Sakshi News home page

వైద్య సీట్లు పోయినట్లే!

Published Sun, Jun 29 2014 1:34 AM

Without facilities no  Medical seats

సతులు లేకుండా సీట్లివ్వలేమన్న ఎంసీఐ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో సీట్ల కోతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)ని కలిసినా ఫలితం దక్కలేదు. మంత్రితో పాటు కొందరు ఉన్నతాధికారులు తాజాగా ఎంసీఐ అధికారులను కలిసి రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో కోత విధించిన సీట్లను పునరుద్ధరించాలని, వసతుల కల్పనలో లోపాలుంటే సవరిస్తామని కోరినా పెద్దగా స్పందన లేదని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏడాది క్రితం ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చే సమయంలోనే రెన్యువల్ నాటికి పూర్తిస్థాయి వసతులు కల్పించాలని స్పష్టం చేసినట్లు ఎంసీఐ అధికారులు గుర్తు చేశారు.

కానీ ఏ కళాశాలలోనూ వసతులు గురించి పట్టించుకోలేదన్నారు. ‘ల్యాబరేటరీలు లేవు.. రక్త పరీక్షలు చేసే విధానం సరిగా లేదు.. లెక్చర్ హాళ్లు బాగా లేవు.. జూనియర్ వైద్యులకు నివాస గృహాలు కూడా లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు ఎలా ఇస్తాం?’ అని ఎంసీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎంసీఐ అధికారులు స్పందించిన తీరును బట్టి చూస్తే రాష్ట్రం కోల్పోయిన ఎంబీబీఎస్ సీట్లను ఈ ఏడాది ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
 

Advertisement
Advertisement