నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం

Published Mon, Sep 16 2013 3:52 AM

Worst 'infinite' forehead written this year does not appear to change the situation

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  సరిగ్గా 18 ఏళ్ల తర్వాత పెన్నమ్మ పరవళ్లు తొక్కుతోంది.. చిత్రంగా చిత్రావతీ చిందులు వేస్తోంది.. వాగులు, వంకలు సెలయేళ్లను తలపిస్తున్నాయి. కానీ.. దుర్భిక్ష ‘అనంత’ నుదిటి రాత ఈ ఏడాదీ మారే పరిస్థితి కన్పించడం లేదు. కారణం.. వరద నీటిని ఒడిసిపట్టాల్సిన చెరువులు, చిన్నతరహా ప్రాజెక్టులు ఓటికుండలుగా మారడమే!! ఏళ్ల తరబడి చెరువులు, కుంటలు, చిన్న తరహా ప్రాజెక్టులకు మరమ్మతులు చేయడంలో చిన్ననీటిపారుదల శాఖ నిర్లక్ష్యం చేయడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసినా వరద నీళ్లు నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు ఏకైక ప్రధాన సాగునీటి వనరు హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ). ఈ కాలువ కింద 1.95 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉన్నా సగటున 70 వేల ఎకరాలకు మించీ నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. మన జిల్లాలో 1,373 చెరువులు, 2,094 కుంటలు వంటి సాంప్రదాయ సాగునీటి వనరులను రాజుల కాలంలో తవ్వించారు.
 
 ఈ చెరువుల కింద 1,37,640 ఎకరాలు, కుంటల కింద 21,094 ఆయకట్టు విస్తరించి ఉంది. చెరువులు, కుంటలతోపాటూ ఎగువ పెన్న ప్రాజెక్టు(పేరూరు డ్యాం), పెన్నార్-కుముద్వతి, మద్దిలేరు, చెన్నరాయగుడి, భైరవానితిప్ప ప్రాజెక్టులను చిన్న నీటిపారుదలశాఖ పర్యవేక్షిస్తుంది. పీఏబీఆర్(పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్), మధ్య పెన్నార్(పెనకచర్ల) డ్యాం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లను భారీ నీటిపారుదలశాఖ(హెచ్చెల్సీ) అధికారులు పర్యవేక్షిస్తారు. భారీ నీటిపారుదలశాఖ పరిధిలో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ ఒకింత మెరుగ్గానే ఉంది. కానీ.. చిన్ననీటిపారుదలశాఖ సారథ్యంలోని చెరువులు, కుంటలు, చిన్న తరహా ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడం వల్ల చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఓటికుండలను తలపిస్తున్నాయి. కొద్ది పాటి వర్షానికి పోటెత్తిన వరద ఉద్ధృతికి కొన్ని చెరువుల గట్లు తెగిపోతే.. తూములు మరమ్మతు చేయకపోవడం వల్ల మరి కొన్ని చెరువుల్లో నీళ్లు నిల్వ చేసుకోలేని దుస్థితి నెలకొంది. చిన్న తరహా ప్రాజెక్టులదీ అదే దుస్థితి.
 
 నిర్లక్ష్యానికి పరాకాష్ట : పెన్నానదిపై పేరూరు వద్ద 1956లో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు చివరిసారిగా 1996లో నిండింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ప్రాజెక్టులోకి చుక్క నీళ్లు చేరలేదు. దీనికి ప్రధాన కారణం.. పెన్నానదిపై నాగలమడక వద్ద ఓ ప్రాజెక్టును కర్ణాటక అక్రమంగా నిర్మించడమే. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను మన జిల్లాకు చెందిన అప్పటి ఓ ప్రజాప్రతినిధే నిర్మించారు. కర్ణాటక, మన జిల్లా పరిధిలో ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు నాగలమడక ప్రాజెక్టు పొంగిపొర్లడంతో 18 ఏళ్ల తర్వాత పెన్నమ్మ పరవళ్లు తొక్కింది.
 
 పేరూరు డ్యాంకు వరద నీరు చేరింది. కానీ.. డ్యామ్ గేట్లు తుప్పుపట్టిపోయి, పాడైపోవడంతో చుక్క నీళ్లు నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. డ్యాంలోకి వచ్చిన నీళ్లు వచ్చినట్లుగానే గేట్ల గుండా నదిలోకి వెళ్తున్నాయి.  గేట్ల మరమ్మతును పట్టించుకోని చిన్న నీటిపారుదలశాఖ అధికారులు పేరూరు డ్యాం ఆధునికీకరణకు రూ.12 కోట్లను మంజూరు చేయాలని కోరుతూ 2010లో జైకా(జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ)కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపారు. కానీ.. అదే ఏడాది జల్ తుఫాన్ వల్ల జపాన్ అతలాకుతలమైంది. నీళ్లేలేని పేరూరు డ్యాంకు రూ.12 కోట్లు కేటాయించేది లేదని ఇటీవల జైకా తెగేసి చెప్పింది. మద్దిలేరు, పెన్నార్-కుముద్వతి, చెన్నరాయగుడిస్వామి ప్రాజెక్టులదీ ఇదే దుస్థితి.
 
 గుండె‘చెరువు’ : సప్లయ్ ఛానళ్లు, ఫీడర్ ఛానళ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో సమృద్ధిగా వర్షాలు కురిసినా చెరువుల్లోకి వర్షపు నీళ్లు చేరని దుస్థితి నెలకొంది. వారం రోజులుగా కురిసిన వర్షాలతో పోటెత్తిన వాగులు, వంకల ఉద్ధృతికి 32కుపైగా చెరువులు తెగిపోయాయి. కలెక్టర్‌గా సోమేశ్‌కుమార్ పనిచేసిన కాలంలో ‘పనికి ఆహార పథకం’ కింద కొన్ని చెరువుల సప్లయ్ ఛానళ్లు, ఫీడర్ ఛానళ్లును బాగు చేయించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఇందిరమ్మ చెరువులు’ పథకం కింద 50 చెరువులను ఆధునికీకరించారు. చెరువులను అభివృద్ధి చేయడం కోసం ట్రిపుల్ ఆర్ పథకం కింద రూ.90 కోట్లను మంజూరు చేయించారు. కానీ.. ఆ నిధులను నేటికీ వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది.
 

Advertisement
Advertisement