మహిళలు ముందడుగు వేయాలి | Sakshi
Sakshi News home page

మహిళలు ముందడుగు వేయాలి

Published Thu, Mar 9 2017 4:15 AM

women's day special

ఒంగోలు అర్బన్‌: మహిళలు అన్నింటా ముందుండాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఆమె ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. టగ్‌ ఆఫ్‌ వార్, మ్యూజికల్‌ చైర్స్‌ తదితర ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. సుజాత మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

 వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని సూచించారు. అధికార పార్టీ మహిళా అధికారులు, ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం చేయడం దురదృష్ట కరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం చిన్నతనం నుంచి అలవాటు చేయాలన్నారు. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పోకల అనూరాధ మాట్లాడుతూ మహిళలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలన్నారు.

 మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర మాట్లాడుతూ రాజకీయాల్లో, చట్ట సభల్లో స్త్రీలకు ప్రాముఖ్యం కలిగిస్తే మహిళా సాధికారత సాధించేందుకు వీలవుతుందన్నారు. నగర మహిళా అధ్యక్షురాలు కావూరి సుశీల, రమణమ్మ, అరుణ, పురిణి ప్రభావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. నాగరాజు, ట్రేడ్‌ యూనియన్‌ నగర అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, సేవాదళ్‌ నగర అధ్యక్షుడు వల్లెపు మురళి, మైనార్టీ సెల్‌ నగర అధ్యక్షుడు మీరావలి, నాయకులు తోటపల్లి సోమశేఖర్, జాజుల కృష్ణ, పి. జేమ్స్‌ హాజరయ్యారు.

 ముందంజలో ఉన్నారు
ఒంగోలు సెంట్రల్‌: మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్‌–1 అధికారి గోపి అన్నారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో కె. నిర్మలాదేవి అధ్యక్షతన సభ జరిగింది. ప్రభుత్వం స్త్రీలకు ప్రత్యేక చట్టాలు అమలు జరిగే విధంగా చూడాలన్నారు. పి. మల్లికార్జునరావు, డి. నరసింహారావు, జె. నరసింగరావు, ఎన్‌. వి. సుబ్బారావు, ఆర్‌. శ్రీనివాస్, సంధ్యారాణి, నిర్మలాదేవి, సులోచనా రాణి, రత్న మంజరి తదితరులు పాల్గొన్నారు.

విద్యతోనే మహిళాభివృద్ధి
ఒంగోలు టౌన్‌: విద్య ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ టీవీ శ్రీనివాస్‌ ఉద్బోధించారు. సాధారణ ఉద్యోగి నుంచి కంపెనీ సీఈఓల వరకు మహిళలు ఎదిగారంటే అది విద్య ద్వారా అన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయ సమావేశపు హాలులో ప్రసంగించారు. ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. విశాలాక్షి మాట్లాడుతూ మహిళలు మార్పును ఆహ్వానించాలని, దాని గురించి ఆలోచించి ఆచరించేందుకు ప్రయత్నించాలన్నారు.

అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పద్మావతి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అంగన్‌వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని కిశోర బాలికలను ఆరోగ్య విషయంలో చైతన్యవంతులను చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓలు ప్రశంస పత్రాలు అందజేశారు. మహిళా సాధికారత గురించి పలువురు ఆలపించిన గీతాలు ఆలోచింపచేశాయి.

Advertisement
Advertisement