విజయవాడలో డబ్ల్యూహెచ్‌ఈఎఫ్‌ సదస్సు | Sakshi
Sakshi News home page

విజయవాడలో డబ్ల్యూహెచ్‌ఈఎఫ్‌ సదస్సు

Published Thu, Feb 6 2020 2:18 PM

World Hindu Economic Forum 2020 Regional Summit in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా వరల్డ్‌ హిందూ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూహెచ్‌ఈఎఫ్‌) ప్రాంతీయ సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు విజయవాడలో జరిగే ఈ సదస్సుకు పది దేశాలకుపైగా 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని డబ్ల్యూహెచ్‌ఈఎఫ్‌–2020 సదస్సు చైర్మన్‌ ఎస్‌.ఎన్‌. కుమార్‌ బుద్ధవరపు బుధవారం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించి ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, ‘కలసి అభివృద్ధి చెందుదాం– కలసి పంచుకుందాం’ అన్న లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

ముఖ్యంగా వ్యవసాయం, ఆహార శుద్ధిరంగం, పర్యాటకం, విద్య, వైద్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్‌ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. కేంద్రమంత్రులు వి.మురళీధరన్, జి.కిషన్‌రెడ్డిలతోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. విజయవాడ ఫార్చ్యూన్‌ మురళీ పార్కులో 8వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రాంతీయ సదస్సు ప్రారంభమవుతుందని, 9న ఆరు రంగాలపై ప్యానల్‌ డిస్కషన్స్‌ జరుగుతాయని కుమార్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ కుటుంబాలకు చెందిన వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, బ్యాంకింగ్, ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికమీదకు తీసుకురావడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని వివరించారు.

డబ్ల్యూహెచ్‌ఈఎఫ్‌తో ఒప్పందం..
గడిచిన ఎనిమిదేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్న డబ్ల్యూహెచ్‌ఈఎఫ్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను ప్రచారం చేసేలా డబ్ల్యూహెచ్‌ఈఎఫ్‌తో ఈ సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. (చదవండి: కియా మోటార్స్ ఎక్కడికి తరలివెళ్లడం లేదు)

Advertisement

తప్పక చదవండి

Advertisement