రాష్ట్రంలో దగాకోరు పాలన | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దగాకోరు పాలన

Published Wed, Mar 16 2016 11:31 PM

wrost rule of ap govt

పెందుర్తి:  రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దగాకోరు పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ద్వజమెత్తారు. పెందుర్తిలో బుధవారం జరిగిన పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చంద్రబాబు ప్రజల ముందు దోషిగా నిలబడ్డారన్నారు. అతని అవినీతిని అడుగడుగునా నిలదీస్తున్నందునే ప్రతిపక్షం లేకుండా చేద్దామన్న కుట్రతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని అన్నారు. ఒక్క పైసా రుణం కూడా కట్టవద్దని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తాను అలా అనలేదని బుకాయించడమే కాకుండా.. రైతులకు అంత అత్యాశ ఉండకూడదని హేళన చేయడం దుర్మార్గమన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ 5 నెలలుగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు.

గ్రామాల్లో సర్పంచ్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ కిరికిరిలు పెట్టే జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ధర్మాన అన్నారు. చంద్రబాబు, అతడి కొడుకు వందల కోట్లు కూడబెడుతుంటే.. స్థానికంగా జన్మభూమి కమిటీల సభ్యులు చిల్లర వ్యవహారాలు చక్కబెడుతున్నారన్నారు. మొత్తానికి అధికార టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. సంస్కారం లేని వ్యక్తులను గుర్తించి అందులో ఒకటో నెంబర్‌గా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడిని చంద్రబాబు ప్రతిపక్షం మీదకి ఉసిగొల్పారన్నారు. అవాకులు చెవాకులు పేలడం తప్ప అచ్చెన్నాయుడికి మట్లాడటం చేతకాదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడై జగన్‌మోహాన్‌రెడ్డికి అండగా ఉండాలని ఉద్బోధించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. మహానేత వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి భావజాలం నుంచి పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ భావజాలాన్ని తమలో ఇముడ్చుకోవాలని సూచించారు. త్వరలో మంచి రోజులు రానున్నందున కార్యకర్తలు మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటిం చా రు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, జాన్‌వెస్లీ, సమన్వయకర్తలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి, కర్రి సీతారాం, కోలా గురువులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.భగవాన్‌జయరామ్, సీపీసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గొర్లె రామునాయుడు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement