Sakshi News home page

‘మీతో మీ ఎస్పీ’కి ఫిర్యాదుల వెల్లువ

Published Sat, Jun 7 2014 3:58 AM

‘మీతో మీ ఎస్పీ’కి ఫిర్యాదుల వెల్లువ - Sakshi

కర్నూలు,  జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎస్పీ రాఘురామిరెడ్డి మీతో మీ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 33 మంది సెల్..94407 95567 నంబర్‌కు ఫోన్ చేసి ఎస్పీకి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి..పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం బెల్టు షాపు నిర్వాహకులు, క్వారీ తవ్వకాల కాంట్రాక్టర్ల నుంచి పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
     

{పేమ వివాహం చేసుకోవడంతో పెద్దలు తనను, తన భర్తను చంపడానికి ప్రయత్నిస్తున్నారని కల్లూరు మండలం దూపాడు గ్రామానికి చెందిన నాగరాణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 5న ప్రేమ వివాహం చేసుకున్నానని తెలిపారు. కర్నూలు డీఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్‌లో తమ తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారని, అయినప్పటికీ ప్రేమ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు అండగా ఉంటాని ఎస్పీ ఆమెకు భరోసా ఇచ్చారు.

 తన సెల్ నంబరుకు ఆకతాయిలు ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, సమస్యను పరిష్కరించి ఆకతాయిల నుంచి విముక్తి కల్పించాలని శిరివెళ్లకు చెందిన అక్తర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆకతాయిలను గుర్తించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

 జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊటకొండ గ్రామంలో తన పొలాన్ని బోయ రంగన్న అనే వ్యక్తి ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నాడని మనోహర్ అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని, విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీని కోరారు. ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement