ఇంటి పన్నులకు..పింఛన్‌ డబ్బు | Sakshi
Sakshi News home page

ఇంటి పన్నులకు..పింఛన్‌ డబ్బు

Published Tue, Apr 3 2018 11:15 AM

Widow Pensions Collecting For House Tax - Sakshi

చీమకుర్తి రూరల్‌:  వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు చెల్లించాల్సిన పింఛన్ల డబ్బును గ్రామ కార్యదర్శులు ఇంటి పన్నులకు జమ చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చండ్రపాడు గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీ సందర్భంగా బకాయిలున్న ఇంటి పన్నుల కింద పింఛన్‌ సొమ్ము ను జమ చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన తండ్రి వల్లంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చిన వెయ్యి రూపాయల పింఛ న్‌లో ఇంటి పన్ను కింద రూ.250 జమ చేసుకున్నారని అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామంలో మరో వృద్ధురాలికి ఇల్లు కూడా లేదు. బంధువుల ఇళ్ల వద్ద కాలం వెళ్లదీస్తోంది. ఆ వృద్ధురాలికి వచ్చిన పింఛను డబ్బును బంధువులు చెల్లించాల్సిన ఇంటిపన్ను కింద కార్యదర్శి జమ చేసుకున్నారు. అదేమని అడిగితే ఇంటిపన్ను చెల్లించాల్సిన వాళ్లు మీకు బంధువులే కాబట్టి వారి దగ్గర వసూలు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇలా ఒక్క సోమవారం  80 మందికి పింఛన్లు పంపిణీ చేస్తే వారిలో 50 మంది వద్ద నుంచి ఇంటి పన్నుల కింద ఇచ్చిన పింఛన్లను జమ చేసుకున్నారని పింఛనుదారులు వాపోతున్నారు.

ఆసరగా ఉంటుందనుకుంటే పన్ను కింద జమ
ప్రభుత్వం పంపిణీ చేసే పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరాగా ఉంటుందనుకుంటే వారి అవసరాలను గుర్తించకుండా వచ్చిన పింఛన్లను ఇంటి యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్నుల కింద జమ చేసుకోవడాన్ని పింఛనుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. పింఛన్లతో నెలంతా కాస్త ఉపశమనం పొందే వృద్ధులకు పన్నుల పేరుతో అది కూడా లేకుండా అధికారులు ముక్కుపిండి వసూలు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు వస్తున్నాయి కాబట్టే తమను కాస్త గౌరవంగా ఇంట్లో చూస్తున్నారని, వచ్చిన పింఛన్లను ఇలా జమ చేసుకోవడం ఏంటని వృద్ధులు వాపోతున్నారు. మార్చి నెలాఖరు దాటిపోయినా పింఛన్లు వసూలు చేసేందుకు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ప్రభుత్వం ఇంటి పన్ను జమ చేసేందుకు గడువు ఇచ్చింది. దానిలో భాగంగా గ్రామాల్లో ఇంటి పన్ను టార్గెట్‌ వంద శాతం చేసేందుకు గాను కార్యదర్శులు గ్రామాల్లో పింఛన్లు జమ చేసుకుంటున్నారు.

నచ్చజెప్పే తీసుకుంటున్నాం
ఇంటి పన్నుల బకాయిలున్నాయని, పింఛన్ల డబ్బును జమ చేయమని నచ్చజెప్పిన తర్వాతే పింఛన్ల డబ్బును ఇంటిపన్ను కింద వసూలు చేసుకుంటున్నాం. ఇంటి పన్నులను నూరు శాతం వసూలు చేయాలని అధికారుల ఆదేశాలున్నాయి. పింఛనుదారులకు వివరించి వారిని ఒప్పించిన తర్వాతే తీసుకుంటున్నాం.     – షేక్‌.జాన్‌ బాషా, కార్యదర్శి, చండ్రపాడు

Advertisement

తప్పక చదవండి

Advertisement