‘స్త్రీ నిధి’ నిలువుదోపిడీ | Sakshi
Sakshi News home page

‘స్త్రీ నిధి’ నిలువుదోపిడీ

Published Sun, Jul 20 2014 4:01 AM

‘స్త్రీ నిధి’ నిలువుదోపిడీ

  •      డిపాజిట్ల పేరుతోరూ.44 కోట్ల వసూలు
  •      వడ్డీలేని రుణాలకు మంగళం
  •      మైక్రోఫైనాన్స్‌ను మించిపోయిన వైనం
  • చిత్తూరు (అగ్రికల్చర్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అత్యవసర సమయాల్లో రుణాలిచ్చి ఆదుకోవాల్సిన స్త్రీ నిధి బ్యాంకు డిపాజిట్ల పేరుతో నిలువుదోపిడీ చేస్తోంది. వివిధ రకాల డిపాజిట్ల పేరుతో ఎస్‌హెచ్‌జీ మహిళల నుంచి రూ.44 కోట్ల మేరకు వసూలు చేసుకుంది. ఇది చాలదన్నట్లు స్త్రీనిధి ద్వారా అందించాల్సిన వడ్డీలేని రుణాలకు ప్రభుత్వం జూలై నుంచి మంగళం పాడింది. దీన్నిబట్టి చూస్తుంటే స్త్రీనిధి మైక్రోఫైనాన్స్‌లను మించిపోయినట్లు కనిపిస్తోంది.
     
    మహిళలను మైక్రో ఫైనాన్స్ సంస్థల దోపిడీ నుంచి కాపాడేందుకు 2011 అక్టోబర్ 06 తేదీన అప్పటి ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును హైదరాబాదులో ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకు ద్వారా అత్యవసర సమయాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలను అందించి ఆదుకోవాల్సి ఉంటుంది. మహిళలు తమ సంఘం తరఫున సెల్‌ఫోన్ ద్వారా స్త్రీనిధి బ్యాంకుకు ఎస్‌ఎంఎస్ పంపిన 48 గంటల్లో రుణాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసింది. స్త్రీనిధి ద్వారా పొందిన రుణాలకు వడ్డీలేని విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
     
    జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాల్లో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 2012-13 సంవత్సరానికిగాను 10,554 సంఘాలకు చెందిన 48,306 మంది మహిళలు రూ.80 కోట్ల మేరకు రుణాలను పొందారు. 2013-14కు గాను 17,192 సంఘాలకు చెందిన 77,065 మంది మహిళలు రూ.123 కోట్ల మేరకు రుణాల కింద తీసుకున్నారు.
     
    డిపాజిట్ల పేరుతో వసూళ్లు
     
    స్త్రీనిధి బ్యాంకు ద్వారా ప్రభుత్వం మహిళల వద్ద డిపాజిట్ల పేరుతో రూ.44 కోట్ల మేరకు వసూలు చేసింది. అత్యవసర సమయాల్లో రుణాలను అందించేందుకు గాను మహిళా సంఘాలు స్త్రీనిధి బ్యాంకుకు ముందస్తుగా  డిపాజిట్లు చేయాలని షరతును విధించింది. దీంతో ప్రతి మండల సమాఖ్య ద్వారా మహిళలు రూ.10 లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా 64 మండలాలకుగాను రూ.6.40 కోట్ల మేరకు స్త్రీనిధి బ్యాంకులో డిపాజిట్ చేశారు. అయినా రుణాలు సక్రమంగా అందకపోవడంతో మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

    ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని మభ్యపెడుతూ మరోసారి గ్రామ సమాఖ్యల ఖాతాల్లో కొంత మెత్తాలను డిపాజిట్లు చేసుకోవాలని సూచించింది. అత్యవసర సమయాల్లో ఆ నిధుల నుంచి రుణాలను తీసుకుంటే అటు తర్వాత స్త్రీనిధి బ్యాంకు నుంచి వచ్చే రుణాల మొత్తాలను గ్రామ సమాఖ్యకు జమచేస్తామని తెలియజేసింది. జిల్లా వ్యాప్తంగా మరోమారు 61 వేల సంఘాలు రూ.2 వేలు చొప్పున గ్రామ సమాఖ్య ఖాతాలకు మొత్తం రూ.12 కోట్ల మేరకు డిపాజిట్లు చేశారు.
     
    బీఎంసీల ద్వారానూ వసూలు..

    మహిళా సంఘాల ద్వారా ఆయా మండలాల పరిధిలో నడిపే పాలశీతలీకరణ కేంద్రం (బీఎంసీయూ) ద్వారా వచ్చే లాభాలను స్త్రీనిధి బ్యాంకులో జమచేస్తే వడ్డీ ఇస్తామని తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్ల మేరకు వసూలు చేసుకుంది.
     
    వ్యక్తిగత పొదుపుల పేరుతో..

    స్త్రీనిధి బ్యాంకు రుణాలు పొందాలంటే ప్రతి ఎస్‌ెహ చ్‌జీ సంఘం రూ.2 వేల మేరకు కనీస మొత్తాన్ని వ్యక్తిగత పొదుపులో ఉంచాలని ఇటీవల షరతు విధించింది. 2012 అక్టోబరు నుంచి 2014 అక్టోబరు వరకు నెలకు రూ.100 చొప్పున రెండేళ్లకు గాను ఒకేసారి రూ.2400 మేరకు కట్టించుకుంది. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 61 వేల సంఘాలకు గాను రూ.14 కోట్ల మేరకు కట్టించుకుంది. ఇప్పటికే  దాదాపు 80 శాతం సంఘాల వరకు పొదుపు మొత్తాలను స్త్రీనిధి బ్యాంకుకు కట్టాయి.
     
    వడ్డీలేని రుణాలకు మంగళం..
     
    స్త్రీనిధి ద్వారా అందిస్తున్న వడ్డీలేని రుణాలకు నూతన ప్రభుత్వం మంగళం పాడింది. ఫలితంగా స్త్రీనిధి రుణాలు పొందిన మహిళలు ఈనెల నుంచి చెల్లించాల్సిన మొత్తాలతోపాటు 14 శాతం వడ్డీతో కలిపి రుణాలను తిరిగి స్త్రీనిధి బ్యాంకుకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిం చింది. మైక్రోఫైనాన్స్ కన్నా స్త్రీనిధి బ్యాంకు రుణాలు దారుణంగా తయారయ్యాయని మహిళలు వాపోతున్నారు.

Advertisement
Advertisement