బాలల గోడు..అందరికీ గూడు.. | Sakshi
Sakshi News home page

బాలల గోడు..అందరికీ గూడు..

Published Mon, Oct 6 2014 12:39 AM

బాలల గోడు..అందరికీ గూడు..

‘మెట్రోపొలిస్’లో పలు అంశాలపై చర్చించనున్న నిపుణులు  
హైదరాబాద్‌లో నేటి నుంచే ప్రపంచ సదస్సు    

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ ‘మెట్రోపొలిస్ ప్రపంచ సదస్సు-2014’ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో నేడు ప్రారంభం కానుంది. ముఖ్య సదస్సు, ప్రారంభోత్సవం మంగళవారం జరుగనున్నప్పటికీ, ఆరంభ కార్యక్రమాలు సోమవారం నుంచే మొదలు కానున్నాయి. ఆతిథ్య బాధ్యతలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసింది. విమానాశ్రయంలో అతిథులకు స్వాగత కార్యక్రమాల నుంచి వారు బస చేసే హోటళ్లు.. సదస్సు వేదిక వద్దకు చేరుకునేందుకు సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశీయులతోపాటు దేశంలోని పలు నగరాల నుంచి అధికసంఖ్యలో ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సుకు రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేయడంతో మన రాష్ట్రం నుంచి వివిధ వర్గాలకు చెందిన వారు సదస్సుకు హాజరయ్యేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. 
 
అయితే, సదస్సులో ఏం జరుగనుందన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో ఏం చేస్తారు? ఎందుకీ సదస్సులనేవి ఎందరినో తొలుస్తున్న ప్రశ్నలు. నగరాల్లో.. ముఖ్యంగా పది లక్షల జ నాభా దాటిన నగరాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు.. వాటికి పరిష్కారాలపై ఆయా దేశాలు.. నగరాల నుంచి వచ్చిన వారు చర్చిస్తారు. తమ ప్రాంత సమస్యలను, వాటి పరిష్కారానికి తాము చేస్తున్న కృషినీ వివరిస్తారు. అలాగే, అలాంటి సమస్యల కోసం ఇతరులేం చేస్తున్నారో తెలుసుకుంటారు. పరస్పరం మాట్లాడుకోవడం.. చర్చించుకోవడం ద్వారా ఆయా సమస్యల్లోని సారూప్యతలు తెలుస్తాయి. పరస్పర అభిప్రాయ మార్పిడితో పరిష్కారానికి తగిన దారులు వెతుకుతారు. సదరు ఆలోచనలు తమకు అనువైనవిగా ఉంటే అమలు చేసేందుకు ఆ మేరకు విధానాలను రూపొందించుకుంటారు. అమలుపై దృష్టి సారిస్తారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై పలువురు ప్రసంగించనున్నారు. తొలిరోజు సదస్సులోని ముఖ్యాంశాలివీ..

అందరికీ ఇళ్లు..

దేశంలో నివాస గృహాలు లేక అలమటిస్తున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అవి ఆశించిన ఫలితమివ్వడం లేదు. భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నా అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పేదలకు ఉపయోగపడే ఇళ్ల నిర్మాణంలో ప్రైవేట్ సంస్థలు భాగస్వాములు కావడానికి తగిన వాతావరణం.. అనువైన పరిస్థితులు కల్పించాలనే అభిప్రాయాలున్నాయి. దీంతోపాటే ప్రజల భాగస్వామ్యమూ పెరగాల్సి ఉంది. నేషనల్ అర్బన్‌హౌసింగ్ అండ్ హాబిటేట్ పాలసీ(ఎన్‌యూహెచ్‌హెచ్ పీ)ని 2007లో రూపొందించినా, ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్(ఎఫ్‌డీఐ), ఇతర దేశాల హౌసింగ్ పాలసీలు -మన దేశంలో అమలవుతున్న గృహ నిర్మాణ విధానాల్లో వ్యత్యాసాలు తదితరాలపై చర్చించనున్నారు. అంతిమంగా..అందరికీ ఇళ్లు సమకూరేందుకు ఏం చేయాలనే  దానిపై ఈ రంగంలో అనుభవజ్ఞులైన వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు.

 వక్తలు:ప్రొఫెసర్ అమితాబ్ కుందు(చైర్‌పర్సన్,‘రివ్యూ ఆఫ్ పోస్ట్ సచార్ ప్రోగ్రామ్స్, భారత ప్రభుత్వం), రాజమణి ముత్తుచమి, ఐఏఎస్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్, పాలసీ ఇనిషియేటివ్స్, జన గ్రూప్), ప్రొఫెసర్ క్రిస్‌జాన్సన్, సీఈఓ, (అర్బన్ టాస్క్‌ఫోర్స్, ఆస్ట్రేలియా), రామన్ టోర్రా, జనరల్ మేనేజర్, (బార్సిలోనా మెట్రోపాలిటన్ ఏరియా-ఏఎంబీ), న్గ్యూయెన్ క్వాంగ్, హాబిటేట్ ప్రోగ్రాం మేనేజర్( యూఎన్ హాబిటేట్, వియత్నాం),

హౌసింగ్ పాలసీ అమలుపై ..

డిమాండ్, సప్లైల మధ్య భారీ వ్యత్యాసాన్ని పూడ్చేందుకు పీపీపీ అవసరమని 20007 ఎన్‌యూహెచ్‌హెచ్‌పీలో పేర్కొన్నప్పటికీ అమలులో  పురోగతి లేదు. ఇళ్లకు అవసరమైన భూములు లేకపోవడం, పెరుగుతున్న ధరలు, రుణాలకు తగిన మార్గాలు, తదితరమైనవి నగరాల్లోని పేదలకు సమస్యలుగా మారాయి. ఈ నేపథ్యంలో దేశంలో.. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన గృహ నిర్మాణ పథకాలతోపాటు లక్ష్యాలు చేరుకోలేకపోయిన పథకాలు.. అందుకు కారణాలు తదితరమైన వాటిపై చర్చించనున్నారు.
 వక్తలు..: కీర్తిషా (ఆర్కిటెక్ట్, కేఎస్‌ఏ డిజైన్ ప్లానింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), ఇందూప్రకాశ్‌సింగ్ (కన్వీనర్ నేషనల్ ఫోరమ్ ఫర్ హౌసింగ్ రైట్స్), మైటా ఫెర్నాండెజ్ ఆర్మెస్టో (సీనియర్ ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ కోఆర్డినేటర్, యూన్-హాబిటేట్, సిటీ రెజిలెన్స్ ప్రొఫైలింగ్ ప్రోగ్రాం), రోవెనా నెగ్రీరోజ్ (ప్లానింగ్ డెరైక్టర్, ఇంప్లాసా- సావో పావ్లో కంపెనీ ఫర్ మెట్రోపాలిటన్ ప్లానింగ్), మ్జోలిసి త్షబలాలా (ప్రాజెక్ట్ మేనేజర్, హ్యూమన్ సెటిల్మెంట్స్ డెవలప్‌మెంట్స్, ఈ-తెక్విని మున్సిపాలిటీ).

అందరికీ ఇళ్లు.. మరో  కోణం

నివాసం అనేది కేవలం తలదాచుకునేదిగా మాత్రమే కాక మానవ నైపుణ్యాలు, ఉత్పాదకశక్తి పెంచేందుకు దోహదపడేలా ఉండాలనేది మరో కోణం. విద్య, వైద్య సదుపాయాలతోపాటు మిగతా ప్రజలందరిలాగే పేదవర్గాలకు సైతం తగిన మౌలిక సదుపాయాలుండాలనే ఈ అంశంపై జరిగే చర్చలో పాల్గొనే వారు..: రాజేంద్ర జోషి (డెరైక్టర్, సాథ్ లైవ్లీహుడ్ సర్వీసెస్), ప్రతిమా జోషి (ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, షెల్టర్ అసోసియేట్స్), సరాహ్‌ఉదీనా (డిప్యూటీ టూ ది అర్బన్ ప్లానింగ్ మేనేజర్ డెరైక్టర్, బార్సిలోనా సిటీ కౌన్సిల్), డా.సూక్ జిన్ లీ (ప్రెసిడెంట్, సియోల్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ), సుందర్ బుర్రా (అడ్వైజర్, ఎస్‌పీఏఆర్‌సీ)
 
నగరాల్లో బాలలపై చర్చ..


ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో సగానికి పైగా నగరాల్లోనే నివసిస్తుండగా, అందులో బాలల సంఖ్య తక్కువేమీ లేదు. బాలల్లోనూ ఎక్కువమంది కనీస సదుపాయాలు కరువైన మురికివాడల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. నివాసం నుంచి మొదలు పెడితే విద్యనందించే పాఠశాలల దాకా అన్నీ వారికి కరువే. ఇక వాతావరణ, కలుషిత నీటి సంబంధ వ్యాధుల బారినపడుతున్న వారిలోనూ బాలలే అధికం. ఇలాంటి వ్యాధులతో ఏటా మరణిస్తున్న బాలల్లో 30 లక్షల మంది ఐదేళ్లలోపువారే కావడం ఆయా నగరాల్లోని దుస్థితికి దర్పణం. మన దేశానికి సంబంధించినంత వరకు 158 మిలియన్ల బాలభారతంలో 7.8 మిలియన్ల బాలలు నగరాల్లో పేదరికంలో మగ్గుతున్నారు. వారి బాధలు, పరిస్థితులు.. వారి కలలేమిటో వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకు వారే గళాలు విప్పాల్సి ఉంది. అందుకు మెట్రోపొలిస్ సదస్సు వేదిక కల్పిస్తోంది. ఈ వేదికలో ప్రసంగించేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన రాజ్‌కుమార్(13) ఎంపికయ్యాడు. అయిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి నగర మురికి వాడల్లోని బాలల దుర్భర స్థితులపై మాట్లాడనున్నాడు. అలాగే, ముంబైకి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కాజల్ ఖురానా(14), న్యూఢిల్లీకి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక మాలతీయాదవ్(14)లు సైతం తమకెలాంటి పరిస్థితులు కావాలో వెల్లడించనున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement