కలెక్టర్ బదిలీకి పట్టు? | Sakshi
Sakshi News home page

కలెక్టర్ బదిలీకి పట్టు?

Published Thu, Feb 6 2014 1:23 AM

కలెక్టర్ బదిలీకి పట్టు? - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా కలెక్టర్ నీతూకుమారిప్రసాద్‌కు బదిలీ జరగనుందా? త్వరలో భారీ స్థాయిలో జరుగనున్నఐఏఎస్‌ల బదిలీల కోసం రూపొం దించిన  జాబితాలో జిల్లా కలెక్టర్ పేరు చోటు చేసుకుందా? అంటే అవుననే పుకార్లు.. జిల్లాలో షికారు చేస్తున్నాయి. గడచిన నాలుగైదు రోజులుగా ఈ విషయం అటు అధికార వర్గాల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను హాట్‌టాపిక్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఎన్నికల కమిషన్ ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తోన్న (ఎన్నికల విధులతో సంబంధం ఉన్న)అధికారులను, సొంత ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఆదేశించింది. ఇందుకు గడువు కూడా ఈ నెల 10 వరకు విధించింది. ఇప్పటికే పోలీసుశాఖలో ఎస్‌ఐలు, సీఐల బదిలీల ప్రక్రియ పూర్తి అయింది. ఇక రెవెన్యూ శాఖలో 57 మంది తహశీల్దార్‌ల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. 
 
 ఇంతలో రెవెన్యూశాఖలో అధికారులు సమైక్యాంధ్ర సమ్మెలోకి వెళ్లడంతో ఈ బదిలీల ప్రక్రియపై సందిగ్థత కొనసాగుతోంది. ఈ తరుణంలో ఐఏఎస్‌ల బదిలీల్లో కలెక్టర్ బదిలీ కూడా ఉందనే సమాచారం చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్‌గా నీతూకుమారి బాధ్యతలు చేపట్టి ఈనెల 24 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారమైతే కలెక్టర్‌ను కదపాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ, ఇతర కారణాలతో కలెక్టర్ బదిలీకి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. కొనసాగించేందుకు సహకరిస్తామని నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ముఖ్యనేత భరోసా ఇచ్చారని కూడా చెబుతున్నారు.
 
 ఇటీవల పశుసంవర్థక శాఖ పోస్టుల భర్తీలో తన సిఫార్సులతో పోస్టింగ్‌లు ఇచ్చిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం, బదిలీ చేసిన చోట నుంచి మరోచోటకు మార్చేసిన వ్యవహారంపై ఒక మంత్రితో కలెక్టర్‌కు విభేదాలు వచ్చాయి. ఈ విషయంలో గుర్రుగా ఉన్న మంత్రి.. బదిలీ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. ఆధార్ నమోదు, అనుసంధానం మినహా పలు శాఖల ప్రగతిని పరుగులు పెట్టించలేకపోతున్నారని, యంత్రాంగంపై పట్టు బిగించలేకపోవడం వంటి కారణాలను చూపించి బదిలీకి పట్టుబడుతున్నారని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ కె.ఎస్. శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్‌గా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియవచ్చింది. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ఆయన రాకకు కొందరు జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలియవచ్చింది. 
 
 కలెక్టర్ భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్‌పీ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. నీతూకుమారి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఏడాది తరువాత రాజేష్‌కుమార్ కమాండెంట్‌గా వచ్చారు. అంటే ఆయన ఇక్కడకు వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. ఈ నేపథ్యంలో భార్యను బదిలీ చేయాల్సి వస్తే అనివార్యంగా భర్తను కూడా (స్పౌస్‌కేసు) బదిలీ చేయాల్సి ఉంటుంది. భర్త వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. ఈ కారణాలకు తోడు జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేత మంత్రి చేస్తున్న ప్రయత్నాలపై నీళ్లు చల్లుతున్నారని, కలెక్టర్ బదిలీ కాకుండా అడ్డుపడుతున్నారని  చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బదిలీ ఉంటుందా లేదా, అనేది తేలాలంటే మరో ఐదు రోజులు వేచి చూడాల్సిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement