తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత

Published Sun, Apr 15 2018 11:27 AM

Yadava Members Protest At Tallayapalem Sri Saivakshetram - Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్త చోటుచేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించడాన్ని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శైవక్షేత్ర ముట్టడికి యాదవ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడికి చేరుకున్న యాదవులు శైవక్షేత్రాన్ని ముట్టడించే యత్నం చేశారు. 

ముందు జాగ్రత్తగా శైవక్షేత్రం వద్ద భారీగా మోహరించిన పోలీసులు యాదవ సంఘాలను అడ్డుకున్నారు. అయినా శైవక్షేత్రంలోకి ప్రవేశించేందుకు యత్నించిన కొందరు యాదవులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాదవ సంఘ నాయకులను పోలీసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. 

శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నామని, పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని పీఠాధిపతి శివస్వామి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
(టీటీడీ చైర్మన్‌గా ఆయన తప్ప, ఎవరైనా సరే!)

Advertisement
Advertisement