పార్టీల అధ్యక్షులతో ఉమ్మడి భేటీకి యత్నం | Sakshi
Sakshi News home page

పార్టీల అధ్యక్షులతో ఉమ్మడి భేటీకి యత్నం

Published Sun, Dec 1 2013 1:06 AM

పార్టీల అధ్యక్షులతో ఉమ్మడి భేటీకి యత్నం - Sakshi

సమైక్యాంధ్ర కోసం బొత్స, చంద్రబాబుతో భేటీ: అశోక్‌బాబు


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ముందుకొస్తే.. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయా పార్టీల అధ్యక్షులందరితో ఉమ్మడి సమావేశం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో చర్చకొచ్చినప్పుడు.. సభలో సమైక్యాంధ్రకు ఆయా పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఏపీఎన్జీవో సంఘ ప్రతినిధులు శనివారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. తొలుత సంఘ ప్రతినిధులతో కలిసి అశోక్‌బాబు గాంధీభవన్‌లో బొత్స, మంత్రి శైలజానాథ్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు అసెంబ్లీలో చర్చకొచ్చినప్పుడు కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా టీ-బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడతారని బొత్స హామీఇచ్చారని తెలిపారు.  పార్టీల అధ్యక్షులతో సమావేశానికి అందరూ హాజరైతే, తాను కూడా వస్తానని బొత్స హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇందుకు అధ్యక్షులందరూ అంగీకారం తెలిపితే.. రెండు, మూడ్రోజులల్లోనే భేటీకి యత్నిస్తామని అశోక్‌బాబు అన్నారు.
 బాబు పార్టీలో చర్చిస్తామన్నారు
 అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలూ టీ-బిల్లును వ్యతిరేకించేలా చూడాలని తాము చంద్రబాబును కోరగా.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన బదులిచ్చినట్టు అశోక్‌బాబు తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరఫున ప్రతినిధులను పంపుతానని బాబు హామీ ఇచ్చారని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగే సమయంలో మరోసారి ఢిల్లీ వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తామన్నారు. కాగా, అశోక్‌బాబు గాంధీభవన్‌లో మాట్లాడుతున్న సమయంలో పలువురు తెలంగాణవాదులు జై తెలంగాణ నినాదాలు వినిపించారు. ప్రతిగా ఏపీఎన్జీవో ప్రతినిధులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement