Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Exit Polls Survey organizations concluded YSRCP clearly heading for victory
లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్‌’ పక్కా

సాక్షి, అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం ఖాయమని... ఏ లెక్కన చూసుకున్నా మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం పక్కా అని అధిక శాతం జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పాయి. రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇవన్నీ స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌కు చెందిన టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 14 లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంటుందని.. ఎన్‌డీఏ కూటమి 48 శాతం ఓట్లతో 11 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడయింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తరహాలోనే దేశ వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉన్న దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌... రాష్ట్రంలో 15–17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. ఎన్‌డీఏ కూటమి 8–9 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని తన ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా తేల్చిచెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వంటి మీడియా సంస్థలు, సెఫాలజిస్టులు, ఆరా వంటి ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థలు నిర్వహించిన 32 ఎగ్జిట్‌ పోల్స్‌లో 24 ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమయింది. బీజేపీ భజన చేసే జాతీయ మీడియా ఎగ్జిట్‌ పోల్స్‌ తద్భిన్నం.. బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, జీన్యూస్‌.. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న నెట్‌వర్క్‌లోని సీఎన్‌ఎన్‌ న్యూస్‌–18 వంటి రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేల్చడం గమనార్హం. రాజధాని అంశంతోపాటు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో సానుభూతి వచి్చందని.. అదే ఎన్‌డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని ఆ సంస్థలు విశ్లేషించాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇటు వైఎస్సార్‌సీపీగానీ అటు ఎన్‌డీఏగానీ రాజధాని అంశాన్ని ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇక స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి బంద్‌లు గానీ, ర్యాలీలు గానీ, నిరసనలు గానీ జరగనేలేదు. తప్పు చేశాడు కనక అరెస్టయ్యాడనే రీతిలో జనం స్పందించారు. దీంతో హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూపన్లు ఇచ్చి మరీ ‘ఐటీ ఉద్యోగుల’ పేరిట స్థానికంగా ఒక ఈవెంట్‌లా నిరసన కార్యక్రమం చేశారు. అలాంటిది ఈ రెండు అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని, అందుకే కూటమి గెలుస్తోందని ఈ జాతీయ ఛానెళ్లు చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్లూ తప్పవుతుందని రాష్ట్ర వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మేదెలా? విచిత్రమేంటంటే ‘ఇండియా టుడే– మై యాక్సిస్‌’ సంస్థ శనివారంనాడు దేశవ్యాప్త ఎగ్జిట్‌పోల్స్‌ను వెలువరించింది. దీన్లో బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని చేర్చటమే లక్ష్యంగా ఒకో రాష్ట్రంలో స్వీప్‌ అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పైపెచ్చు రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీకి 2 నుంచి 4 లోక్‌సభ స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పిన ఇండియా టుడే సంస్థ... ఆ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ గుర్తును కూడా ఆప్‌ గుర్తయిన చీపురుగా చూపించింది. విశేషమేంటంటే దీన్నే తెలుగుదేశం పార్టీ తన ట్విటర్‌ ఖాతాలోనూ పోస్ట్‌ చేసుకుంది. మరి పార్టీ గుర్తు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మేదెలా? ఇక కొన్ని రాష్ట్రాల విషయంలోనైతే కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అక్కడ వాస్తవంగా ఉన్న మొత్తం స్థానాలకన్నా ఎక్కువ స్థానాలు ఎన్‌డీఏ గెలుస్తుందని చూపించటాన్ని ఇప్పటికే ట్విటర్లో పలువురు ట్రోల్‌ చేస్తున్నారు కూడా. ఇదే ఇండియాటుడే– మై యాక్సిస్‌ సంస్థ 2021లో బెంగాల్లో చేసిన ఎగ్జిట్‌పోల్స్, 2023లో ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లలో చేసిన ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తిగా రివర్సయ్యాయనేది ఇక్కడ గమనార్హం. నిజానికి ఈ సర్వేను ప్రసారం చేస్తున్నపుడు ‘ఇండియాటుడే’ ఛానెల్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సర్వే ఫలితాలతో విభేదించారు కూడా. తాను ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించానని, సర్వేలో చెప్పినట్లుగా పరిస్థితులు అక్కడ లేవని పేర్కొన్నారు. గ్రామీణ, మహిళా ఓటర్లు పూర్తిగా వైఎస్సార్‌ సీపీవైపే ఉన్నారని, అది తన పర్యటనలో కనిపించిందని సర్దేశాయ్‌ చెప్పగా... చంద్రబాబు నాయుడి అరెస్టు పట్ల జనంలో సానుభూతి పెల్లుబుకిందని, అదే కూటమి విజయానికి కారణమవుతోందని ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన ప్రదీప్‌ గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు. తాజాగా బీజేపీ కూటమికి దేశంలో అత్యంత భారీగా స్థానాలు వస్తాయని పేర్కొన్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌లో చిత్రవిచిత్రమైన తప్పులు కనిపించాయి. ఇండియాటుడే గ్రూప్‌లోని ఆజ్‌ తక్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో తమిళనాడులో కాంగ్రెస్‌ 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ 13–15 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చడంతో చర్చలో పాల్గొన్న వారే విస్తుపోయారు. రాజస్థాన్‌లో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలైతే.. ఆ రాష్ట్రంలో 33 స్థానాల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో టుడేస్‌ చాణక్య వెల్లడించడం గమనార్హం. జార్ఖండ్‌లో సీపీఐ (ఎంఎల్‌) ఒక స్థానంలో పోటీ చేస్తే.. రెండు నుంచి మూడు స్థానాల్లో ఆపార్టీ విజయం సాధిస్తుందని ఆజ్‌తక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. హర్యానాలో ఉన్నదే 10 లోక్‌సభ స్థానాలైతే 16–19 స్థానాల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని జీన్యూస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో తేల్చడం విస్మయకరమే. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నవే నాలుగు లోక్‌సభ స్థానాలైతే.. అక్కడ ఎన్‌డీఏ 6–8 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్‌ తేల్చింది. విశేషమేంటంటే ఈ సంస్థలన్నీ రాష్ట్రంలో కూటమికే మెజారిటీ లోక్‌సభ స్థానాలు దక్కుతున్నాయని చెప్పాయి. లోతుగా పరిశీలించినట్లయితే ఈ జాతీయ మీడియా సంస్థలకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి యంత్రాంగమూ లేదు. వీటిలో చాలావరకూ ప్రజల అభిప్రాయాన్ని ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ ద్వారా తెలుసుకుని.. వాటినే ఎగ్జిట్‌ పోల్స్‌గా వెల్లడించాయి. గ్రామీణ ఓటర్లు, మహిళలు, వైఎస్సార్‌ సీపీకి ఎప్పుడూ అండగా ఉండే బలహీనవర్గాలు ఇలాంటి సర్వేల్లో పాల్గొనే అవకాశం తక్కువ. దీన్ని బట్టి చూస్తే.. ఈ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌... జూన్‌ 4న పూర్తి స్థాయిలో తిరగబడతాయని స్పష్టంగానే చెప్పొచ్చు. వైఎస్సార్‌సీపీ ఓడిపోయే అవకాశమే లేదు..రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలను తెస్తూ... గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ... ఐదేళ్లుగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలను జనం పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో రుజువయింది. అర్హతే ప్రమాణికంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో 60 శాతానికి పైగా వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలుస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు.. మహిళల్లో వైఎస్సార్‌సీపీకి అత్యంత ఆదరణ ఉందని.. ఇదే ఆపార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఇవే జాతీయ మీడియా సంస్థలు గతంలో విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓట్లు పోల్‌ కావడం.. మహిళలు ఎన్‌డీఏ కూటమి కంటే వైఎస్సార్‌సీపీకి 12 శాతం అధికంగా వేశారని.. ఇది ఆపార్టీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని ఆరా మస్తాన్, చాణక్య పార్ధదాస్‌లు కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే తాము ఓడిపోయే అవకాశమే లేదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కౌంటింగ్‌ నాడు అక్రమాలకు తెగబడటానికే! రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వస్తుండటంతో పలువురు సెఫాలజిస్టులను చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ బెదిరించినట్లు వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సర్వే సంస్థ లోకేశ్‌ బెదిరింపులను తట్టుకోలేక... ఫలితాలను అట్నుంచి ఇటు మార్చి కూటమి గెలుస్తున్నట్లుగా ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ రెండ్రోజుల్లో తేలే ఫలితాల కోసం చినబాబు– చంద్రబాబు ఎందుకు ఇంతలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశాన్ని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. తామే గెలుస్తున్నామనే భ్రమలు కల్పించటం ద్వారా వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌లో నిరుత్సాహాన్ని నింపి... కౌంటింగ్‌ రోజున అవసరమైతే వారిని ప్రలోభపెట్టో, బెదిరించో తమ పబ్బం గడుపుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆలోచనగా చెబుతున్నారు. ఈసీ ఎలాగూ తమకే సహకరిస్తుంది కనక ఎలాంటి దారుణాలకైనా వెనకాడకూడదన్నది వీళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అయితే పురిట్లోనే సంధికొట్టినట్లు చాలామంది సెఫాలజిస్టులు వీరి బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్‌సీపీ గెలుస్తున్నదని చెప్పటం ‘బాబు’లిద్దరికీ మింగుడుపడటం లేదు.

YSRCP Victory in Times Now ETG exit poll
టైమ్స్‌ నౌ–ఈటీజీ ఎగ్జిట్‌ పోల్‌లో వైఎస్సార్‌సీపీ హవా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్‌ కలిగిన టైమ్స్‌ నౌ–ఈటీజీ రీసెర్చ్‌ ఆదివారం తన ఎగ్జిట్‌ పోల్స్‌లో తేల్చి­చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 51 శాతం ఓట్లతో మొత్తం 117–125 సీట్లు కైవసం చేసుకుంటుందని.. అదే సమయంలో టీడీపీ–జనసేన–బీజేపీ (ఎన్డీయే) కూటమి 47 శాతం ఓట్లతో 50–58 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. అలాగే, లోక్‌సభ పోలింగ్‌ విషయానికొస్తే.. వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో 14 ఎంపీ స్థానాలు, ఎన్డీయే కూటమి 48 శాతం ఓట్లతో 11 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఈసారి ఏపీలో దాదాపు 82శాతం పోలింగ్‌ నమోదైందని.. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది ఇంచుమించు రెండుశాతం అధికమని వివరించింది. అంతేకాక, మహిళల ఓటింగ్‌ కూడా ఈ దఫా 15శాతం అధికంగా నమోదైందని టైమ్స్‌ నౌ–ఈటీజీ రీసెర్చ్‌ తెలిపింది.

Horoscope Today: Rasi Phalalu On 03-06-2024 In Telugu
ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.ద్వాదశి రా.11.05 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం: అశ్విని రా.11.20 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.7.35 నుండి 9.05 వరకు, దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.16 వరకుతదుపరి ప.3.00 నుండి 3.52 వరకు, అమృతఘడియలు: సా.4.33 నుండి 5.56 వరకు. మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ధనలబ్ధి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.వృషభం: ఎంత శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.మిథునం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఒప్పందాలు. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.సింహం: సన్నిహితులతో వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యవహారాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.కన్య: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలలో నిదానం అవసరం. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.తుల: ముఖ్య నిర్ణయాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో అనుకూల వాతావరణం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.ధనుస్సు: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.మకరం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థికాభివృద్ధి. వృత్తులు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మీనం: ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరిస్తున్న  కేసీఆర్‌. చిత్రంలో మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్, పల్లా, తలసాని తదితరులు
తెలంగాణ రక్షణ కోసమే గులాబీ జెండా పుట్టింది: కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎన్నికల్లో జయాపజయాలు మనకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల ప్ర­యో­జనాల పరిరక్షణే ప్రధానం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టిన ప్రజలే ఇప్పుడు అన్నంల మన్ను పోసుకున్నట్లు అయిపాయే అనుకుంటున్నరు. అనతి కాలంలోనే అప్రతిష్ట పాలైన ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రీప్లేస్‌మెంట్‌ మనమే. ప్రజల్లో ఉన్న అసంతృప్తి సమ­యం వచ్చినప్పుడు బాంబు పేలినట్లు పేలుతుంది. అది ఎంతో దూరం ఉందని నేననుకోవ­డం లేదు. సమీప భవిష్యత్తులో మళ్లీ పాలన మన భుజాల మీదనే పడుతుంది. తెలంగాణకు భవిష్యత్తు బీఆర్‌ఎస్‌ జెండానే ..’అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నా­రు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భా­గంగా ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారీ ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. సరైన పంథా లేక 1969 ఉద్యమం విఫలం ‘నాడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ 1969 ఉద్యమం సరైన పంథా లేకపోవడంవల్ల ఘోరంగా విఫలమైంది. 1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్‌ ప్రధాన అంశంగా ఉండేవి. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను ఇక్కడి నుంచి పంపించాలని ఇక్కడి యువత పోరాటం చేశారు. అయితే ముల్కీ రూల్స్‌ వ్యతిరేక పోరాటంలో రాజ్‌భవన్‌ దగ్గర 8 మంది విద్యార్థులను కాల్చి చంపారు. ఉద్యమం సమసిపోయింది. తెలంగాణ రాలేదు. ఆ తర్వాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. ముల్కీ రూల్స్‌ ఉద్యమం లీగల్‌ బ్యాటిల్‌గా సుప్రీంకోర్టుకు వెళ్లింది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో 1973లో ముల్కీ రూల్స్‌ కొనసాగుతాయని తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. దాంతోటి ఆంధ్రాలో వెంటనే జై ఆంధ్రా ఉద్యమం మొదలుపెట్టిన్రు. ఆ తర్వాత కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. ముల్కీ రూల్స్‌ను రద్దు చేసింది. ఇంత చేసినా తెలంగాణ నుంచి ఎవరూ నోరు మెదపలే. మారు మాట్లాడలే..’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. నాటి ఘోరాలకు జయశంకర్‌ సార్‌ సాక్షి ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణ వాది. ఆయన లాంటి మనుషులు అరుదుగా ఉంటారు. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. తెలంగాణ అస్తిత్వం కోల్పోవద్దని, తెలంగాణగనే ఉండాలని నిర్ణయించుకుని పోరాట పంథా ఎంచుకున్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించినా జయశంకర్‌ సార్‌ బెదరలేదు. పోరాట పంథాను వీడలేదు. అలా అనేక సందర్భాల్లో ఆయన బెదిరింపులను ఎదుర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని అణచడం కోసం నాటి ప్రభుత్వాలు చేసిన ఘోరాలు అన్నింటికీ ఆయన సాక్షి. 1969 ఉద్యమంలో చాలామంది పెద్దలు పోరాటం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన విజయసింహారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి పోరాటంలో అగ్రభాగాన ఉండేవారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1969లో ఇక్కడి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ విద్యార్ధిగా ఉంటూ అనేకసార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇలా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు. వాళ్లందరికీ మనం తలెత్తి మొక్కాల్సిందే..’అని బీఆర్‌ఎస్‌ అధినేత చెప్పారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీ వాడొద్దన్నారు ‘2001లో తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పటికీ 1999 నుంచే చర్చోపచర్చలు జరిగాయి. తెలంగాణ వాదులు, మేధావులతో కలిసి ఉద్యమ పంథాపై ప్రణాళికలు తయారు చేశాం. పదవులకు రాజీనామా చేసి పార్టీ పెడితే పది మంది వెంటలేరు. అప్పుడు మీటింగ్‌లు పెట్టినా పది, పదిహేను మంది కూడా వచ్చేవారు కాదు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవులు చూసుకున్నారు. అసెంబ్లీలో తెలంగాణ పదం వాడొద్దని అప్పటి స్పీకర్‌ ప్రణయ భాస్కర్‌ చెప్పారు. వెనుకబడిన ప్రాంతం అనాలని శాసనసభముఖంగా వ్యాఖ్యానించారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వాళ్లు కూడా లేరు. నేను పాలమూరులో సభ పెట్టి పోరాటం చేస్తే అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయి. కరీంనగర్‌లో సింహగర్జనను సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశాం. సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఉండాలని నేను నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది. తెలంగాణ వస్తుందని ఎవరూ ఊహించలేదు. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది..’అని కేసీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల మహా వృక్షం ‘బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తమని అంటున్నరు. మోకాలంత ఎత్తు లేనోడు కూడా మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల మహావృక్షం. ఖతం చేస్తే ఖతమైతదా? కాంగ్రెస్‌ పదేళ్లు అధికారంలో లేదు. ఖతమైందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం ఉంది. కానీ నేను బస్సు యాత్ర మొదలు పెట్టంగనే మళ్లీ అదే గర్జన కనిపించింది. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాం. మరో ఎమ్మెల్సీగా రాకేశ్‌రెడ్డి గెలువబోతున్నడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ గెలిచేది బీఆరెస్సే. 105 సీట్లు వస్తయని ఒకాయన మొన్న వచ్చి చెప్పిండు. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఒకడు 11 వస్తయన్నడు. ఇంకొకడు ఒకటే వస్తదన్నడు. రెండు నుంచి మూడు వస్తయని ఇంకో ఆయన అన్నడు. 11 వస్తే పొంగిపోయేది లేదు. తక్కువ వస్తే కుంగిపోయేది లేదు. ఎలక్షన్లు చాలా చూసినం. ఏదేమైనా భవిష్యత్తు మనదే...’అని మాజీ సీఎం చెప్పారు. కాంగ్రెస్‌ వాళ్లకు పాలన తెలియదు ‘నోటికి హద్దు లేకుండా హామీలు ఇచ్చిన్రు. ఆరునెలల్లో అంతా తలకిందులైంది. కళ్యాణలక్ష్మి, రైతుబంధు, కేసీఆర్‌ కిట్, దళితబంధు అన్నీ బందయ్యాయి. గీత కార్మికులను వేధిస్తున్నారు. కల్లు గీసి అమ్ముకునే గౌడలను జైళ్లల్ల పెడుతున్నారు. ఒకరు కాదు అన్ని వర్గాలను కాంగ్రెస్‌ మోసం చేసింది. ఇంత తొందరగ రావద్దు. కానీ అనతికాలంలోనే ఈ ప్రభుత్వం అప్రదిష్టపాలైంది. ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్‌ వాళ్లతో ఏంకాదు. వారికి పాలన తెలియదు. అనుభం లేదు. అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్ల మలుచుకోవాలో తెలుస్తలేదు..’అని కేసీఆర్‌ విమర్శించారు. లోగో ప్రజల గుండెల మీద ఉంటది ‘రాష్ట్ర ప్రభుత్వ లోగో ప్రజల గుండెల మీద ఉంటది. అప్పట్లో ఏం చేసినా, పదులు, వందల సంఖ్యలో కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకునే వాళ్లం. సమిష్టి నిర్ణయంతో చేసినం. దేవుడిచ్చిన ఆయుష్షు, చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసమే పనిచేస్తా..’అని కేసీఆర్‌ అన్నారు.

Rajdeep Sardesai said that rural people and women supported YSRCP
నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్‌ మై ఇండియా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలపై వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా నాలుక్కర్చుకుంది. యాక్సిస్‌ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ను ఇండియాటుడే శనివారం ప్రసారం చేసింది. ఈ సర్వేపై దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేయడంతో.. ఆదివారం ఇండియాటుడే టీవీలో చర్చ చేపట్టింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఐదేళ్లలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయి.డీబీటీ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్ల లబ్ది పేదలకు నేరుగా చేరాయి. జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజలు..ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వారంతా ఈ ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచారని అంచనా వేస్తున్నాం’ అని ఇండియా టుడే కన్సలి్టంగ్‌ ఎడిటర్‌ రాజీదీప్‌ సర్దేశాయ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌పై ఆదివారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగిన మార్పును నేను స్వయంగా చూసాను. పాఠశాలలు, ఆస్పత్రుల్లోచాలా మార్పు కన్పించిందన్నారు. ఈ నేపథ్యంలో మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదన్నది స్పష్టమవుతోందంటూ యాక్సిస్‌ మై ఇండియా అధినేత ప్రదీప్‌ గుప్తాకు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చురకలంటించారు.స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి.. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదేళ్లకు ఓ సారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అనుకూలించిందని ప్రదీప్‌ గుప్తా చెప్పారు. దీనిపై యాంకర్‌ రాహుల్‌ కన్వల్‌ స్పందిస్తూ.. కేజ్రివాల్‌ అరెస్టు వల్ల ఢిల్లీ, పంజాబ్‌ల్లో.. హేమంత్‌ సోరేన్‌ అరెస్టు వల్ల జార్ఖండ్‌లో ప్రజల్లో సానుభూతి రాలేదా.. అక్కడ ఎగ్జిట్‌ పోల్స్‌లో అది ప్రతిబింబించలేదేం అంటూ ప్రదీప్‌ గుప్తాను నిలదీశారు. తమిళనాడులో జయలలిత.. తెలంగాణలో కేసీఆర్‌ వరుసగా రెండు సార్లు విజయం సాధించారని ఎత్తిచూపారు.వీటిని పరిశీలిస్తే.. మీ సర్వేలో శాస్త్రీయంగా లేదేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రదీప్‌గుప్తా నీళ్లు నమిలారు. ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ 2021లో పశ్చిమ్‌ బంగాలోనూ అంచనాలు తప్పాయి. అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని తేల్చిచెప్పగా.. టీఎంసీ ఘనవిజయం సాధించింది. ఇక గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఆ సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. కానీ.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చింది.

China National Space Administration: China lands Change 6 sample-return probe on far side of the moon
China National Space Administration: చంద్రుని ఆవలి వైపుకు చాంగే6

బీజింగ్‌: చంద్రుని ఆవలివైపు చైనా చాంగే6 ల్యాండర్‌ విజయవంతంగా దిగింది. అక్కడి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధృవ అయిట్‌కెన్‌(ఎస్‌పీఏ) బేసిన్‌ వద్ద బీజింగ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు విజయవంతంగా అది దిగిందని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మిని్రస్టేషన్‌(సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది. చాంగే6లో ఒక ఆర్బిటార్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్‌ ఉన్నాయి. మే మూడో తేదీన చాంగే6ను చైనా ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్ష్యలో, తర్వాత చంద్ర కక్ష్యలో తిరిగింది. చాంగే6లో ఆర్బిటార్‌–రిటర్నర్, ల్యాండర్‌–అసెండర్‌ జతలు ఉన్నాయి. ఆర్బిటార్‌–రిటర్నర్‌ జత నుంచి ల్యాండర్‌–అసెండర్‌ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటార్‌–రిటర్నర్‌ జత చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది. కీలకమైన ల్యాండింగ్‌ ల్యాండర్‌–అసెండర్‌ జత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్‌ అవడమే ఈ మొత్తం మిషన్‌లో అత్యంత కీలకమైన దశ. దిగేటపుడు మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ, కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్‌ ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండర్‌–అసెండర్‌ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్‌హువా వార్తాసంస్థ పేర్కొంది. ఎస్‌పీఏ బేసిన్‌లోని అపోలో బేసిన్‌లో ఇది దిగింది. భూమి వైపు కంటే ఆవలి వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సీఏఎస్‌సీ అంతరిక్ష నిపుణుడు హుయాంగ్‌ హావో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్‌ 14 గంటల్లోపు రెండు రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్‌ చేసి కొంత, రోబోటిక్‌ చేయితో మరికొంత ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్‌ చంద్రునికి ఆవలివైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్‌ ఇవ్వడం అసాధ్యం. అందుకే కమ్యూనికేషన్‌కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో–2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్‌ ద్వారా చాంగే–6 ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు.మళ్లీ భూమి మీదకు సేకరించిన మట్టిని ల్యాండర్‌ అసెండర్‌లోకి చేరుస్తుంది. అసెండర్‌ రాకెట్‌లా నింగిలోకి దూసుకెళ్లి ఆర్బిటార్‌–రిటర్నర్‌ జతతో అనుసంధానమవుతుంది. రిటర్నర్‌ మాడ్యూల్‌లోకి మట్టిని మార్చాక రిటర్నర్‌ అక్కడి నుంచి భూమి దిశగా బయల్దేరుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్‌ 25వ తేదీన రిటర్నర్‌ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవలివైపు మట్టిని తీసుకొచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది.

వాన కురుస్తుండగా ట్యాంక్‌బండ్‌పై అందెశ్రీ, కీరవాణిలకు జ్ఞాపికలు  అందజేస్తున్న గవర్నర్‌ రాధాకృష్ణన్‌. చిత్రంలో సీఎం రేవంత్, భట్టి
ఇక ప్రపంచంతోనే పోటీ: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచానికి తెలంగాణ ఒక దిక్సూచి కావాలని.. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాల్లో సగర్వంగా ఎగరాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ పల్లెలు పాడి పంటలతో వెలగాలని.. ఒకనాడు పొట్ట చేతపట్టుకుని పట్నాలకు వెళ్లిన యువత రేపటి రోజున ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో కాదు ఏకంగా ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను సమున్నతంగా నిలపాలని.. ఆ శక్తి, సత్తువ, తెలివి మనకు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌ మన బ్రాండ్, ప్రపంచ నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆ దిశలో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, వ్యవస్థల సహకారం కావాలని కోరారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళి అర్పిస్తున్నా. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాం«దీలకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రత్యేక శ్రద్ధతో మన చిరకాల వాంఛను నెరవేర్చిన సోనియా గాందీ, నాటి లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్, నాటి బీజేపీ ముఖ్య నేత సుష్మా స్వరాజ్‌ ఈ ముగ్గురు తల్లులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. దశాబ్ది ఉత్సవానికి సోనియా గాం«దీని ఏ హోదాలో ఆహ్వానించారని కొందరు ప్రశ్నించారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాగాం«దీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ ఊరుకోదు.. పెత్తనాన్ని ప్రశ్నిస్తాం, ప్రేమను పంచుతాం, ఆకలిని తట్టుకుంటాం.. కానీ స్వేచ్ఛను హరిస్తే భరించలేం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం దాని సొంతం. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ‘ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం’ అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. రాష్ట్రంలో ప్రజాపాలన తెచ్చాం.. డిసెంబరు 7 నుంచి రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. ప్రగతిభవన్‌ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సచివాలయంలోకి సామాన్యుడు కూడా రాగలిగేలా చేశాం. ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు లేవు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలను సాధించినప్పుడే తెలంగాణ సాధనకు సార్థకత. రాజకీయ విమర్శల జోలికి పోవడం లేదు.. కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలం. గత పదేళ్లలో స్వేచ్ఛపై దాడి పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపైనా దాడి జరిగింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. సంస్కతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. అది గతం.. ఇప్పుడు ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం వచ్చింది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకొంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే దీనికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. సంక్షేమం దిశగా ముందడుగు.. అభయ హస్తం గ్యారంటీలకు కోటి తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది. మేం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెచ్చాం. వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ అన్నది కాంగ్రెస్‌ పేటెంట్‌. దీనికింద చికిత్సల పరిమితిని రూ.పది లక్షలకు పెంచాం. 70 రోజుల్లోనే 30వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్‌–1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చాం. తొలిదశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాం. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి పేద మహిళలకు బాసటగా నిలుస్తున్నాం. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నాం. దావోస్‌ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుని.. అవి కార్యరూపం దాల్చేలా కార్యచరణ మొదలుపెట్టాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుంటాం. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానికి కాలం చెల్లింది. ఏపీతో ఆస్తుల విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరం.. అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చేందుకు రాష్ట్రం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. భావి తెలంగాణ నిర్మాణానికి ఈ రెండు ఇప్పుడు కీలక అంశాలు. బోనం నుంచి బతుకమ్మ వరకు.. సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్ర ఉద్యమం వరకు.. సమ్మక్క–సారలమ్మ నుంచి జోగులాంబ వరకు.. భద్రాద్రి రాముడి నుంచి కొమురం భీం వరకు మన సంస్కృతి, చరిత్ర గొప్పవి. వీటి పునరుజ్జీవనం జరగాలి. – పదేళ్ల తెలంగాణకు రాష్ట్ర గీతం లేకపోవటం దారుణం. ఉద్యమకాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తినిచ్చిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..’ గేయం ఇక నుంచి మన రాష్ట్ర అధికార గీతం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు. – తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అవి ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. అందుకోసం వివిధ వర్గాల సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం. – ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్‌లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా టీజీ ఉండాలన్న ప్రజాభీష్టాన్ని గౌరవిస్తూ ఆ మేరకు చర్యలు తీసుకున్నాం. – నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండేలా తెలంగాణ తల్లి రూపాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో పునరుజ్జీవనం జరగాల్సి ఉంది. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే. ఆర్థిక పునరుజ్జీవానికి చర్యలిలా.. గత పదేళ్ల ఇష్టారాజ్య పాలనతో రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుంది. మా పాలనలో ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్‌కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు ‘గ్రీన్‌ తెలంగాణ–2050 మాస్టర్‌ ప్లాన్‌’ తయారు చేస్తున్నాం. – ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్‌ తెలంగాణ.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ప్రాంతం సబర్బన్‌ తెలంగాణ.. రీజనల్‌ రింగ్‌ రోడ్డు అవతల రాష్ట్ర సరిహద్దుల వరకు గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం. – మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నాం. దీనికోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. రీజనల్‌ రింగ్‌ రోడ్డును వీలైనంత తొందరలో పూర్తి చేసేలా ప్రయతి్నస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. – ఉద్యమకాలంలో పోరాటపంథాలో ఉన్న యువకుల్లో కొందరు ఇప్పుడు డ్రగ్స్‌కు బానిసయ్యారు. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్‌ అన్న మాట వినిపించడానికి వీలు లేకుండా చేస్తాం. ఈ విషయంలో తప్పు చేసేవారు ఏస్థాయి వారైనా ఉపేక్షించం.

T20 World Cup results: West Indies beat Papua New Guinea by five wickets
విండీస్‌ శ్రమించి...

గయానా: టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న రెండో దేశం వెస్టిండీస్‌ కూడా టోర్నిలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్‌ విండీస్‌ ఓటమి అంచుల్లోంచి బయటపడి 5 వికెట్ల తేడాతో పపువా న్యూగినీ జట్టుపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్లు టోని వుర (2), అసద్‌ వాలా (21), లెగా సియాక (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సెసె బావు (43 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. చార్లెస్‌ అమిని (12)తో ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 98 వద్ద ఆరో వికెట్‌గా సెసె బావు నిష్క్రమించగా, కిప్లిన్‌ డొరిగా (18 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో పపువా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. విండీస్‌ బౌలర్లలో రసెల్, జోసెఫ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోస్టన్‌ చేజ్‌ (27 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విండీస్‌ను ఒడ్డున పడేసే ఆట ఆడాడు.సులువైన ప్రత్యర్థే అయినా... ఏమంత కష్టం కానీ లక్ష్యమే ఎదురైనా... వెస్టిండీస్‌ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్, పూరన్‌ ఉన్నంత వరకు 8 ఓవర్లలో విండీస్‌ 61/1 స్కోరు చేసింది. గెలిచేందుకు 72 బంతుల్లో 76 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూరన్‌ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కింగ్‌ (29 బంతుల్లో 34; 7 ఫోర్లు) అవుటయ్యాక పరిస్థితి మారింది. కెప్టెన్‌ రొవ్‌మన్‌ పావెల్‌ (15), రూథర్‌ఫోర్డ్‌ (2) వికెట్లు పారేసుకోవడంతో సమీకరణం 24 బంతుల్లో 40 పరుగుల వద్ద కష్టంగా కనిపించింది. ఈ దశలో రసెల్‌ (9 బంతుల్లో 15 నాటౌట్‌; 1 సిక్స్‌) వచ్చాక చేజ్‌ ధాటిగా ఆడాడు. 18వ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్‌ బాది 18 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లోనూ చేజ్‌ 2 ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్‌ ఆఖరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది.

Sakshi Guest Column On Pulivendula
ప్రాంతీయ, రాజకీయ స్వభావాలు ఒకటి కాదు!

పులివెందుల ప్రజల గురించీ, ఇక్కడి సంస్కృతి గురించీ అభ్యంతరకరంగా మాట్లాడ్డం ఇవ్వాళ ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ ప్రాంత ప్రజల పట్ల విషం కక్కడం పెరిగిపోయింది. ఇక్కడ జరిగే రాజకీయ సంఘటనలన్నింటికీ మొత్తం పులివెందుల ప్రజలనూ, ఆ ప్రాంతాన్నీ, సంస్కృతినీ తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే పులివెందుల ప్రజల పట్ల మిగతా ప్రాంతాల్లో ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించడంలో మీడియా, సినిమా వాళ్లూ, రాజకీయనాయకులూ సఫలీకృతమయ్యారు. ఇప్పుడు సోషల్‌ మీడియా కూడా తోడవడంతో చివరికి ఈ ధోరణి ఎక్కడికెళ్లి ఆగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ముద్ర మొత్తం రాయలసీమకు ఉంది. ఇక్కడ లేని జీవితాన్ని ఇక్కడిదిగా చూపించి డబ్బు చేసుకోవడంలో సినిమా వాళ్లు ముందున్నారు. ఇవ్వాళ ఏ సినిమా రంగమైతే రాయలసీమనూ... అందులోనూ పులివెందుల వంటి ప్రాంతాలనూ నేరపూరితంగా చూపిస్తూ ఉందో, ఆ రంగానికి ఇక్కడి ప్రజలు చేసిన సేవ అంతా ఇంతా కాదు. సినిమారంగంలో మొత్తం దక్షిణ భారతదేశంలోనే తొలి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన బీఎన్‌ రెడ్డి పులివెందుల ప్రాంతం వాడే. ఈయన తీసిన ‘స్వర్గ సీమ’, ‘బంగారు పాప’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు కళాఖండాలు. ‘వాహిని’ సంస్థను స్థాపించి ఈయన సృష్టించిన చిత్రరాజాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే వచ్చిన బి. నాగిరెడ్డి కూడా సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. విజయా సంస్థను ప్రారంభించి ఈయన నిర్మించిన ‘పాతాళ భైరవి’, ‘మాయా బజార్‌’, ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’, ‘షావుకారు’ వంటి సినిమాలు అజరామరమైనవి. పత్రికా రంగంలోనూ బి. నాగిరెడ్డి అపార కృషి చేశారు. చక్రపాణితో కలసి ‘చందమామ’ పత్రికను ప్రారంభించారు. అప్పటి తరం పిల్లలు చందమామ చదవకుండా పెరగలేదంటే అతిశయోక్తి కాదు. మోరార్జీ దేశాయ్‌ వంటి మాజీ ప్రధాని కూడా బి. నాగిరెడ్డిని చందమామతోనే గుర్తు పెట్టుకుని ‘చందమామ రెడ్డిగారు’ అని పిలిచేవారట. తర్వాత ఆయన మహిళల కోసం ‘వనిత’, సినిమా పాఠకుల కోసం ‘విజయ చిత్ర’ వంటి పత్రికలను నడిపారు. అలనాటి హాస్య నటుడు పద్మనాభం, ‘షో’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ ప్లే అవార్డు పొందిన నీలకంఠ వంటి వారు కూడా ఈ ప్రాంతం వారే. ఇక్కడ పుట్టిన రచయితలు మొదటి నుంచి అభ్యుదయ వాదులు. తమ రచనల్లో మానవత్వం, స్త్రీ హక్కులు, రైతు జీవితం, సామరస్య భావాల గురించి రాశారు. ‘తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది – డ్రైనేజి స్కీము లేక... డేంజరుగా మారుతోంది’ అన్న ప్రముఖ హేతువాద జర్నలిస్టు గజ్జల మల్లారెడ్డి ఇక్కడి వాడే. తెలుగు సాహిత్య విమర్శ దిగ్గజం రాచమల్లు రామచంద్రారెడ్డి, కథకులు వైసీవీ రెడ్డి, నాద మునిరాజు, అరవేటి శ్రీనివాసులు, కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందిన వేంపల్లె షరీఫ్‌ వంటి వాళ్లు ఇక్కడివాళ్లే. ఎక్కువమంది వ్యవసాయం చేసి బతుకుతారు. ఒకప్పుడు చిరుధాన్యాలతోపాటు వేరుశనగ విపరీతంగా పండేది. ఇప్పుడు రైతులు చీని, నిమ్మ తోటలను పెంచుతున్నారు. వందల అడుగుల లోతులో బోర్లు వేస్తే కానీ నీళ్లు పడని స్థితి. తమతోపాటు పొలాల్లో పనిచేసి తమకింత తిండి పెట్టే మూగజీవాలను ఇక్కడివాళ్లు ఇంటి మనుషుల కిందే చూసుకుంటారు. అవి చనిపోతే మనుషులతో సమానంగా అంత్యక్రియలు చేస్తారు. మధ్యాహ్నం ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపరు. ఆడపిల్లలందరినీ వాళ్ల వయసుతో నిమిత్తం లేకుండా గౌరవంగా ‘అమ్మా’ అని పిలుస్తారు. అత్యంత గౌరవ మర్యాదలకూ, సున్నితత్వానికీ, సహ జీవన సంస్కృతికీ నెలవు ఇక్కడి నేల. అందుకే ఇక్కడి నుంచి అంతమంది కళాకారులు రాగలిగారు. పెద్దన లాంటి వాళ్లు ‘ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మయినా చేవే’ అన్నారంటే ఇదే కారణం. అదంతా వదిలేసి కేవలం కళ్లముందు జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇక్కడి వాళ్లంతా దుర్మార్గులు అన్నట్టు, ఇక్కడి సంస్కృతి అంతా ఆటవిక సంస్కృతి అన్నట్టు రాజకీయనాయకులు మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి రాజకీయ స్వభావమూ, ప్రాంతీయ స్వభావమూ ఒకటి కాదు. ఏ ప్రాంతంలో అయినా రాజకీయం అన్నింటికీ అతీతమైంది. దానికి ఎల్లలు లేవు. అది పెట్టుబడి దారులతో కలసి దేశవ్యాప్తంగానే అన్ని రకాల వ్యవస్థలనూ, మానవీయ విలువలనూ ధ్వంసం చేస్తోంది. ఒక దశలో ప్రజాస్వామ్యానికి మూల సూత్రమైన ప్రజలను సైతం నిర్లక్ష్యం చేసి కేవలం డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులతో అధికారం చేపట్టే దశకు వచ్చింది. ఇలాంటి రాజకీయాల్లో ఎవరూ ప్రశ్నలు, విమర్శలకు అతీతులు కాదు. అయితే ఆ ముసుగులో తమకు గిట్టని లేదా ఓటేయని ప్రాంతాలను ఆ యా స్థానిక రాజకీయ నాయకుల చర్యలతో కలిపి నిందించడం కరెక్టు కాదు. ముఖ్యంగా పులివెందుల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు కడప ఎంపీగా, రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి, తరువాత వచ్చిన ఆయన తనయడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విషయంలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.జగన్‌పై రాజకీయ విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా ఒక వర్గం మీడియా, నేతలు మొత్తం పులివెందుల ప్రాంతాన్నీ, అక్కడి ప్రజలనూ నిందిస్తూ మాట్లాడుతున్నారు. విచక్షణతో రాజకీయ విమర్శలను రాజకీయాలకు లేదా రాజకీయ వ్యక్తుల వరకే పరిమితం చేస్తే బావుంటుంది. అలా కాకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే పులివెందుల ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు తగిన కార్యాచరణతో సదరు మీడియా, రాజకీయ నేతల ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుంది. – డా‘‘ వేంపల్లె షరీఫ్‌జర్నలిస్టు, రచయిత ‘ 96034 29366

Sajjala RamaKrishna Reddy Key Instructions YSRCP Polling Agents
కౌంటింగ్‌లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. కౌంటింగ్‌ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ​కాబట్టి మన వాళ్లు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు అని సూచించి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.కాగా, ఎన్నికల కౌంటిగ్‌ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్‌ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలి. కౌంటింగ్‌ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి.పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానుం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనం గెలుస్తున్నాం. నేషనల్‌ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారు. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు.ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే కౌంటింగ్‌ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలి’ అని సూచనలు చేశారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement