వారసుడు కోసం రెండో పెళ్లి.. | Sakshi
Sakshi News home page

వారసుడు కోసం రెండో పెళ్లి..

Published Sun, Jul 26 2015 11:44 PM

వారసుడు కోసం రెండో పెళ్లి.. - Sakshi

ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్య
  డబ్బుల విషయమై
  దంపతుల మధ్య మనస్పర్థలు

  దిమిలిలో ఘోరం
 భర్తతో తలెత్తిన వివాదంతో మనస్తాపానికి గురైన భార్య క్షణికావేశానికి పోయింది. తన ఇద్దరి పిల్లలపై కిరోసిన్ పోయడంతోపాటు తను కూడా పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు ప్రాణాలను బలిగొన్న ఈ విషాద సంఘటన కొత్తూరు మండలం దిమిలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ దారుణంలో కెల్ల భాగ్యం (35), ఆమె కూతురు నాగమణి (5), కొడుకు మోహనరావు (2 నెలలు) ప్రాణాలు కోల్పోయారు.
 
 కొత్తూరు: దిమిలి గ్రామానికి చెందిన కెల్ల పార్వతీశానికి మగ పిల్లలు లేక పోవడంతో మొదటి భార్య చెల్లెలైన ఒడిశా రాష్ట్రం గుణుపూర్‌కు చెందిన దార్ల భాగ్యాన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్ల కూతురు నాగమణి, రెండు నెలల కుమారుడు మోహనరావు ఉన్నారు. పార్వతీశం తన భార్య భాగ్యానికి 20 రోజుల క్రితం 15 వేల రూపాయలను ఇచ్చి ఉంచమన్నాడు. ఈ డబ్బులు ఇంట్లో లేకపోవడంతో ఏమి చేశావు, ఎవరికి ఇచ్చావని భార్యను నిలదీశాడు. ఇదే విషయమై కొద్దిరోజులుగా వీరి మధ్య వివాదం జరుగుతోంది. శనివారం రాత్రి కూడా భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన భాగ్యం ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో
 ఎవరూ లేని సమయంలో తన పిల్లలు నాగమణి, మోహనరావులపై  ఇంట్లో ఉన్న కిరోసన్‌ను పోసి, తనుకూడా పోసుకొని నిప్పు అంటించుకుంది.
 
 దీంతో పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కలు ఉన్నవారు చూసి ఇంట్లోనికి వెళ్లి చూశారు. అప్పటికే భాగ్యం, కూతురు నాగమణి తీవ్రంగా కాలిపోయి చనిపోయి ఉన్నారు. రెండు నెలల మోహనరావు కొన ఊపిరితో ఉండడంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేలోపే మృతి చెందాడు. మృతురాలు భాగ్యం అన్నయ్య భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఇన్‌చార్జి ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు. సంఘటన స్థలాన్ని పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ, ఆర్‌ఐ వై. కూర్మనాయుకులు సందర్భించారు. తల్లీ పిల్ల మృతికి కారణాలపై భాగ్యం భర్త పార్వతీశాన్ని విచారించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకొని సంఘటన స్థలాన్ని, మృతదేహాలను పరిశీలించారు.
 
 పార్వతీశం మొదటి భార్యకు ముగ్గురు అడపిల్లలే. దీంతో వారసుడు కావాలనే కోరికతో తొలి భార్య చెల్లెలైన భాగ్యాన్ని రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు తొలి సంతానంగా ఆడపిల్ల, రెండో కాన్పులో రెండు నెలల క్రితం బాబు పుట్టాడు. దీంతో ఈ దంపతులు ఎంతో సంతోష పడ్డారు. కొడుకు పుట్టాడని స్నేహితులకు ఇటీవల పార్వతీశం విందు కూడా ఏర్పాటు చేశాడు. అయితే కొడుకు పుట్టాడన్న ఆశలు రెండు నెలలకే ఆవిరైపోయాయి. భాగ్యం మృతి చెందిన విషయాన్ని గుణపూర్‌లో ఉన్న అన్నయ్య, వదినలకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకొని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా భాగ్యం శనివారమే కురిగాం పీహెచ్‌సీలో కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయించుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement