రూ.వెయ్యి కోసం మహిళ హత్య! | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోసం మహిళ హత్య!

Published Thu, Mar 3 2016 2:39 AM

Woman killed for a thousand!

పోలీసుల అదుపులో నిందితులు
అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు

 
పీలేరు: మండలంలోని కంచెంవారిపల్లెలో బుధవారం తెల్లవారుజామున ఒక మహిళను దుండగులు రూ.1000 కోసం హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. పీలేరు మండలం తలపుల పంచాయతీ చిన్నయ్యగారిపల్లెకు చెందిన జె.మల్లయ్య కుమార్తె ఈశ్వరమ్మ(35)ను 15 ఏళ్ల క్రితం వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లెకు చెందిన నరసింహులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె భార్గవి(14), కుమారుడు నరేంద్ర(5) ఉన్నారు. మూడేళ్ల క్రితం నరసింహులు మృతిచెందాడు. ఈశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. మంగళవారం వితంతు పెన్షన్ రూ.1000 తీసుకుంది. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈశ్వరమ్మ ఇంటిపక్కన శవమై పడి ఉండడాన్ని మరిది లక్ష్మినారాయణ గుర్తిం చాడు. ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి, బంధువులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న పీలేరు ఎస్‌ఐ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈశ్వరమ్మ ఐదేళ్లుగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో సహాయకురాలిగా పనిచేస్తోంది.

అనాథలైన చిన్నారులు
అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు భార్గవి, నరేంద్ర అనాథలయ్యారు. భార్గవి స్థానిక జంగంపల్లె ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కుమారుడు నరేంద్ర అంగన్‌వాడీ కేంద్రానికి వె ళుతున్నాడు. తల్లికోసం చిన్నారులు విలపిస్తుంటే పలువురు కంటతడి పెట్టారు.
 
అది పెన్షన్ డబ్బు
పోలీసులు కంచెంవారిపల్లెకు చేరుకుని హత్యకు దారి తీసిన కారణాలపై గ్రామస్తులను ఆరా తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చంద్ర, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈశ్వరమ్మ మంగళవారం తీసుకున్న వితంతు పెన్షన్ రూ.1000ల కోసం గొంతునులిమి చంపేసినట్లు చంద్ర అంగీకరించినట్టు సమాచారం. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు.
 

Advertisement
Advertisement