల్సీతో నాకు ప్రభుత్వం వస్తుందా? పోతుందా? ఇదంతా బురదజల్లుడే. ఎన్ని ఫోన్లు ట్యాప్ చేశారన్న విషయం రేపు అన్నీ బయటకు వస్తాయి.
ప్రశ్న: తెలంగాణలో పౌరుడైనందునే మీపై కేసు పెట్టొచ్చు అని వాళ్లంటున్నారు.
బాబు: నేను పౌరుడిని కాను, ఏపీ ముఖ్యమంత్రిని. తెలంగాణ ప్రభుత్వ సర్వెంటును కాదు. ప్రధాన మంత్రి ఢిల్లీలో ఉన్నాడని ఢిల్లీ ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తుందా? నా పరిధిలోకి రావడానికి నువ్వు ఎవడు?

Advertisement
Advertisement