అంతర్మథనంలో మహిళా కానిస్టేబుళ్లు | Sakshi
Sakshi News home page

అంతర్మథనంలో మహిళా కానిస్టేబుళ్లు

Published Fri, Aug 7 2015 1:47 AM

Women constables in Harassment problems

వేధింపులు భరిస్తూ ఉద్యోగాలు
ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయని సిబ్బంది
 
 గుంటూరు క్రైం : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసుశాఖలో కీచకులు ఉండడంతో విధులు నిర్వహించడం మహిళా కానిస్టేబుళ్లకు భారంగా మారింది. చాలామంది ధైర్యం చేసి ఫిర్యాదు చేసేందుకు జంకుతూ లోలోన మథనపడుతున్నారు. నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగశ్వేత విద్యావంతురాలు కావడంతో ధైర్యం చేసి సీఐ శరత్‌బాబు వేధింపులపై రూరల్ ఎస్పీ నారాయణ నాయక్‌కు ఫిర్యాదు చేశారు.

 వేధింపులిలా... అవివాహిత అయిన మహిళా కానిస్టేబుల్ నాగశ్వేతపై కన్నేసిన సీఐ ఎలాగైనా ఆమెను లోబరచుకోవాలని అదనపు విధులు కేటాయించేవాడు. అర్ధరాత్రి సమయంలో స్టేషన్‌లో ఎంతమంది సిబ్బంది ఉన్నా  నాగశ్వేతను మాత్రమే తన వాహనంలో ఎక్కించుకుని నైటుబీటుల పర్యవేక్షణ పేరుతో శివారు ప్రాంతాల్లో వాహనాలను ఆపేవాడు. ద్వందార్థాలతో లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయం తెలియక తోటి సిబ్బంది తన గురించి తప్పుగా మాట్లాడుకోవడం నాగశ్వేతను మరింత మానసిక వేదనకు గురిచేసింది. ఎంతకూ ఆమె అంగీకరించకపోవడంతో సీఐ ఆమెకు ఉద్దేశపూర్వకంగా అదనపు విధులు కేటాయించేవాడు.

గత నెలలో ఆమె కాలుకు గాయమై నడవడం కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో గతనెల 14, 15, 16 తేదీల్లో ఫిరంగిపురంలోని కార్మెల్ కొండపై జరిగిన కార్మెల్‌మాత వేడుకలకు కొండపై విధులను కేటాయించాడు. తాను నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పినా వినకుండా విధులు నిర్వహించాలని హుకుం జారీ చేయడంతో గత్యంతరంలేని స్థితిలో కొండపైకి వెళ్లి విధులు నిర్వహించింది. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో నరసరావుపేటలోని ఓ గెస్టుహౌస్‌కు తీసుకెళ్లి తన కోర్కె తీర్చాలని నాగశ్వేతను పట్టుపట్టాడు.

సీఐ వేధింపులు పరాకాష్టకు చేరడంతో భరించలేక బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశారు. విచారణలో వాస్తవం అని తేలడంతో సీఐ శరత్‌బాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు. సీఐ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం జిల్లాలోని పోలీసుశాఖలో దావానలంలా పాకింది. పోలీసు అధికారులు, సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. చట్టానికి ఎవ్వరూ అతీతం కాదని చెప్పే అధికారులు సీఐ శరత్‌బాబుపై సస్పెన్షన్‌తో సరిపెట్టుకోకుండా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement