Sakshi News home page

భర్తే కాలయముడు

Published Tue, Dec 2 2014 12:27 AM

భర్తే కాలయముడు

 కాకినాడ క్రైం :కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. మద్యం మానివేయాలని చెప్పినందుకు భర్తే ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. ఈ సంఘటనతో ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. గర్భిణి అయిన భార్యను హతమార్చడమే కాకుండా ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు భర్త ప్రయత్నించి విఫలమయ్యాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో హత్యోదంతం వెలుగుచూసింది. సోమవారం కాకినాడలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
 తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సత్య(26)కు, కాకినాడ పర్లోపేటలోని చినమార్కెట్ ప్రాంతానికి చెందిన పొట్టి సతీష్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి మూడేళ్ల చైతన్య లహరి, రెండేళ్ల బిందు లహరి ఉండగా, సత్య ప్రస్తుతం నాలుగో నెల గర్భిణి. సముద్రంపై చేపలవేట చేస్తూ కుటుంబాన్ని పోషించే సతీష్ మద్యానికి బానిసయ్యాడు. సతీష్ కుటుంబం, అతడి తల్లి లక్ష్మి, తమ్ముడు రాజు కుటుంబం ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. మద్యం తాగి వచ్చే సతీష్ తరచూ భార్యతో తగాదా పడేవాడు. ‘ఇద్దరు ఆడపిల్లలున్నారు, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, తాగుడు మానేయండి’ అని భార్య మొత్తుకున్నా అతడు వినకుండా ఫూటుగా తాగొచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా అతడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
 
 దీంతో అతడు సత్య పీక పట్టుకుని నొక్కాడు. ఊపిరాడక ఆమె అక్కడికక్కడే మరణించింది. మద్యం మత్తు దిగిపోవడంతో భయపడిన సతీష్ ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులను, స్థానికులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. చీరను ఆమె మెడకు కట్టి, ఇంటి దూలానికి వేలాడదీశాడు. తనతో గొడవపడి ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులతో చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి ఆమె దూలానికి వేలాడుతూ కనిపించింది. ఆమె మృతదేహాన్ని కిందకు దించి, ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు.
 
 ఈ విషయాన్ని భద్రాచలంలోని తల్లికి ఫోన్‌లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ అద్దంకి శ్రీనివాసరావు, పోర్టు ఎస్సైలు పార్ధసారథి, వై. సతీష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మిం చేందుకు ప్రయత్నించాడు. మృతదేహంపై గాయాలు ఉండడం, సంఘటన స్థలంలో పరిస్థితులను పరిశీ లించి ఆమెది ఆత్మహత్య కాదని నిర్ధారించుకున్నారు. దీంతో సతీష్‌ను ఆరా తీయగా.. ఆమెను తానే హతమార్చినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇలాఉండగా చిన్నారులు తల్లి కోసం ఏడుస్తుంటే..  కుటుంబ సభ్యులు వారిని ఎత్తుకుని ఓదార్చడం స్థానికులకు కంటతడి తెప్పిం చింది. సత్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఎస్సై పార్ధసారథి  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement